Begin typing your search above and press return to search.

రైతు బాంధ‌వుడు: ఎండిపోయిన బంజ‌రులో స్టార్ హీరో ప‌చ్చ‌ని కొబ్బ‌రి తోట‌

గ్లామర్ ప్రపంచంలో తారలు సాధారణంగా విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ విలక్షణ నటుడు ఆర్. మాధవన్ మాత్రం అందుకు భిన్నంగా మట్టిపై తనకున్న మక్కువను చాటుకున్నారు.

By:  Sivaji Kontham   |   11 April 2026 8:30 AM IST
రైతు బాంధ‌వుడు: ఎండిపోయిన బంజ‌రులో స్టార్ హీరో ప‌చ్చ‌ని కొబ్బ‌రి తోట‌
X

గ్లామర్ ప్రపంచంలో తారలు సాధారణంగా విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ విలక్షణ నటుడు ఆర్. మాధవన్ మాత్రం అందుకు భిన్నంగా మట్టిపై తనకున్న మక్కువను చాటుకున్నారు. తమిళనాడులోని పళనిలో దశాబ్దాలుగా సాగుకు పనికిరాకుండా ఎండిపోయి ఉన్న ఒక బంజరు భూమిని కేవలం మూడేళ్ల కాలంలో పచ్చని కొబ్బరి తోటగా మార్చి అద్భుతం చేశారు. ఒక సిద్ధాంతంగా తను నమ్మిన అంశాన్ని ప్రాక్టిక‌ల్ గా నిరూపించి సామాన్య రైతులకు సైతం స్ఫూర్తినిచ్చేలా ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు.

మాధవన్ ఈ పర్యావరణ అనుకూల ప్రయాణంలో కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాలేదు. ఆయన ఎక్కడా హైబ్రిడ్ రకాలను వాడకుండా.. స్వచ్ఛమైన నాన్-హైబ్రిడ్ `డ్వార్ఫ్` (పొట్టి) రకం కొబ్బరిని ఎంచుకున్నారు. ఇవి తియ్యటి నీటిని.. ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి. నేల తయారీలో రసాయనాలకు స్వస్తి చెప్పి.. `మల్చింగ్` వంటి సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరించడం ద్వారా భూమికి పూర్వ వైభవం తీసుకువచ్చారు. బావిలో చేపలను పెంచడం ద్వారా ఒక సంపూర్ణమైన .. సమతుల్యమైన పర్యావరణ వ్యవస్థను అక్కడ నిర్మించడం విశేషం.

ఈ మూడేళ్ల ప్రయాణం తనకు వెలకట్టలేని పాఠాలను నేర్పిందని మాధవన్ సగర్వంగా చెప్పుకుంటారు. లాక్‌డౌన్ సమయంలో తన ముంబై ఇంటి టెర్రస్‌పై చెర్రీ పండ్లను పండిస్తూ వ్యవసాయంపై తనకున్న నిబద్ధతను చాటుకున్న ఆయన పళని ప్రాజెక్టును ఒక సామాజిక బాధ్యతగా భావించారు. తాను నేర్చుకున్న మెళకువలను , పరిశోధనలను స్థానిక రైతులకు కూడా ఉపయోగపడేలా ఒక పరిశోధనా పత్రం రూపంలో అందుబాటులోకి తెస్తానని ప్రకటించడం మ్యాడీలోని పరిణితిని తెలియజేస్తుంది. పళనిలో విజయవంతమైన ఈ పద్ధతిని భారతదేశం అంతటా అమలు చేయాలన్నది ఆయన ఆకాంక్ష.

మాధవన్ కేవలం వ్యవసాయానికే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు కూడా గొంతుకగా మారారు. PETA ఇండియా కోసం `గ్లాస్ వాల్స్` అనే వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తూ... జంతువుల పట్ల క్రూరత్వాన్ని వీడాలని .. సుస్థిరమైన జీవనశైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. వధశాలల వాస్తవికత తెలిస్తే సమాజంలో మార్పు వస్తుందని ఆయన బలంగా నమ్ముతారు. నటుడిగానే కాకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆయన చేస్తున్న ఈ పనులు, సమాజంలో ప్రకృతి పై ఉన్న దృక్పథాన్ని మార్చడానికి.. యువతను వ్యవసాయం వైపు మళ్లించడానికి శక్తివంతమైన ఆయుధాలుగా మారుతున్నాయి.

ఒక అగ్ర నటుడు నేరుగా మట్టిలోకి దిగి.. బంజరు భూమిని సారవంతం చేయడం అనేది యువతకు ఒక గొప్ప పాఠం. వ్యవసాయం అంటే కేవలం శ్రమ మాత్రమే కాదు.. అది ఒక సృజనాత్మకమైన లాభదాయకమైన వ్యాపారం అని ఆయన నిరూపించారు. పళనిలోని ఆ పచ్చని తోటను స్థానిక యజమానులకు అప్పగించి.. ఆ పుణ్యక్షేత్రం నుండి భారమైన హృదయంతో వెనుదిరిగిన మాధవన్.. నిజజీవితంలో కూడా రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ఇటువంటి రియల్ లైఫ్ హీరోల కథలు సామాజిక మార్పుకు.. పర్యావరణ పరిరక్షణకు గట్టి పునాదులు వేస్తాయన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మాధ‌వ‌న్ న‌టించిన దురంధ‌ర్ 2 (ర‌ణ్ వీర్ హీరో) సంచ‌ల‌న విజ‌యం సాధించి రికార్డుల‌ను తిరగ‌రాస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాతా ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌తో మాధ‌వ‌న్ బిజీగా ఉన్నారు.