Begin typing your search above and press return to search.

ఈ న‌టుడికి కులం లేదు మతం లేదు.. మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ వ్యక్తిగత విశ్వాసాలకు గౌరవం కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు ఒక చారిత్రాత్మక ఆదేశాన్ని జారీ చేసింది.

By:  Sivaji Kontham   |   23 April 2026 10:04 AM IST
ఈ న‌టుడికి కులం లేదు మతం లేదు.. మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు
X

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ వ్యక్తిగత విశ్వాసాలకు గౌరవం కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు ఒక చారిత్రాత్మక ఆదేశాన్ని జారీ చేసింది. తనకు ఏ కులం, ఏ మతం లేదని ధృవీకరిస్తూ `నో కాస్ట్, నో రిలీజియన్` సర్టిఫికేట్ మంజూరు చేయాలని షోలింగనల్లూర్ తహసీల్దార్‌ను కోర్టు ఆదేశించింది. తన సామాజిక మూలాలకు సంబంధించి ఎలాంటి గుర్తింపును కోరుకోవడం లేదని.. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ప్రకారం ఒక పౌరుడిగా తనకు నచ్చిన విధంగా జీవించే హక్కు ఉందని పార్థిబన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

జస్టిస్ ఎం. దండపాణి ఈ పిటిషన్‌ను విచారిస్తూ.. గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నారు. కుల, మతాలకు అతీతంగా గుర్తింపు పొందాలనుకునే పౌరులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చేలా రెవెన్యూ అధికారులకు అధికారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలోనే కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్థిబన్ అభ్యర్థనలో ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని భావించిన న్యాయస్థానం.. వెంటనే ఆయనకు అవసరమైన ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశనం చేసింది.

సాధారణంగా ప్రభుత్వ పథకాలు లేదా రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం కుల ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. అయితే పార్థిబన్ వంటి ప్రముఖులు స్వచ్ఛందంగా వీటిని వదులుకోవడం సమాజంలో కొత్త చర్చకు దారితీస్తోంది. కుల రహిత సమాజాన్ని నిర్మించాలనే ఆశయంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత గుర్తింపు అనేది కేవలం కుల మతాలకే పరిమితం కాకూడదని.. మానవత్వమే ప్రాతిపదికగా ఉండాలని ఆయన ఈ చర్య ద్వారా సందేశమిచ్చారు.

అయితే ఒకవైపు పార్థిబన్ ఇలాంటి ఆదర్శవంతమైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటే.. మరోవైపు అత‌డి వ్యక్తిగత ప్రవర్తనపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా గుర్తింపు ఉన్నా ఆయన మాటతీరు ..బహిరంగ వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా కొందరు నటీమణులు ఆయన వ్యాఖ్యల విష‌యంలో అసహనం వ్యక్తం చేస్తూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. న‌టి త్రిష‌పై అత‌డి బ‌హిరంగ వ్యాఖ్య‌లు ఇంత‌కుముందు దుమారం రేపిన సంగ‌తిని మ‌రువ‌లేం. ఇక‌ షూటింగ్ సెట్స్‌లో లేదా ప్రెస్ మీట్‌లలో ఆయన జోకులు హద్దులు దాటుతున్నాయని వారి ప్రధాన ఆరోపణ.

మొత్తానికి.. పార్థిబన్ తీసుకున్న `నో కాస్ట్, నో రిలీజియన్` నిర్ణయం ఇప్పుడు అత‌డిని హీరోని చేసింది. ఇది చట్టపరంగా ఒక ముందడుగుగా పరిగణిస్తోంది స‌మాజం. అయితే కేవ‌లం వ్యక్తిగత ఆరోపణలు అత‌డి ప్రతిష్టకు కొంత ఇబ్బందికరం. వ్యక్తిగత విశ్వాసాల విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నారో.. తోటి నటీనటులతో ప్రవర్తించే తీరులో కూడా అదే రకమైన హుందాతనాన్ని ప్రదర్శించాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. చట్టపరమైన విజయాలు ఒక ఎత్తైతే.. వృత్తిగత సంబంధాలలో గౌరవాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమ‌ని సూచిస్తున్నారు.