Begin typing your search above and press return to search.

నా మైండ్ లో ఎప్పుడూ అవే ప్ర‌శ్న‌లు

ఈ సంద‌ర్భంగా టెస్ట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఫిల్మ్ మేకింగ్ ఎంత క‌ష్ట‌మో, ఆడియ‌న్స్ ను మెప్పించ‌గ‌ల‌గ‌డం డైరెక్ట‌ర్ కు ఈ రోజుల్లో ఎంత పెద్ద స‌వాలుగా మారిందో ఆయ‌న వివ‌రించారు.

By:  Tupaki Desk   |   6 April 2025 6:00 AM IST
నా మైండ్ లో ఎప్పుడూ అవే ప్ర‌శ్న‌లు
X

స‌ఖి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న మాధ‌వ‌న్ ప‌లు భాష‌ల్లో న‌టించి త‌న టాలెంట్ ను నిరూపించుకున్నారు. ప్ర‌స్తుతం న‌టుడిగా, హీరోగా, విల‌న్ గా ప‌లు పాత్ర‌లు చేస్తూ ఆడియ‌న్స్ ను మెప్పిస్తున్న మాధ‌వ‌న్ ఇప్ప‌టికే ఒక నేష‌న‌ల్ అవార్డు, 5 సార్లు సౌత్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.

మాధ‌వ‌న్ నటించిన టెస్ట్ మూవీ రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా టెస్ట్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఫిల్మ్ మేకింగ్ ఎంత క‌ష్ట‌మో, ఆడియ‌న్స్ ను మెప్పించ‌గ‌ల‌గ‌డం డైరెక్ట‌ర్ కు ఈ రోజుల్లో ఎంత పెద్ద స‌వాలుగా మారిందో ఆయ‌న వివ‌రించారు. ఒక‌ప్పుడు సినిమా చూడాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పిన మాధ‌వ‌న్ ఇప్పుడు సినిమాలు ఎంత క్లిష్టంగా మారాయో చెప్పుకొచ్చారు.

ఒక‌ప్పుడు తాము సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు ఇన్ని సౌక‌ర్యాలు లేవ‌ని, థియేట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అక్క‌డి జ‌నాల్ని తోసుకుంటూ పార్కింగ్ చేసి, ఓ వైపు క్యూ లో నిల‌బ‌డి టికెట్స్ తీసుకుంటే, మ‌రోవైపు త‌న ఫ్యామిలీని ఎవ‌రూ నెట్ట‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం వర‌కు అన్నీ ఉండేవ‌ని, ఆ రోజుల్లో ఇంట‌ర్వెల్ లో తిన‌డానికి పాప్ కార్న్, స‌మోసా త‌ప్ప ఏం ఉండేవి కాద‌న్నారు.

వాట‌న్నింటినీ అధిగ‌మించి సినిమా చూసి బ‌య‌టికొచ్చాక ఆ ఫీలింగ్ చాలా కొత్త‌గా ఉండేద‌ని, కానీ ఇప్పుడ‌వేమీ లేవ‌ని, మారుతున్న జెన‌రేష‌న్ లో భాగంగా అన్నీ మారిపోయాయ‌న్నారు మాధ‌వ‌న్. థియేట‌ర్లో మ‌నం కూర్చున్న ద‌గ్గ‌ర‌కే ఏం కావాలో సెలెక్ట్ చేసుకునే ఆప్ష‌న్ వ‌చ్చేసింద‌ని, పాప్ కార్న్ నుంచి పానీ పూరీ వ‌ర‌కు అన్నీ మ‌న అందుబాటులోకి వ‌చ్చాయ‌ని తెలిపారు.

ఆడియ‌న్స్ సినిమాను ఎంజాయ్ చేసే తీరు మారింద‌ని, మ‌న సీట్ లో మ‌నం కూర్చుంటే థియేట‌ర్ సిబ్బంది ఫుడ్ మెనూ కార్డ్ ప‌ట్టుకుని ఫ్లాష్ లైట్ వేసుకుని వ‌స్తుంటార‌ని, ఫుడ్ వ‌చ్చాక అదెలా వ‌చ్చిందో చూడ్డానికి మ‌ళ్లీ మ‌నం ఒక‌సారి ఫ్లాష్ లైట్ వేయ‌డం, ఈ లోపు సినిమాలో ఏదైనా బోరింగ్ సీన్ వ‌స్తే మ‌నీ వేస్ట్ అనుకోవ‌డం, క్లైమాక్స్ కు ముందు నుంచే పార్కింగ్ నుంచి బ‌య‌టికెళ్లాల‌ని కొంత‌మంది సినిమా అయిపోక‌ముందే మ‌న‌కు అడ్డుగా రావ‌డం ఇవ‌న్నీ సినిమాపై ప్ర‌భావం చూపుతున్నాయ‌ని, ఇన్ని ఇబ్బందుల మ‌ధ్య సినిమా చూసిన వాళ్ల‌కు న‌చ్చ‌క‌పోతే నిర్మొహ‌మాటంగా బాలేద‌ని చెప్పేస్తున్నార‌ని మాధ‌వ‌న్ అన్నారు.

దానికి తోడు ఇప్పుడు అన్నింటికంటే పిల్ల‌లు సినిమాలు చూసేలా చేయ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని, వారిపై కొరియ‌న్ పాప్ క‌ల్చ‌ర్ ప్ర‌భావం చూపిస్తోంద‌ని మాధ‌వ‌న్ అన్నారు. చాలా మంది పిల్ల‌లు కొరియ‌న్ లాంగ్వేజ్ నేర్చుకుని పేరెంట్స్ కు అర్థం కాకుండా సీక్రెట్ కోడ్ లో మాట్లాడుకుంటున్నారని, అస‌లు మ‌న సంస్కృతిలోకి కొరియ‌న్ క‌ల్చ‌ర్ ఎలా వ‌చ్చిందో అర్థం కావ‌డం లేద‌ని, ఈ క‌ల్చ‌ర్ వ‌ల్ల మ‌నం మ‌న ఆడియ‌న్స్ ను కోల్పోతున్నామ‌ని, మ‌న‌కూ వాళ్లకూ క‌థ చెప్పే విధానంలో ఉన్న తేడా ఏంట‌నే ప్ర‌శ్న‌లు ఎప్పుడూ త‌న మైండ్ లో ఉంటాయ‌ని మాధ‌వ‌న్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌రిస్థితుల గురించి వివ‌రించారు.