పూరి సినిమాలో మూడో హీరోయిన్...!
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు నివేదా థామస్ దూరంగా ఉంటూ వస్తోంది.
By: Tupaki Desk | 27 April 2025 6:00 PM ISTడబుల్ ఇస్మార్ట్ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ నుంచి సినిమా అంటే సాధారణంగా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఆయన తమిళ్ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఒప్పించి సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. 'బెగ్గర్' అనే టైటిల్‌తో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాధ్ సినిమా కన్ఫర్మ్ అయింది. ఏ క్షణంలో అయినా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చు. కేవలం మూడు నెలల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తానంటూ పూరి జగన్నాధ్ సన్నిహితులతో చెప్పాడని సమాచారం అందుతోంది. విజయ్ సేతుపతి నుంచి వైవిధ్యభరిత సినిమాలు, పాత్రలను ఆశించే వారు మెచ్చే విధంగా బెగ్గర్ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
విజయ్ సేతుపతితో పూరి జగన్నాధ్ రూపొందించబోతున్న బెగ్గర్ సినిమా కోసం ఇప్పటికే సీనియర్ హీరోయిన్ టబును ఎంపిక చేశారు. ఆ తర్వాత రాధిక ఆప్టే ని ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. తెలుగులో రాధిక ఆప్టే గతంలో నటించి మెప్పించింది. విజయ్ సేతుపతి సినిమాలో ఆమె నటిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయం అని అంతా ధీమాగా ఉన్నారు. వీరిద్దరు మాత్రమే కాకుండా మరో హీరోయిన్‌ను ఈ సినిమాలో నటింపజేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మూడవ హీరోయిన్ నివేదా థామస్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.
కథలో టబు, రాధిక ఆప్టే పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయని, కథ మొత్తం విజయ్ సేతుపతి, ఆ ఇద్దరు హీరోయిన్స్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ విజయ్ సేతుపతికి జోడీగా కనిపించబోవడం లేదని, నివేదా థామస్‌ను విజయ్ సేతుపతికి జోడీగా నటింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు నివేదా థామస్ దూరంగా ఉంటూ వస్తోంది. ఆమె నటించిన 35 సినిమా విమర్శలకు ప్రశంసలు దక్కించుకుంది. నటనతో మెప్పించిన నివేదా ఈ పెద్ద ఆఫర్‌ను సొంతం చేసుకుని ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో నివేదా థామస్ లుక్ విభిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ఇస్మార్ట్ శంకర్‌కి ముందు చాలా సినిమాలతో నిరాశ పరచడంతో పాటు, ఇటీవల వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో పూరి సినిమాలంటే ఆసక్తి తగ్గింది. అయితే ఈసారి విజయ్ సేతుపతితో సినిమాను మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో కచ్చితంగా మ్యాటర్ ఉంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు పూరి జగన్నాధ్ తీసుకు రాబోతున్నాడు. ఇదే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా షూటింగ్ స్పీడ్‌గా జరగనుంది. సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
