నాన్న కష్టాలను ఎంత బాగా చెప్పావ్ పూరీ
ప్రతి వారం `పూరి మ్యూజింగ్స్` అభిమానులకు బోలెడంత సమాచారాన్ని చేరవేయడమే గాక, చాలా ఎమోషనల్ విషయాలను వినిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 16 Jun 2025 12:20 AM ISTప్రతి వారం `పూరి మ్యూజింగ్స్` అభిమానులకు బోలెడంత సమాచారాన్ని చేరవేయడమే గాక, చాలా ఎమోషనల్ విషయాలను వినిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తన అనుభవ పాఠాల నుంచి చాలా విషయాలను చెబుతుండటంతో అవి జనాలకు ఇట్టే కనెక్టయిపోతున్నాయి. 15 జూన్ `ఫాదర్స్ డే` సందర్భంగా పూరి `నాన్న` గురించి చెప్పిన సంగతులు వాస్తవికతకు అద్ధం పట్టాయి. నాన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మౌనంగా అన్నిటినీ భరించేది నాన్న! అంటూ ఎన్నో విషయాలను చెప్పారు పూరి. అతడి మాటల సారాంశం ఇలా ఉంది.
నాన్న ఆల్వేస్ అండర్ రేటెడ్.. నాన్న మనకోసం ఏం చేసాడో మనకు తెలీదు.. ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలీదు.నాన్న ఎన్ని కష్టాలు పడినా ఏ సమస్య ఉన్నా ఎవరికీ చెప్పడు. పిల్లలు పెళ్లానికి అసలే చెప్పడు
అమ్మలా ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడం నాన్నకు తెలీదు. బిజీగా ఉన్న నాన్న ఎప్పుడో ఇంటికి వస్తాడు. రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చి మంచంపై నిదురపోతున్న పిల్లల వైపు చూస్తాడు. ఎప్పుడూ పనేనా.. కాస్త ఇంటి పట్టున ఉండొచ్చు కదా అని చిరాకు పడే అమ్మ మాట వింటుంటాడు. పిల్లలు కూడా నాన్నను మిస్ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్ అవుతుంటాడు. పెళ్లయి పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతిలో ఉండదు. మనందరి కోసం నాన్న పగలు రాత్రి పని చేయాలి.
చదువులు.. సమస్యలు.. చుట్టాలు.. పండగలు.. హాస్పిటల్స్.. బర్త్ డేలు ... వీటన్నిటితో నాన్న నలిగిపోతాడు.. యాంగ్జయిటీ .. షుగరు.. పెరాలిసిస్ .. హార్ట్ ఎటాక్ ఇలా ఎన్నో ..వృద్ధాప్యం వచ్చిందా అనిపిస్తుంది. లోపల లోపల కరిగిపోతాడు. డాక్టర్ ని కలిసిన విషయం కూడా నాన్న చెప్పడు. పిల్లలు పెద్దవాళ్లవ్వాలని అప్పులు చేసి అయినా చదివిస్తాడు. ఇంకా ఎన్నిటినో భరిస్తాడు.. అంటూ పూరి చాలా విషయాలను పూరి మ్యూజింగ్స్ లో చెప్పారు. ఆస్తులు అమ్మి అయినా పెళ్లిళ్లు చేస్తాడు. ఎండ వానల్లో నిలుచుంటాడు. వందల సార్లు అమ్మ ఏడ్వడం చూస్తారు. కానీ నాన్న ఏడ్వడం చూడరు. కానీ నాన్న కూడా ఏడుస్తాడు. ఎక్కడో ఒంటరిగా కూచుని ఏడుస్తాడు. పిల్లలు ఎదిగేప్పటికీ అన్నీ అమ్ముకుని అంతా ఆరిపోయి ఉంటాడు.. అంటూ చాలా వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసారు పూరి.
