పూరీ రూటు మార్చాడా?
గత కొన్ని సినిమాలుగా ఏం చేసినా ఫలితం లేకుండా పోతుంది సీనియర్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కు.
By: Tupaki Desk | 16 April 2025 11:00 PM ISTగత కొన్ని సినిమాలుగా ఏం చేసినా ఫలితం లేకుండా పోతుంది సీనియర్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కు. పూరీ ఆఖరిగా హిట్ అందుకుంది 2019లో. అంటే ఆరేళ్ల నుంచి పూరీ ఖాతాలో మరో హిట్ పడలేదు. రామ్ హీరోగా పూరీ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకరే పూరీ లాస్ట్ హిట్. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా స్థాయిలో లైగర్ తీసి డిజాస్టర్ అందుకున్నాడు.
లైగర్ డిజాస్టర్ తర్వాత తనకు ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ ఇచ్చిన రామ్ తో మరోసారి చేతులు కలిపి ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తీస్తే అది లైగర్ సినిమా కంటే దారుణమైన ఫలితాన్ని మిగిల్చింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు పూరీని డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా ముంచేశాయి. ఆ రెండు సినిమాల కోసం పూరీ భారీగా ఖర్చు పెట్టి నష్టపోయాడు.
ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంటే ఎవరికైనా తర్వాతి సినిమాకు మరో ఛాన్స్ రావడమే గొప్ప అయితే పూరీ జగన్నాధ్ ఏకంగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి కథ చెప్పి అతన్ని మెప్పించి సినిమాను ఓకే చేయించుకుని అనౌన్స్ కూడా చేశాడు. అక్కడితో పూరీ ఆగలేదు. ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి టబుని రంగంలోకి దింపాడు. హీరోయిన్ గా రాధికా ఆప్టే తలూపిందని అంటున్నారు.
ఇవన్నీ చూస్తుంటే పూరీ ఈసారి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తోంది. రీసెంట్ గా విజయ్ సేతుపతి కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరీ చెప్పిన కథ గురించి చాలా బాగా చెప్పాడు. పూరీ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని, సినిమాలో నటనకు ఎంతో స్కోప్ ఉందని, అందుకే తాను పూరీతో సినిమా చేస్తున్నానని, డైరెక్టర్ల ట్రాక్ రికార్డుతో తనకు అనవసరం అని చెప్పిన సంగతి తెలిసిందే.
సేతుపతి చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే పూరీ ఈసారి తన రూట్ ను మార్చినట్టు అర్థమవుతుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకున్న పూరీ స్పీడ్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఎప్పటిలాగే వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడట పూరీ. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా పూరీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ చూశాక మరోసారి మణిశర్మ జోలికి వెళ్లడు పూరీ. ఇక తమన్, దేవీశ్రీ అంటే పూరీకి కావాల్సినంత స్పీడ్ గా ట్యూన్స్ ఇచ్చేంత ఖాళీగా లేరు. అందుకే సంతోష్ నారాయణన్ లేదా జీవీ ప్రకాష్ లాంటి వారితో ముందుకెళ్లాలని చూస్తున్నాడట. సేతుపతితో చేస్తున్న ఈ సినిమా పూరీ కెరీర్ కు ఎంతో కీలకం కానుంది. ఈ సినిమా హిట్ అయితే పూరీకి తర్వాతి అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉండే ఛాన్సుంది. ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
