ఆయన తిట్టినప్పుడు నా తండ్రి తిట్టారనుకున్నా..
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ రధన్ హైదరాబాద్ కు వచ్చి మీడియాతో ముచ్చటించారు.
By: Tupaki Desk | 10 April 2025 1:00 PM ISTయాంకర్ గా ఎన్నో షో లకు హోస్ట్ గా వ్యవహరించిన ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరోగా సక్సెస్ అందుకుని తన సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రదీప్ హీరోగా చేస్తున్న రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఏప్రిల్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ రధన్ హైదరాబాద్ కు వచ్చి మీడియాతో ముచ్చటించారు.
ఎప్పుడూ చెన్నైలోనే ఉండే రధన్ మ్యూజిక్ సిట్టింగ్స్, కంపోజిషన్ అన్నీ చెన్నైలోనే చేస్తుంటారు. రధన్ పై తెలుగు సినీ మేకర్స్ ఎక్కువ కంప్లైంట్స్ చేస్తుంటారనే సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా టైమ్ లో కూడా సందీప్ రెడ్డి వంగా రధన్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
రధన్ తన టైం మొత్తం వృధా చేశాడని, ఇవ్వాల్సిన టైమ్ కు పాటలు ఇచ్చేవాడు కాదని, ఎక్కువ టైమ్ తీసుకున్నాడని ఎన్నో కంప్లైంట్స్ చేశారు సందీప్ రెడ్డి. ఆయనే కాదు, సిద్ధార్థ్ రాయ్ సినిమా డైరెక్టర్ కూడా రధన్ పని తీరును తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌కు వస్తే తాట తీస్తామనే రేంజ్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు.
టైమ్ కు పాటలు ఇవ్వకపోగా, ఫోన్లు చేస్తే సరిగా రెస్పాండ్ అయ్యే వాడు కాదని, అతని వల్లే సినిమా లేట్ అయిందని రధన్ పై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ వివాదంపై తాజాగా రధన్ రెస్పాండ్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగా తనకు తండ్రి లాంటి వారని, నాన్న తిడితే బయటకు వచ్చి విమర్శలు చేస్తామా? అంటూ ఎంతో పాజిటివ్ గా మాట్లాడారు.
అర్జున్ రెడ్డితో ఛాన్స్ ఇచ్చారని, తన డ్యూటీ తాను చేశానని, మంచి మ్యూజిక్ ఇచ్చానని, ఆయన మాటల్ని, తిట్లను తానెప్పుడూ పట్టించుకోలేదని, నాన్న తిడితే బాధపడం కదా అలానే ఇది కూడా అన్నారు రధన్. ఆయన మాట తీరు కొంచెం కఠినంగా ఉంటుందని, తనతోనే కాదు ఎవరితోనైనా ఆయన అలానే మాట్లాడతారని రధన్ తెలిపారు.
ఆ తర్వాత హుషారుకు మంచి సాంగ్స్ ఇచ్చానని, అనుదీప్ తో కలిసి జాతి రత్నాలు చేశానని, అనుదీప్ చాలా నిదానంగా ఉంటారని, అందరూ ఒకేలా ఉండాలని రూలేం లేదు కదా అంటూ తన వెర్షన్ లో మాట్లాడారు రధన్. ఎవరేమన్నా మ్యూజిక్కే తన ఫస్ట్ ప్రియారిటీ అని, మంచి మ్యూజిక్ ఇచ్చామా, ఆడియన్స్ ను మెప్పించామా అనేదే తనకు ముఖ్యమని రధన్ తెలిపారు.
