మల్టీప్లెక్స్ స్క్రీన్లు సింకింగ్ సింప్టమ్స్!
కొద్దిరోజుల క్రితం భారతదేశంలోని ఎగ్జిబిషన్ రంగం దివాళా గురించి మీడియాలో వచ్చిన కథనాలు నిజంగా ఆందోళనకు గురి చేసాయి.
By: Tupaki Desk | 18 May 2025 1:53 PM ISTకొద్దిరోజుల క్రితం భారతదేశంలోని ఎగ్జిబిషన్ రంగం దివాళా గురించి మీడియాలో వచ్చిన కథనాలు నిజంగా ఆందోళనకు గురి చేసాయి. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్ థియేట్రికల్ చైన్ భవిష్యత్ లో తన స్క్రీన్లను పెంచుకునేందుకు బదులుగా తగ్గించుకునేందుకు ప్లాన్ చేస్తోందని, ఇప్పటికే ఉన్నవాటిని తొలగించి ఆ స్థానంలో గేమింగ్ జోన్స్, ఇతర ఆదాయాలు తెచ్చే వ్యాపారాలు ప్లాన్ చేస్తున్నారని కథనాలొచ్చాయి.
చూస్తుంటే ఈ తరహా మల్టీప్లెక్స్ లు మునుముందు సినీప్రియులకు చుక్కలు చూపించడం ఖాయమని నిరూపణ అవుతోంది. తాజాగా కొచ్చి- లులు మాల్‌లోని పీవీఆర్ ఐమ్యాక్స్ నిర్వాకం ప్రజల్లో హాట్ టాపిగ్గా మారింది. ఉన్న ఒక్క సెలవు రోజు వినోదం కోసం థియేటర్ కి వస్తే నిజంగా చుక్కలు చూపించారని ఆవేదన చెందారు ప్రేక్షకులు. అసలేం జరిగింది అంటే? మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ కోసం ఒక సినీప్రియుడు ఉదయం 9:00 గంటలకు షో వీక్షించేందుకు విచ్చేసాడు. ఉదయం 8:45 గం.లకే థియేటర్ కి వచ్చాడు. కానీ వెయిట్ చేయమని థియేటర్ వాళ్లు చెప్పారు. ఉదయం 9:45 గంటలకు సిబ్బంది `కంటెంట్ లోడింగ్ సమస్య` ఉందని పేర్కొన్నారు. ఉదయం 10:15 గంటలకు సాంకేతిక లోపం కారణంగా షో రద్దయిందని చెప్పారు.
టిక్కెట్లు బుక్ చేసినవారిని అప్రమత్తం చేయడానికి ఎటువంటి ఎస్.ఎం.ఎస్ లేదా ముందస్తు మెసేజ్ ఎవరికీ పంపలేదు. దేశమంతా ఐమ్యాక్స్ స్క్రీన్లకు ఇలాంటి సమస్య ఉందని సిబ్బంది అబద్ధం చెప్పారు. నిజానికి సమీప థియేటర్ లో ఉదయం 9:00 గంటలకు ఎటువంటి సమస్య లేకుండా అదే సినిమాను ప్రదర్శించారు. కానీ ఇక్కడ ప్రేక్షకులు 90 నిమిషాలకు పైగా వేచి ఉన్నారు.. కానీ సినిమా వేయలేదు. పరిహారం అందలేదు. కనీసం ఫుడ్ కూపన్ కూడా రాలేదు. కౌంటర్‌లో వాపసు ఇచ్చినా ఫలితం లేదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారిని ఏడు రోజుల వరకు వేచి ఉండమని చెప్పారు.
అయితే దీనిని నిలదీసిన సినిమా వీక్షకులకు తల బిరుసుగా థియేటర్ వ్యక్తులు సమాధానమిచ్చారు. పై అధికారుల అప్రూవల్ రాలేదు అంటూ సమస్యను తీవ్రతరం చేసారు. మొత్తానికి జవాబుదారీ లేని సినిమా థియేటర్లకు డబ్బు చెల్లించామని లబోదిబోమంటూ బాధితులు అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. సాంకేతిక లోపాలు ఉంటే, సరి చేసుకోవాలి. కానీ తప్పుడు సమాచారంతో సినీప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. పైగా పీవీఆర్ లాంటి బ్రాండ్ ఇలా చేయడం తగదు. ఇప్పటికే ఓటీటీలు, డిజిటల్ పోటీ కారణంగా జనం థియేటర్లకు రావడం లేదు. ఇలాగే బాధ్యతారాహిత్యంగా ఉంటే, దానిని షాకుగా చూపుతూ జనం పూర్తిగా థియేటర్లకు రాకుండా మానేస్తారు.
