Begin typing your search above and press return to search.

మొత్తం లెక్కలు మార్చేయనున్న టీజర్

పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఇలాంటి దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడమేంటి అంటూ కొన్ని రోజులు నెగెటివ్ ట్రెండ్స్ కూడా చేశారు.

By:  Tupaki Desk   |   30 April 2025 9:49 PM IST
మొత్తం లెక్కలు మార్చేయనున్న టీజర్
X

రాజా సాబ్.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం. ఇప్పటిదాకా మిడ్ రేంజ్ చిత్రాలే చేసిన మారుతి దర్శకత్వంలో ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడు ప్రభాస్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. అతను పెద్ద సినిమాలు తీయకపోవడం ఒక్కటే కాదు సమస్య. మారుతి చివరి చిత్రం ‘పక్కా కమర్షియల్’ పెద్ద డిజాస్టర్ అయింది. అంతకుముందు చిత్రాలు కూడా సరిగా ఆడలేదు.

పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఇలాంటి దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడమేంటి అంటూ కొన్ని రోజులు నెగెటివ్ ట్రెండ్స్ కూడా చేశారు. అందుకే ఈ చిత్రం మొదలైనపుడు అధికారిక ప్రకటన కూడా ఇవ్వలేదు. మేకింగ్ దశలో కూడా కొన్ని రోజులు మౌనం పాటించారు. ఐతే ఫస్ట్ గ్లింప్స్‌లో ప్రభాస్‌ను చాలా అందంగా, ఆకర్షణీయంగా చూపించాక ఫ్యాన్స్ కొంచెం చల్లబడ్డారు. ఆ తర్వాత వచ్చిన మోషన్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి.

ఐతే మోషన్ పోస్టర్ వచ్చి చాలా రోజులైంది. మధ్యలో ఏ అప్‌డేట్ లేదు. సినిమా కూడా వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత నిరాశలో ఉన్నారు. కానీ ఆ నిరాశనంతా పోగొట్టి సినిమా మీద అంచనాలు కొన్ని రెట్లు పెంచేలా టీజర్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ టీజర్లో కంటెంట్ చూసిన వాళ్లు సినిమాకు మామూలు ఎలివేషన్ ఇవ్వట్లేదు. ఇన్ని రోజులు అనుకున్నట్లు ఇది మిడ్ రేంజ్ మూవీ కాదని.. ప్రభాస్ కొన్నేళ్ల నుంచి చేస్తున్న భారీ చిత్రాలకు ఏమాత్రం తీసిపోదని.. విజువల్స్, కంటెంట్ వేరే లెవెల్లో ఉంటాయని అంటున్నారు. మేకింగ్ ముందుకు సాగేకొద్దీ సినిమా మీద నమ్మకం పెరిగి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి, క్వాలిటీ పెంచాలని మేకర్స్ భావించారట.

అందుకే సినిమా ఆలస్యం అవుతోంది కూడా. ఫౌజీ, కల్కి-2, సలార్-2, స్పిరిట్.. ఇలా ప్రభాస్ రాబోయే చిత్రాలకు ఏమాత్రం తీసిపోని హైప్ ఈ చిత్రానికి తీసుకురాగల విషయం ఈ సినిమాలో ఉందంటున్నారు. త్వరలోనే ప్రభాస్ డబ్బింగ్ పూర్తి చేస్తే.. ఇంకొన్ని రోజుల్లోనే టీజర్‌ను లాంచ్ చేస్తారట. టీజర్ చూశాక ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చల్లో అతిశయోక్తి ఏమీ లేదని అభిమానులు కూడా ఒప్పుకుంటారట.