Begin typing your search above and press return to search.

అత‌డిని పూరి మూడేళ్లు పోషించాడు!

సినీ పరిశ్రమలో విజయాలు వచ్చినప్పుడు అందరూ వెంటే ఉంటారు. కానీ ఓటమి ఎదురైనప్పుడు అండగా నిలిచేవారు చాలా అరుదు.

By:  Srikanth Kontham   |   28 April 2026 8:00 PM IST
అత‌డిని పూరి మూడేళ్లు పోషించాడు!
X

సినీ పరిశ్రమలో విజయాలు వచ్చినప్పుడు అందరూ వెంటే ఉంటారు. కానీ ఓటమి ఎదురైనప్పుడు అండగా నిలిచేవారు చాలా అరుదు. అటువంటి అరుదైన బంధం దర్శకులు పూరి జగన్నాథ్ - హరీష్ శంకర్ మధ్య ఉందని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. హరీష్ శంకర్ తొలి చిత్రం `షాక్` ప్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ పరాజ యాన్ని చవి చూసిన పూరి హ‌రీష్‌ కెరీర్ పరంగా ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని అండగా నిలిచారు. దాదాపు మూడేళ్ల పాటు హరీష్‌ను పూరి వెన్నంటి ఉండి ప్రోత్సహించడం విశేషం. హరీష్ శంకర్ తొలి సినిమా ప్లాప్ అవ్వడంతో అవకాశాలు రాక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతోన్న తరుణంలో పూరి జగన్నాథ్ హ‌రీష్ పరిస్థితిని అర్థం చేసుకున్నారు.

ఆ స‌మ‌యంలో పూరి మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ని `చిరుత‌`తో లాంచ్ చేసే ప‌నుల్లో ఉన్నారు. అప్పుడే హ‌రీష్ ని పిలిపించి త‌నతో ఉండ‌మ‌ని హ‌రీష్ కు రైట‌ర్ అనే ట్యాగ్ ఇచ్చి మూడేళ్ల పాటు త‌న‌ని పోషించార‌ని హ‌రీస్ స్వ‌యంగా తెలిపారు. నిజానికి పూరి జగన్నాథ్ అద్భుతమైన రచయిత. ఆయనకు మరొకరి సహాయం అవసరం లేకపోయినా? హరీష్ శంకర్‌లోని సృజనాత్మకతను వృథా పోనివ్వకూడదనే ఉద్దేశంతో అవకాశం ఇచ్చారు. ఆ మూడేళ్ల కాలంలో హరీష్‌కు ఆర్థిక భరోసాతో పాటు, ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా ఒక గుర్తింపును పూరి ప్రసాదించారు.

గురువుగా, అన్నగా పూరి చూపిన ఆ చొరవ హరీష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. హరీష్ శంకర్ కూడా ఈ విషయాన్ని ఎన్నో వేదికలపై ఎంతో కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటారు. `పూరి గారు నన్ను ఆ మూడేళ్లు పోషించారు` అని ఆయన బహిరంగంగానే చెబుతుంటారు. ఒక దర్శకుడికి ప్లాప్ వచ్చినప్పుడు సమాజం చూసే చూపు ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా పూరి జగన్నాథ్ అప్పట్లో చేసిన సాయం అసాధారణమైనది. ఆ సమయంలో లభించిన ఆశ్రయమే హరీష్ శంకర్ మళ్లీ పుంజుకుని `మిరపకాయ్`, `గబ్బర్ సింగ్` వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వడానికి పునాది వేసింది.

టాలీవుడ్‌లో పూరి జగన్నాథ్‌ను `డైరెక్టర్స్ మేకర్` అని పిలుస్తుంటారు. ఆయన దగ్గర పనిచేసిన ఎంతో మంది నేడు అగ్ర దర్శకులుగా రాణిస్తున్నారు. అయితే హరీష్ శంకర్ విషయంలో పూరి చూపిన ఆదరణ వృత్తిపరమైనదే కాదు. మానవత్వంతో కూడా కూడినది. ప్రతిభ గల వ్యక్తి కాలగర్భంలో కలిసిపోకుండా? ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించారు. అలాగే పూరి-హ‌రీష్ ఇద్ద‌రు కూడా రాంగోపాల్ వ‌ర్మ శిష్యులే. ఆయ‌న వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌గా ప‌నిచేసే ద‌ర్శ‌కులుగా మారారు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాధ్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా `స్ల‌మ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` అనే సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమ‌తో మ‌ళ్లీ పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.