Begin typing your search above and press return to search.

పూరి కొత్త ఫిలాసఫీ.. రోడ్డు పక్క పుస్తకాల వెనుక ఇంత స్టోరీనా?

సినిమాలకే పరిమితం కాకుండా జీవితాన్ని కూడా తనదైన కోణంలో చూడగలిగే పూరి, ఈసారి రోడ్డు పక్కన కనిపించే పాత పుస్తకాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 April 2026 8:30 AM IST
పూరి కొత్త ఫిలాసఫీ.. రోడ్డు పక్క పుస్తకాల వెనుక ఇంత స్టోరీనా?
X

పూరి జగన్నాథ్ సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, జీవితాన్ని చూసే ప్రత్యేక దృక్కోణంతో ఆయన ఎప్పుడూ చర్చలో ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్ల‌మ్ డాగ్ సినిమా చేస్తున్న చేస్తున్న ఆయన, మరోవైపు పూరి మ్యూజింగ్స్ పేరుతో తన ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకుంటూ వస్తున్నారు. సినిమాలకే పరిమితం కాకుండా జీవితాన్ని కూడా తనదైన కోణంలో చూడగలిగే పూరి, ఈసారి రోడ్డు పక్కన కనిపించే పాత పుస్తకాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

పూరి చెప్పిన మాటల్లో ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీ కనిపిస్తుంది. రోడ్డు పక్కన చాపల మీద, పెట్టెల మీద లేదా నేల మీద అమ్మే పాత పుస్తకాలు కేవలం వస్తువులు కావని, అవి కాలాన్ని దాటి వచ్చిన జ్ఞాపకాలని ఆయన అభివర్ణించారు. రంగు కోల్పోయిన కవర్లు, పసుపు రంగులోకి మారిన పేజీలు కూడా ఒక జీవితానికి సాక్ష్యమని ఆయన చెప్తున్నారు. ఆ పుస్తకాల్లో ఎవరో ఒకరి స్పర్శ, ఎవరో ఒకరి ఎమోష‌న్ దాగి ఉంటుందని చెప్పడం ద్వారా పూరి జీవితం పట్ల ఉన్న సున్నితమైన దృక్కోణాన్ని తెలియజేశారు.

ఈ పాత పుస్తకాల వెనుక ఉన్న మనుషుల జీవితాలను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్డు పక్కన పుస్తకాలు అమ్మే వ్యక్తులు కేవలం వ్యాపారం చేయడం లేదని, వారు కథలను కాపాడుతున్నారని పూరి అభిప్రాయపడ్డారు. ప్రతి పుస్తకం వెనుక ఒక జ్ఞాపకం ఉంటుందని, అది ఒక విద్యార్థి వాడినదై ఉండొచ్చు లేదా లైబ్రరీలో ఎన్నో సంవత్సరాలు ఉన్నదై ఉండొచ్చు అనే విషయాన్ని గుర్తుచేశారు. ఒక పుస్తకం గురించి అడిగితే దాని ధర మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న కథను కూడా చెప్పే ఆ అమ్మకందారుల జీవితాల్లోనే ఒక ప్రత్యేకమైన హ్యూమన్ స్టోరీ ఉందని ఆయన పేర్కొన్నారు.

పాత పుస్తకాలలో దాగి ఉన్న నాస్టాల్జియా అంశాన్ని కూడా పూరి తన మాటల్లో బలంగా వ్యక్తం చేశారు. పుస్తకాన్ని తెరిస్తే అందులో కనిపించే పేర్లు, మధ్యలో దాచిన రైల్వే టికెట్లు, అండర్‌లైన్ చేసిన వాక్యాలు.. ఇవ‌న్నీ గతంలోకి తీసుకెళ్లే చిన్న చిన్న జ్ఞాపకాలుగా మారతాయి. ఆ పుస్తకాన్ని ముందుగా చదివిన వ్యక్తి ఎవరో, అతని భావోద్వేగాలు ఎలా ఉన్నాయో అనే ఊహలు కూడా మనసును తాకేలా ఉంటాయని ఆయన వివరించారు. ఇక ఈ మొత్తం ఆలోచనల మధ్య పూరి మ్యూజింగ్స్ బ్రాండ్ మరోసారి బలంగా హైలైట్ అవుతోంది. కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఈ వేదిక ద్వారా పూరి తన వ్యక్తిగత ఆలోచనలు, జీవిత దృక్కోణం, సామాజిక విషయాలపై స్పందనలు పంచుకుంటున్నారు. సినిమాలకే పరిమితం కాకుండా జీవితం గురించి కూడా తనదైన తాత్విక దృక్కోణాన్ని ప్రేక్షకులకు అందించడం ఈ బ్రాండ్ ప్రత్యేకతగా మారుతోంది. ఈసారి రోడ్డు పక్క పుస్తకాలపై చేసిన వ్యాఖ్యలు కూడా అదే తత్వాన్ని కొనసాగిస్తున్నాయి.