'తెలుసు కదా' రాశి ఖన్నాకు...!
ఊహలు గుసగుసలాడే సినిమాతో దశాబ్ద కాలం క్రితం హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఆ సినిమా నటిగా రాశి ఖన్నాకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.
By: Tupaki Desk | 8 Jun 2025 8:30 AM ISTఊహలు గుసగుసలాడే సినిమాతో దశాబ్ద కాలం క్రితం హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఆ సినిమా నటిగా రాశి ఖన్నాకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ సినిమా కమర్షియల్‌గా కూడా మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. అందుకే రాశి ఖన్నా చాలా సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచింది. టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో చాలా మందికి జోడీగా నటించడం ద్వారా నాలుగు... ఐదేళ్ల పాటు బిజీ బిజీగా సినిమాల్లో నటించింది. ఒకానొక సమయంలో ఈమె ఏడాదికి నాలుగు అయిదు సినిమాల్లో కనిపించింది.
ఈమధ్య కాలంలో టాలీవుడ్ కి రాశి ఖన్నా దూరం అయింది. తెలుగు సినిమాల్లో ఈమె చివరిగా కనిపించి రెండేళ్లకు పైగా అయింది. ఈమె నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమాలో చివరగా కనిపించింది. 2022లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. పైగా అంతకు ముందు ఈమె చేసిన తెలుగు సినిమాలు కూడా అంతంత మాత్రమే అన్నట్లుగా ఆడటంతో మెల్ల మెల్లగా ఆఫర్లు తగ్గాయి. అదే సమయంలో తెలుగులో వచ్చే చిన్నా చితకా ఆఫర్లను కాదని కోలీవుడ్‌లో రాశి ఖన్నా బిజీ అయింది. తెలుగులో సినిమా ఆఫర్లు రాకున్నా కోలీవుడ్, బాలీవుడ్‌లో ఈ అమ్మడు నటించి మెప్పించింది.
టాలీవుడ్‌లో 'థాంక్యూ' సినిమా తర్వాత రాశి ఖన్నా ఎట్టకేలకు 'తెలుసు కదా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా కాలం క్రితమే రావాల్సిన ఈ తెలుసు కదా సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలకు సంబంధించిన ప్రకటన వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమా జోనర్ ఏంటి... ఎలాంటి కంటెంట్ ఈ సినిమాలో ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ సరదాగా ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
సిద్దు జొన్నలగడ్డకు జోడీగా రాశి ఖన్నాతో పాటు కేజీఎఫ్ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి సైతం హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి కాంబోలో ఉండే సీన్స్ వినోదాత్మకంగా ఉంటాయని ఇటీవల విడుదల అయిన ప్రమోషన్ వీడియోను చూస్తే అనిపిస్తుంది. తెలుగు కదా సినిమా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగే ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో సినిమాలో రాశి ఖన్నా పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో చాలా కాలం తర్వాత కనిపించబోతున్న రాశి ఖన్నాకు తెలుసు కదా అయినా మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుసు కదా హిట్ అయితే టాలీవుడ్‌లో మరో రెండు మూడు ఏళ్ల పాటు రాశి ఖన్నా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది.
