Begin typing your search above and press return to search.

అసలైన సినిమా లవర్స్ కు షాక్ ఇచ్చిన PVR

సినిమా అంటే పండగే! అయితే సినిమా టికెట్ ధరలు పెరిగిపోయిన ఈ రోజుల్లో, ఓ మంచి ఆఫర్ వస్తే అభిమానులు ఖుషీ అవుతారు.

By:  Tupaki Desk   |   9 April 2025 1:00 AM IST
PVR Inox Blockbuster Tuesday Offer
X

సినిమా అంటే పండగే! అయితే సినిమా టికెట్ ధరలు పెరిగిపోయిన ఈ రోజుల్లో, ఓ మంచి ఆఫర్ వస్తే అభిమానులు ఖుషీ అవుతారు. అందుకే ప్రేక్షకుల కోసం PVR ఐనాక్స్ థియేటర్ సంస్థ ఒక సూపర్ డీల్ ను ప్రకటించింది. ఇది కేవలం వారానికి ఒక్కరోజే లభిస్తుంది. అయితే ఇందులోని ట్విస్టు ఏంటంటే.. దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం ఇది వర్తించదు. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తోంది.

దేశవ్యాప్తంగా అతిపెద్ద థియేటర్‌ చైన్‌లను కలిగిన సంస్థగా మారిన PVR – ఐనాక్స్ ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్‌బస్టర్ ట్యూస్‌డేస్' పేరిట ఓ ఆఫర్‌ను తెచ్చింది. ప్రతి మంగళవారం సినిమాల టికెట్లను కేవలం 99 లేదా 149 రూపాయలకి మాత్రమే అందించనున్నట్లు ప్రకటించారు. ఇందులో 2D, 3D, IMAX, 4DX వంటి అన్ని ఫార్మాట్స్‌కి వర్తించనుండటం విశేషం. అంటే భారీ విజువల్స్ ఉన్న సినిమాలను కూడా తక్కువ ధరకు ఆస్వాదించొచ్చన్నమాట.

అయితే ఈ ఆఫర్‌లోనే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం వర్తించదు. అంటే దక్షిణ భారతదేశం మొత్తం ఈ ప్లాన్ నుంచి బయటపడిపోయింది. ఇది చూసి సౌత్ ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "మేమూ సినిమా లవర్స్‌మే.. మాకు ఎందుకు ఇవ్వట్లేదు?" అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇది డబుల్ స్టాండర్డ్ అనే కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా నార్త్ ఇండియాలో PVR, INOXలు ఎక్కువగా ఉన్నా, సౌత్‌లో కూడా ఆ థియేటర్ల బ్రాంచ్‌లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, కోచ్చి వంటి పట్టణాల్లో భారీగా స్క్రీన్‌లు ఉన్నాయి. అయినప్పటికీ, ఆ ప్రాంతాలకు ఈ టికెట్ ఆఫర్ వర్తించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఆఫర్ ద్వారా ప్రేక్షకుల రద్దీ పెరుగుతుందనేది కంపెనీ ఆశ. కానీ దక్షిణ భారతదేశంలోనూ ఇదే ఫార్మాట్ ఇవ్వలేదంటే, అది వ్యాపారపరమైన నిర్ణయం కావచ్చునన్న విశ్లేషణ ఉంది.

కానీ PVR ఐనాక్స్ సంస్థ సమగ్రంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థ కాబట్టి, అన్ని ప్రాంతాల ప్రేక్షకులకి సమాన ఆఫర్లు ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి, 'బ్లాక్‌బస్టర్ ట్యూస్‌డేస్' పేరిట ఒక కొత్త ట్రెండ్‌ను PVR ఐనాక్స్ ప్రారంభించగా, దాని నుండి సౌత్ రాష్ట్రాల్ని వదిలేయడంపై అసహనం నెలకొంది. ప్రేక్షకులు ఒకే దేశంలో ఉంటూ వెరే ట్రీట్‌మెంట్ ఎందుకంటూ నిలదీయడం మొదలుపెట్టారు. సదరు సంస్థ స్పందించి ఈ ఆఫర్‌ను అన్ని రాష్ట్రాలకు విస్తరించాలంటూ సోషల్ మీడియా వేదికగా సౌండ్ పెరుగుతోంది. మరి సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.