Begin typing your search above and press return to search.

శ్రీతేజ్‌కి ఎప్పుడూ మేము ఉంటాం : అల్లు అరవింద్‌

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో గాయపడి ఆసుపత్రి పాలైన అల్లు అర్జున్‌ అభిమాని శ్రీతేజ్‌ ఆరోగ్యం కుదుట పడుతోంది.

By:  Tupaki Desk   |   5 May 2025 6:44 PM IST
Allu Aravind Support Injured Fan Sritej
X

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో గాయపడి ఆసుపత్రి పాలైన అల్లు అర్జున్‌ అభిమాని శ్రీతేజ్‌ ఆరోగ్యం కుదుట పడుతోంది. సుదీర్ఘ కాలం పాటు కిమ్స్ లో చికిత్స పొందిన శ్రీతేజ్ ఇటీవలే అక్కడి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. శ్రీతేజ్ ఇంకా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉలిక్కి పడుతున్నాడని, అతడి పరిస్థితి మరింత మెరుగు పడటం కోసం కిమ్స్ నుంచి ఏషియన్ ట్రాన్స్‌ కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కి తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మీడియాలో ప్రముఖంగా ఈ విషయం గురించి ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.

శ్రీతేజ్‌ను రిహాబిలిటేషన్‌ సెంటర్‌కి తరలించిన తర్వాత అల్లు అరవింద్‌, బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా అతడితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంకా బెడ్‌ కే పరిమితం అయిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గురించి అల్లు అరవింద్‌, బన్నీ వాసులకు వైద్యులు వివరించారు. శ్రీతేజ్‌ మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో సాదారణ స్థితికి వస్తాడని అల్లు అరవింద్‌కు వైద్యులు చెప్పారని తెలుస్తోంది. శ్రీతేజ్‌ ఆరోగ్య విషయమై ఆందోళన అక్కర్లేదని వైద్యులు చెప్పారట. అంతే కాకుండా మరికొన్ని రోజుల్లో అతడిని రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి కూడా డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు చెప్పారని సమాచారం.

రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో శ్రీతేజ్‌ను పరామర్శించిన తర్వాత అల్లు అర్జున్‌, బన్నీ వాసు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. శ్రీతేజ్‌ కోలుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతడు పూర్తి ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో శ్రీతేజ్‌కి ఏం అవసరం వచ్చినా మేము ఉంటాం. ప్రతి ఒక్క విషయంలోనూ అతడి వెనుక మేము ఉంటామని అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చాడు. ఆసుపత్రికి సంబంధించిన బిల్లులు అన్నీ కూడా అల్లు అరవింద్‌ వారు ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయమై ఏ ఒక్కరి నుంచి అధికారిక క్లారిటీ రాలేదు. అల్లు అరవింద్‌ గతంలోనూ శ్రీతేజ్‌ను పరామర్శించిన విషయం తెల్సిందే.

శ్రీతేజ్‌ను గతంలో అల్లు అర్జున్‌ కూడా పరామర్శించిన విషయం తెల్సిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో కి వెళ్లిన శ్రీతేజ్‌ కుటుంబ సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీతేజ్ తల్లి తొక్కిసలాటలో మృతి చెందగా, శ్రీతేజ్ తీవ్రంగా గాయ పడ్డాడు. దాదాపు ఆరు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే శ్రీతేజ్ బయటకు వస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. శ్రీతేజ్‌కి ఇలా కావడం వల్లే పుష్ప 2 సినిమా సక్సెస్‌ వేడుకలను కూడా అల్లు అర్జున్‌ జరుపుకోలేదు. అల్లు అర్జున్‌తో పాటు, నిర్మాతలు, థియేటర్‌ యాజమాన్యం పైనా కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతోంది.