Begin typing your search above and press return to search.

మ్యాడీ ది గ్రేట్.. దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ పంట‌లు పండిస్తాడ‌ట‌!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సహజసిద్ధమైన పద్ధతులను సమ్మేళనం చేస్తూ పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని ఆయన ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు.

By:  Sivaji Kontham   |   29 July 2026 2:56 PM IST
మ్యాడీ ది గ్రేట్.. దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ పంట‌లు పండిస్తాడ‌ట‌!
X

పెద్ద స్టార్ గా అభిమానం సంపాదించుకోవ‌డ‌మే కాదు.. స‌మాజ సేవ‌తోను తానేంటో నిరూపించాల‌నే ప‌ట్టుద‌ల కొంద‌రు స్టార్ల‌కే ఉంటుంది. అలాంటి అరుదైన న‌టుల‌లో మ్యాడీ అలియాస్ మాధ‌వ‌న్ ఒక‌రు. వెండితెరపై నటుడిగా ఎంతో ప్రజాదరణ పొందిన ఆర్‌. మాధవన్.. రియల్ లైఫ్‌లోనూ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో చాలామంది ర‌క‌ర‌కాల‌ వ్యాపకాల వైపు దృష్టి సారిస్తే.. మాధవన్ మాత్రం పర్యావరణ సమతుల్యత.. ప్రకృతి పునరుజ్జీవనంపై తన శ్రద్ధను పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సహజసిద్ధమైన పద్ధతులను సమ్మేళనం చేస్తూ పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని ఆయన ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు.

తమిళనాడులోని పళని సమీపంలో ఎండమావిలా మారిన‌ పంటలకు పనికిరాని ఒక వ్యర్థ భూమిని మాధవన్ తన బావ సుబయోగన్‌తో కలిసి కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా సారం కోల్పోయిన ఆ స్థలాన్ని పునరుద్ధరించడానికి దాదాపు మూడున్నరేళ్ల పాటు అంకితభావంతో కృషి చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రీయ ఎరువులు , సాంప్రదాయ మెళకువలను ఉపయోగించి ఆ ఎడారి లాంటి నేలను తియ్యని నీటినిచ్చే పొట్టి రకం కొబ్బరి చెట్ల పచ్చదనంతో నింపేశారు. ఈ ప్రయోగం కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా.. ఆ ప్రదేశంలోకి వానపాములు, రకరకాల పక్షులు తిరిగి వచ్చేలా చేసి ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను పునఃసృష్టించింది.

ఈ వ్యవసాయ ప్రయాణంలో మాధవన్ సాధించిన విజయం కేవలం అత‌డి సొంత ప్రయోజనాలకే పరిమితం కాలేదు. స్థానిక రైతులకు కూడా కొండంత అండగా నిలిచింది. ఈ తోటలో ఉత్పత్తి చేసిన నాణ్యమైన కొబ్బరి నారును మార్కెట్ ధర కంటే తక్కువకే స్థానిక రైతులకు అందిస్తూ.. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారు. నేలను సిద్ధం చేయడం కోసం వాడిన మల్చింగ్ పద్ధతి నుండి.. బావిలోని నీటిని శుద్ధి చేయడానికి చేపలను పెంచడం వరకు ప్రతీ ఒక్క పాఠం తనకు ఎంతో విలువైనదని.. ఈ నేల తిరిగి జీవం పోసుకోవడం తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అనుభవమని మాధవన్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ విజయంతో ఎంతో ఎగ్జ‌యిట్ అవుతున్న మాధవన్.. ఇలాంటి ప్రకృతి అనుకూల వ్యవసాయ నమూనాలను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని యోచిస్తున్నారు. మాధవన్‌కు పర్యావరణంపై ఉన్న ఇష్టం కేవలం ఈ వ్యవసాయ క్షేత్రానికే పరిమితం కాలేదు. ఆయన ముంబైలోని తన ఇంటి టెర్రస్‌పైనే ఆర్గానిక్ పద్ధతిలో ర‌క‌రకాల కూరగాయలు, ఆనపకాయలు, మునగకాయలు, చెర్రీస్ వంటి పండ్లను పండిస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఉత్సాహాన్ని అందిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంతో పాటు.. మాధవన్ పర్యావరణ అవగాహన.. జంతు జీవ‌రాశుల‌ సంక్షేమ కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. పీఈటీఏ ఇండియా రూపొందించిన `గ్లాస్ వాల్స్` అనే లఘు చిత్రానికి మ్యాడీ తన స్వరాన్ని అందించారు. సాంకేతికతను పర్యావరణ పరిరక్షణకు ఎలా ఉపయోగించవచ్చో నిరూపిస్తూ.. తనకున్న ప్రజాదరణను సామాజిక శ్రేయస్సు కోసం వినియోగిస్తున్న త‌మిళ క‌థానాయ‌కుడు మాధవన్ ప్రయాణం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.