డబ్బు వేటలో ఆరోగ్యాన్ని బంధాల్ని కోల్పోతున్నాం: పూరి మ్యూజింగ్స్
పూరి జగన్నాథ్ కెరీర్ జర్నీని గమనిస్తే...ఆయన కాలం విలువను కేవలం మాటల్లో చెప్పడమే కాదు... చేతల్లో చూపిస్తూ `ఇన్ టైమ్`లోనే ఆశించిన భారీ విజయాలను సాధించారు.
By: Sivaji Kontham | 26 Jun 2026 11:28 AM ISTడైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వైవిధ్యమైన ఆలోచనలకు, సరికొత్త ఫిలాసఫీకి వేదికగా నిలుస్తంది `పూరి మ్యూజింగ్స్` పాడ్ కాస్ట్. తాజా పాడ్ కాస్ట్ లో పూరి టైమ్ తాలూకా విలువను, ప్రాముఖ్యతను తనదైన శైలిలో వివరించారు. ఈ ప్రపంచంలో డబ్బు కంటే కూడా అత్యంత విలువైనది సమయమని.. పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ కష్టపడి సంపాదించవచ్చు కానీ.. చేజారిన కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తీసుకురాలేమని విశ్లేషించారు. మనుషులు డబ్బు సంపాదించే వేటలో పగలు, రాత్రి కష్టపడుతూ ఆరోగ్యాన్ని, బంధాలను దూరం చేసుకుంటున్నారని.. తీరా బోలెడంత డబ్బు సంపాదించాక దానిని అనుభవించడానికి జీవితంలో టైమ్ మిగలడం లేదని పూరి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సమయమే నిజమైన కరెన్సీ అని... ఎంత డబ్బు ఇచ్చినా కాలాన్ని కొనలేమని పూరీ నొక్కి చెప్పారు.
పూరి జగన్నాథ్ కెరీర్ జర్నీని గమనిస్తే...ఆయన కాలం విలువను కేవలం మాటల్లో చెప్పడమే కాదు... చేతల్లో చూపిస్తూ `ఇన్ టైమ్`లోనే ఆశించిన భారీ విజయాలను సాధించారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన `బద్రి` సినిమాతో దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన పూరి.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ హోదాను సొంతం చేసుకున్నారు. వరుసగా ఇండస్ట్రీ హిట్లను అందిస్తూ వందల కోట్ల ఆస్తులను ఆర్జించారు. సినిమా ఇండస్ట్రీలో ఒక స్క్రిప్ట్ రాయడానికి లేదా సినిమా పూర్తి చేయడానికి ఏళ్లకెళ్లు సమయం తీసుకునే రోజుల్లో పూరి మాత్రం కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాలను పూర్తి చేస్తూ టైమింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
ఆయన ప్రతి 10 ఏళ్ల కెరీర్ జర్నీని పరిశీలిస్తే... ప్రతి దశాబ్దంలోనూ పూరి జగన్నాథ్ అనుకున్నది సాధిస్తూ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. మొదటి దశాబ్దంలో `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `ఇడియట్`, `అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి`,`పోకిరి` వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలతో తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఆ తర్వాతి దశాబ్దాల్లోనూ ఒడిదొడుకులు ఎదురైనా బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకుంటూనే వచ్చారు. కచ్చితంగా పూరి తన జీవితంలో, కెరీర్‌లో `ఇన్ టైమ్` లోనే అనుకున్న లక్ష్యాలను, రికార్డులను సమర్థవంతంగా చేరుకున్నారని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఫిలింనగర్, కృష్ణానగర్‌లలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే నేటితరం ఔత్సాహిక ఫిలింమేకర్స్ పూరి జగన్నాథ్ చెప్పిన టైమింగ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. చాలామంది యువ దర్శకులు ఒకే స్క్రిప్ట్ పట్టుకుని ఏళ్ల తరబడి సమయాన్ని వృథా చేస్తుంటారు. కానీ పూరి జగన్నాథ్ లాగా వేగంగా ఆలోచించడం, శరవేగంగా స్క్రిప్ట్ పూర్తి చేయడం.. అనుకున్న సమయానికి సినిమాను తెరకెక్కించడం వంటి `టైమ్ మేనేజ్‌మెంట్` సూత్రాలను అలవర్చుకోవాలి. కాలం ఎవరి కోసమూ ఆగదని... వచ్చిన అవకాశాన్ని ఇన్ టైమ్‌లో ఉపయోగించుకుంటేనే ఇండస్ట్రీలో స్థిరపడగలమని పూరి జర్నీ నిరూపిస్తోంది.
పూరి జగన్నాథ్ తన జీవిత అనుభవాల నుండి చెప్పినట్లుగా.. ఎంత డబ్బు ఉన్నా...ఎన్ని విజయాలు సాధించినా కాలం కంటే ఏదీ ఎక్కువ కాదు. భవిష్యత్తులో హ్యాపీగా బతుకుదాం అనుకునే లోపే సమయం చేతుల్లోంచి జారిపోవచ్చు. అందుకే ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నవారంతా సమయాన్ని వృథా చేయకుండా... దాన్ని సరైన కరెన్సీలా వాడుకుంటూ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే పూరి మ్యూజింగ్స్ మనకు అందించే అసలైన సందేశం.
