Begin typing your search above and press return to search.

పీవీఆర్.. ఐనాక్స్ మహా విస్తరణ.. 2 ఏళ్లలో 200 స్క్రీన్లు

రానున్నరోజుల్లో వచ్చే కొత్త స్క్రీన్లలో 40 శాతం దక్షిణాది రాష్ట్రాల్లో.. 20 శాతం ఇతర ప్రాంతాల్లోని చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 July 2025 12:00 PM IST
పీవీఆర్.. ఐనాక్స్ మహా విస్తరణ.. 2 ఏళ్లలో 200 స్క్రీన్లు
X

ఓపక్క సింగిల్ థియేటర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో మూసుకుపోతుంటే.. మరోవైపు మల్టీఫ్లెక్సుల జోరు ఓ రేంజ్ లో ఉంటోంది. దేశీయంగా తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్న పీవీఆర్ .. ఐనాక్స్ సంస్థ రానున్న రోజుల్లో మరింత విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు 1800 స్క్రీన్లు ఉన్న ఈ సంస్థ.. రానున్న రెండేళ్లలో మరో 200 స్క్రీన్లను జత చేసుకోవాలని భావిస్తోంది. 2027 నాటికి ఈ గ్రూపు కింద 2వేల స్క్రీన్లు ఉన్న సంస్థగా మారనుంది. ఇందుకోసం రెండేళ్ల వ్యవధిలో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

విస్తరణలో ఎక్కువగా సౌత్ మీదనే ఈ సంస్థ ఫోకస్ చేయనుంది. తాజాగా హైదరాబాద్ లో మరో నాలుగు స్క్రీన్లను ప్రారంభించిన ఈ సంస్థ.. రానున్న రోజుల్లో పట్టణాలు.. చిన్న నగరాల్లోనూ విస్తరణ చేపట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ - 2026 మార్చి) వంద స్క్రీన్లను ప్రారంభించేందుకు వీలుగా ప్లాన్ చేశారు. ఇందులో గడిచిన మూడు నెలలు (ఏప్రిల్ - జూన్) 40 తెరల్ని ప్రారంభించారు. ఇందులో హైదరాబాద్.. బెంగళూరు.. హుబ్లీతదితర నగరాల్లో ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిని ముంబయి.. డిల్లీ.. గురు గామ్ తో పాటు సిలిగురి.. జబల్ పుర్.. లేహ్.. గ్యాంగ్ టక్ లాంటి చిన్న పట్టణాల్లోనూ ఏర్పాటు చేసేలా ప్లాన్ చేవారు.

రానున్నరోజుల్లో వచ్చే కొత్త స్క్రీన్లలో 40 శాతం దక్షిణాది రాష్ట్రాల్లో.. 20 శాతం ఇతర ప్రాంతాల్లోని చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. 2026-27 నాటికి కొత్తగా 80 స్క్రీన్లను యాడ్ చేయనున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో పీవీఆర్ ఐనాక్స్ కు 114 స్క్రీన్లు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 22 స్క్రీన్లు అదనంగా చేరనున్నాయి.

ఈ సంస్థ లెక్క ప్రకారం కొత్త స్క్రీన్ ప్రారంభించేందుకు రూ.3.5 కోట్ల ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఈ సంస్థ ఎవరైనా ఔత్సాహికులు ఉంటే ఫోకో విధానంలో అంటే ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ లో భాగంగా తాము 50 శాతం పెట్టుబడి పెడతామని.. మరో 50 శాతం స్థానిక యజమాని పెడితే సరిపోతుందని చెబుతున్నారు. మొత్తంగా భారీ విస్తరణ ప్లాన్ లో దూసుకెళుతోంది పీవీఆర్ ఐనాక్స్ అన్న మాట పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది.