Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కి రాశీఖ‌న్నా స‌ల‌హాలు!

బాలీవుడ్ వ‌రుస వైఫ‌ల్యాల నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు స్టార్ హీరోలంతా స‌ల‌హాలు జారీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 April 2025 12:50 PM IST
బాలీవుడ్ కి రాశీఖ‌న్నా స‌ల‌హాలు!
X

బాలీవుడ్ వ‌రుస వైఫ‌ల్యాల నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు స్టార్ హీరోలంతా స‌ల‌హాలు జారీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌లు మూస ధోర‌ణి వ‌దిలి కొత్త ప‌ద్ద‌తిలో సినిమాలు తీయాలంటూ ప్ర‌త్యేకంగా తెలుగు ప‌రిశ్ర‌మ‌ను చూసి నేర్చుకోవాలంటూ స‌ల‌హాలు వెళ్తున్నాయి. అమితాబ‌చ్చ‌న్, అమీర్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు ఇప్ప‌టికే త‌మ అభిప్రాయాల్ని ఎంతో ఓపెన్ గా షేర్ చేసుకున్నారు.

పాన్ ఇండియాలో మ‌నం ఎందుకు వెనుక‌బ‌డుతున్నాం? అన్న‌ది విశ్లేషించుకుని ఆ మార్కెట్ ను అందుకోవ‌డానికి స‌మిష్టిగా చేయాల్సింది చేద్దామంటూ కొంత మంది హీరోలు ముందుకొచ్చారు. కానీ ఈ ప్ర‌పోజ‌ల్ విష‌యంలో ఏ ద‌ర్శ‌క‌, నిర్మాత బాలీవుడ్ నుంచి స్పందించ‌లేదు. మ‌న‌క‌న్నా ఎవ‌రు గొప్ప‌గా సినిమాలు తీయ‌గ‌ల‌రు? అన్న ధోర‌ణిలోనే ఇంకా క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ మారాలంటూ రాశీఖ‌న్నా కూడా తోచిన స‌ల‌హా ఇచ్చింది.

ఈ మ‌ధ్య కాలంలో దక్షిణాది చిత్రాలు అనువాద రూపంలో అన్ని భాష‌ల్లో అన్ లైన్ లో అందుబాటులో ఉంటున్నాయి. అందువ‌ల్ల ఆ సినిమాలు రీమేక్ చేసినా బాలీవుడ్ లో మంచి ఫ‌లితాలు సాధించ‌డం లేదు. ఈ విష‌యంలో బాలీవుడ్ చాలా మారాల్సిన అవ‌స‌రం ఉంది. మూస ధోర‌ణి వ‌దిలి క‌థ‌ల విష‌యంలో మ‌రింత లోతుగా విశ్లేషించ‌గ‌ల‌గాలి. ప్ర‌స్తుతం ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు.

అలాంటి సినిమాల్లో స్టార్లు లేక‌పోయినా ఆద‌రిస్తున్నారు. ఓటీటీ లు కూడా కొత్త కాన్సెప్ట్ ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమాల్ని మించి వినూత్న‌మైన కాన్సెప్ట్ ఓటీటీ కంటెంట్ అల‌రిస్తుంది. ఆ పోటీని ఎదుర్కుని థియేట్రిక‌ల్ మార్కెట్ లో నిల‌బ‌డాలంటే? అంత‌కు మించిన వ్యూహంతో ముందు కెళ్లాల్సిన అవ‌స‌రం అంతే ఉంద‌ని సూచించింది.