PVR ఐనాక్స్ నష్టాలు 125 కోట్లు!
పెద్ద స్టార్ల సినిమాలు విడుదలకు రాకపోవడం, వచ్చిన సినిమాలేవీ సరిగా ఆడకపోవడం వంటి సమస్యలతో పీవీఆర్ ఐనాక్స్ ఈ క్వార్టర్‌లో 25శాతం మేర నష్టాలను చవి చూసినట్టు తెలిపింది.
By: Tupaki Desk | 13 May 2025 3:58 AMపెద్ద స్టార్ల సినిమాలు విడుదలకు రాకపోవడం, వచ్చిన సినిమాలేవీ సరిగా ఆడకపోవడం వంటి సమస్యలతో పీవీఆర్ ఐనాక్స్ ఈ క్వార్టర్‌లో 25శాతం మేర నష్టాలను చవి చూసినట్టు తెలిపింది. నాల్గవ త్రైమాసికంలో (క్యూ4) రూ.125.3 కోట్ల నికర నష్టాన్ని అందుకోగా, ఇది మునుపటి త్రైమాసికంలో (క్యూ3) రూ.35.5 కోట్ల లాభంతో పోలిస్తే ఇబ్బందికర పరిణామం అని పీవీఆర్ తెలిపింది.
ఈ ఏడాది బాక్సాఫీస్ కి ఏమాత్రం కలిసి రాలేదు. నార్త్ లో సరైన సినిమాలేవీ రిలీజ్ కాలేదు. అస్థిరమైన రిలీజ్ లతో సినిమా క్యాలెండర్ నిరాశపరిచింది. తక్కువ కంటెంట్ కారణంగా మల్టీప్లెక్సులు కళకళలాడలేదు. దీని ఫలితంగా కంపెనీకి స్థూల బాక్సాఫీస్ ఆదాయంలో 9 శాతం తగ్గుదల ఏర్పడింది! అని కంపెనీ తెలిపింది. మల్టీప్లెక్స్ ఆపరేటర్ కార్యకలాపాల నుండి ఆదాయం నాలుగో క్వార్టర్‌లో 27.3 శాతం తగ్గి రూ.1,249.8 కోట్లకు చేరుకుంది. మూడో త్రైమాసికంలో రూ.1,717.3 కోట్లు ఉండగా, ఇప్పుడు చాలా నష్టం వాటిల్లింది. 14 శాతం మేర సినిమాల విడుదలలు తగ్గిపోవడం కూడా ఈ పరాజయానికి కారణం అని తెలుస్తోంది.
గత త్రైమాసికంలో రూ. 1,759.1 కోట్ల నుండి, ఈ త్రైమాసికంలో రూ. 1,311.2 కోట్లకు రెవెన్యూ తగ్గింది. మూడవ త్రైమాసికంలో రూ. 46.2 కోట్లుగా ఉన్న పన్నుకు ముందు లాభం క్యూ4లో రూ. 167.7 కోట్ల నష్టంగా మారింది. గత త్రైమాసికంలో రూ.35.9 కోట్ల లాభంతో పోలిస్తే, నాలుగో త్రైమాసికంలో రూ.125 కోట్ల నష్టం ఎదురైంది.
ఆదాయం తగ్గినా కానీ, ఐనాక్స్ తన ఖర్చులను చాలా వరకూ తగ్గించుకోగలిగింది. మూడో త్రైమాసికంలో రూ.1,712.8 కోట్లతో పోలిస్తే, క్యూ4లో మొత్తం ఖర్చులు 13.67 శాతం తగ్గి రూ.1,478.7 కోట్లకు చేరుకున్నాయి.