Begin typing your search above and press return to search.

పూరి & ఛార్మి.. ఆ తలనొప్పులు ఇంకా క్లియర్ అవ్వలేదా?

ఇక స్లమ్ డాగ్ విషయానికి వస్తే, మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో పాటు కొత్త తరహా కథనాన్ని చూపించే ప్రయత్నం చేశారని టీజర్ ద్వారా అర్థమైంది.

By:  M Prashanth   |   11 July 2026 10:24 AM IST
పూరి & ఛార్మి.. ఆ తలనొప్పులు ఇంకా క్లియర్ అవ్వలేదా?
X

ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్‌ లో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇప్పుడు మాత్రం కొత్త సినిమా పూర్తయినా విడుదల తేదీ ప్రకటించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారనే చర్చ సాగుతోంది. పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం స్లమ్ డాగ్ : 33 టెంపుల్ రోడ్ విడుదలపై ఇంకా క్లారిటీ రాకపోవడం వెనుక పాత సినిమాల నష్టాలే ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తోంది.

విజయ్ సేతుపతి, టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ లీడ్ రోల్స్ లో రూపొందిన ఆ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. టీజర్‌ కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఫైనల్ ఎడిటింగ్, రీ-రికార్డింగ్ పనులు చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ విడుదల తేదీ ప్రకటించకపోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇందుకు ప్రధాన కారణంగా పూరీ జగన్నాథ్ గత రెండు సినిమాలు లైగర్, డబుల్ ఇస్మార్ట్ వల్ల ఏర్పడిన ఆర్థిక వివాదాలే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. దీంతో ఆ చిత్రాన్ని కొనుగోలు చేసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూశారు. ఆ నష్టాలను తర్వాత సినిమా ద్వారా భర్తీ చేస్తామని నిర్మాతల నుంచి హామీ వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే ఇస్మార్ట్ శంకర్ విజయంతో భారీ అంచనాలు ఏర్పడిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో వరుసగా రెండు సినిమాల వల్ల నష్టపోయిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు తమకు నష్టపరిహారం చెల్లించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఆ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ లో చర్చలు కొనసాగుతున్నాయని, తెలంగాణ ఎగ్జిబిటర్ల స్థాయిలో కూడా ఆ అంశం పెండింగ్‌ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఆ పరిస్థితులు స్లమ్ డాగ్ విడుదలపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా సిద్ధంగా ఉన్నా, అన్ని అంశాలు పరిష్కారమయ్యాకే విడుదల తేదీ ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఓటీటీ డీల్ పై చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి ముగిస్తే ముందుగా ఆర్థిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశముందని ప్రచారం సాగుతోంది.

ఇక స్లమ్ డాగ్ విషయానికి వస్తే, మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో పాటు కొత్త తరహా కథనాన్ని చూపించే ప్రయత్నం చేశారని టీజర్ ద్వారా అర్థమైంది. విజయ్ సేతుపతి యాక్టింగ్, టబు కీలక పాత్ర, దునియా విజయ్ విలన్ రోల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. పాత తలనొప్పులు క్లియర్ అయ్యి స్లమ్ డాగ్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? ఆ సినిమా విజయంతో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ మళ్లీ ట్రాక్ లోకి వస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు సస్పెన్స్ కొనసాగనుంది.