పూరీ- సేతుపతి.. బెగ్గర్ కాదు, మరో క్రేజీ టైటిల్
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తీస్తే ఆ సినిమా లైగర్ ను మించి ఫ్లాపుగా నిలిచింది.
By: Tupaki Desk | 17 Jun 2025 9:45 AM ISTటాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గత కొన్ని సినిమాలుగా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆయన ఆఖరిగా హిట్ అందుకుంది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో. ఆ సినిమా వచ్చి కూడా ఐదేళ్లవుతుంది. ఆ తర్వాత నుంచి పూరీ ఖాతాలో ఇప్పటివరకు హిట్ పడింది లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో భారీ ప్రాజెక్టుగా లైగర్ ను తీస్తే అది డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తీస్తే ఆ సినిమా లైగర్ ను మించి ఫ్లాపుగా నిలిచింది. దీంతో పూరీకి తర్వాత ఎవరు ఛాన్స్ ఇస్తారా అని అంతా అనుకున్నారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ పూరీ జగన్నాథ్ తన తర్వాతి సినిమాను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో అనౌన్స్ చేసి షాకిచ్చాడు. ప్రాజెక్టు అనౌన్స్ చేయడమే కాదు, ఈ సినిమాను తానే స్వయంగా ఛార్మీతో కలిసి నిర్మిస్తున్నాడు.
అనౌన్స్‌మెంట్ తోనే అంచనాలను పెంచుకున్న ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను అనుకుంటున్నారని మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాపై మరో బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ బెగ్గర్ కాదని, మేకర్స్ ఈ మూవీకి భిక్షాం దేహి అనే టైటిల్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ఈ సినిమాలో టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పూరీ ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగైనా ఈ మూవీతో మంచి హిట్ అందుకోవాలనే కసితో పూరీ దీన్ని తెరకెక్కించబోతున్నాడు.
