పూరీ 'స్లమ్ డాగ్'.. రిలీజ్ కు ఇబ్బందులు తప్పవా?
దీనికి ప్రధాన కారణం పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన గత చిత్రం లైగర్ చుట్టూ ఉన్న ఆర్థిక వివాదాలే.
By: M Prashanth | 24 March 2026 4:33 PM ISTస్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపించనున్నారు. కీలక పాత్రల్లో టబు, దునియా విజయ్ కుమార్ నటిస్తున్నారు. రీసెంట్ గా ఆ మూవీకి స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
జనవరిలో విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ ను రివీల్ చేస్తూ.. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచింది. పోస్టర్ లో ఆయన బిచ్చగాడి గెటప్ లో కనిపిస్తూ.. చేతిలో రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని పవర్ ఫుల్ లుక్ లో మెప్పించారు. చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బు కట్టలు కథలోని ఇంటెన్సిటీ సూచిస్తున్నాయి.
సినిమాను పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ తో కలిసి చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. జేబీ మోషన్ పిక్చర్స్ తరఫున జేబీ నారాయణరావు నిర్మాణంలో భాగమయ్యారు. సంగీతాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. షూటింగ్ ను కేవలం ఐదు నెలల్లో పూర్తి చేశారు.
అయితే సినిమా విడుదలకు ముందు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన గత చిత్రం లైగర్ చుట్టూ ఉన్న ఆర్థిక వివాదాలే. ఆ సినిమా వల్ల కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయని, వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని టాక్ ఉంది.
ఇక తర్వాత వచ్చిన డబుల్ ఐస్మార్ట్ సినిమా సమయంలో, బకాయిల్లో కొంత మొత్తం చెల్లించి, మిగిలిన దాన్ని సినిమా విడుదల తర్వాత చెల్లిస్తానని పూరీ మాటిచ్చారని సమాచారం. అయితే ఆ హామీ పూర్తిగా నిలబెట్టుకోలేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు పంపిణీదారులు బకాయిలు క్లియర్ అయ్యేవరకు పూరీ జగన్నాథ్ సినిమాలు రిలీజ్ చేయనివ్వకూడదని వారు నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇదే కారణంగా గతంలో విడుదలకు సిద్ధమైన పోకిరి రీ రిలీజ్ నిలిచిపోయిందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో స్లమ్ డాగ్ సినిమా విడుదల సమయంలో ఏం జరుగతుందోన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకపోతే రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. ఏదేమైనా కంటెంట్ పరంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఆ సినిమా,, విడుదల సమయంలో ఆర్థిక సమస్యలను ఎలా అధిగమిస్తుందన్నది చూడాల్సి ఉంది. ప్రేక్షకులు మాత్రం విజయ్ సేతుపతి- పూరీ జగన్నాథ్ కాంబినేషన్ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.
