కథ డిమాండ్.. హీరోయిన్‌కి రియల్ గాయం!
సాధారణంగా యాక్షన్ సీన్స్ షూటింగ్ సమయంలో హీరో గాయ పడ్డాడు అనే వార్తలు ఎక్కువగా వింటూ ఉంటాం.
By: Tupaki Desk | 20 May 2025 2:01 PM ISTఒకప్పుడు హీరోయిన్స్ చాలా సుకుమారంగా ఉండేవారు... అప్పట్లో హీరోయిన్స్ పెద్దగా వర్కౌట్స్ చేయడం, యాక్షన్ సీన్స్ చేయడం వంటివి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలి అంటే కచ్చితంగా గట్టిగా కష్టపడాల్సిందే. స్టార్ హీరోయిన్స్ అయినా సరే కచ్చితంగా ఏదో ఒక సమయంలో యాక్షన్ సీన్స్ కోసం కష్టపడాల్సిందే. అందంగా నాజూకుగా కనిపించడం కోసం ప్రతి రోజూ గంటల తరబడి వర్కౌట్లు చేయాలి, నోరు కట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే ఇండస్ట్రీలో నెగ్గుకు వచ్చే అవకాశం ఉంటుంది. కథ డిమాండ్ చేస్తే రియల్ స్టంట్స్ చేయాలి, కొన్ని సార్లు గాయాలను సైతం లక్ష్యపెట్టకుండా కష్టపడాలి.
సాధారణంగా యాక్షన్ సీన్స్ షూటింగ్ సమయంలో హీరో గాయ పడ్డాడు అనే వార్తలు ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ గాయ పడటం, వారు యాక్షన్ సన్నివేశాల కోసం భారీ జంప్‌లు చేయడం, రిస్కీ షాట్స్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈతరం హీరోయిన్స్ యాక్షన్ సీన్స్‌ను హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చేస్తూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. అంత ఈజీగా యాక్షన్ సీన్స్ చేస్తున్నారు అంటే కచ్చితంగా వారు మొదటి నుంచి వర్కౌట్స్ చేస్తూ ఉన్నారని అర్థం. కథ డిమాండ్ మేరకు యాక్షన్ సీన్స్ చేస్తూ గాయ పడ్డ హీరోయిన్స్ జాబితాలో మరో సుకుమారి హీరోయిన్ రాశి ఖన్నా చేరింది.
అందంగా, ముద్దుగా ఉండే రాశి ఖన్నా గతంలోనూ కొన్ని సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో కనిపించి మెప్పించింది. ఒక సినిమాలో ఏకంగా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా, ఒక ఫైట్ సీన్ చేయడం ద్వారా అందరూ నోరు వెళ్లబెట్టే విధంగా చేసింది. రాశి ఖన్నా ప్రస్తుతం ఫర్జి 2 సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రాశి ఖన్నా ఒక యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా అనూహ్యంగా గాయం అయిందట. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో రాశి ఖన్నా చేతికి గాయం అయింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసి కథ డిమాండ్ చేస్తే ఇలా గాయాల పాలు కావాల్సిందే అంటూ కామెంట్ పెట్టింది.
హీరోయిన్ రాశి ఖన్నా చేతికి, మొహంపై అయిన గాయాల ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. ముద్దుగుమ్మ రాశి ఖన్నా సినిమా కోసం ఎంతగా కష్టపడుతుందో అంటూ కొందరు నెటిజన్స్ ప్రశంసిస్తూ కామెంట్ చేశారు. మొత్తానికి రాశి ఖన్నా తన గాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అందరి అటెన్షన్‌ను దక్కించుకుంది. అంతే కాకుండా ఒక సినిమా కోసం తాను ఎంతగా కష్టపడేది చెప్పకనే చెప్పింది. ముందు ముందు రాశి ఖన్నా నుంచి మరిన్ని యాక్షన్ సినిమాలను, యాక్షన్ సీన్స్‌ను ఆశించవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కి కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. తెలుగు కదా సినిమాలో రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లోనూ ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే.
