Begin typing your search above and press return to search.

రిలీజ్‌కు ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న 'పుష్ప 2'

తాజాగా ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ మరియు ఆడియో హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 July 2024 3:09 PM GMT
రిలీజ్‌కు ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న పుష్ప 2
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''పుష్ప: ది రూల్''. ఇది బ్లాక్‌ బస్టర్ హిట్టైన 'పుష్ప: ది రైజ్‌' చిత్రానికి సీక్వెల్. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా.. రిలీజ్ కు ముందే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ మరియు ఆడియో హక్కుల కోసం భారీ డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కెఇ జ్ఞానవేల్ రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేవలం 'పుష్ప 2' హిందీ వెర్షన్‌ నాన్ థియేట్రికల్ హక్కులే రూ. 260 కోట్ల భారీ రేటు పలికాయని చెప్పారు. దీని ప్రకారం ఇది ఇండియాలో ఏ భాషలోనైనా హయ్యెస్ట్ నాన్-థియేట్రికల్ డీల్ అని చెప్పాలి. ఇక 'కేజీఎఫ్ 2' కంటే అల్లు అర్జున్ సినిమా ఎక్కువ వసూళ్లు రాబడుతుందని తమిళ నిర్మాత అభిప్రాయపడ్డారు. నార్త్ ఇండియన్ మార్కెట్ లో 'పుష్ప: ది రూల్' మూవీ రికార్డులు బ్రేక్ చేస్తుందని, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుందని ఆయన అన్నారు.

'పుష్ప' పార్ట్-1లో ‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ తన మేనరిజంతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసారు. ఇప్పుడు రెండో భాగం 'పుష్ప: ది రూల్' తో వరల్డ్ బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు కెఇ జ్ఞానవేల్ రాజా సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. జీనియర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప రాజ్ లాంటి ఐకానిక్ క్యారక్టర్ ను తెరపై చూడటానికి సినీ ప్రియులు అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు.

‘పుష్ప ది రైజ్’ చిత్రంలో అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనకుగాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్ట‌మొద‌టి తెలుగు యాక్టర్ గా నిలిచారు. ఇప్పుడు ‘పుష్ఫ 2: ది రూల్’ సినిమాలో ఐకాన్ స్టార్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ లకు ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రెండు పాటలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.

‘పుష్ప 2’ చిత్రాన్ని ముందుగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ షూటింగ్‌ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకూడదనే ఉద్దేశ్యంతో మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. 2024 డిసెంబర్‌ 6న వరల్డ్ వైడ్ గా తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ను నడిపే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' లో చూపించారు. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' అతను చీకటి సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడనేది చూపించబోతున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.