Begin typing your search above and press return to search.

బిన్ లాడెన్ గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను చెప్పిన పూరీ

బిన్ లాడెన్ ఇంటిపేరు వ‌జీరిస్తాన్ హ‌వేలి. చుట్టూ 12-18 అడుగు ఎత్తున్న గోడ‌ల‌తో మూడు అంత‌స్థుల‌తో ఎంతో ప‌క‌డ్బందీగా దాన్ని క‌ట్టించాడు.

By:  Tupaki Desk   |   30 May 2025 6:17 PM IST
బిన్ లాడెన్ గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను చెప్పిన పూరీ
X

డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ వివిధ అంశాల‌పై పూరీ మ్యూజింగ్స్ పేరుతో త‌న అభిప్రాయాన్ని పంచుకుంటూ, చాలా మందికి తెలియ‌ని విష‌యాల‌ను తెలియ‌చేస్తూ ఉంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా పూరీ జ‌గ‌న్నాథ్ ఎన్నో వేల మంది చావుల‌కు కార‌ణమైన బిన్ లాడెన్ గురించి మాట్లాడాడు. పాకిస్తాన్ స్వాట్ వ్యాలీలో స్పీడ్ గా వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపి కాసేపు ఆ డ్రైవ‌ర్ తో మాట్లాడాక పోలీసులు ఆ కారును పంపించేశారు. ఆ రోజు పోలీసులు ఆ కారును ప‌ట్టుకుని ఉంటే బిన్ లాడెన్ ప‌దేళ్ల ముందే దొరికేవాడ‌ని, అత‌నెలా ఉంటాడో పోలీసుల‌కు తెలియ‌క‌పోవ‌డం వ‌ల్లే అత‌న్ని వ‌ద‌లేశార‌ని పూరీ చెప్పాడు.

బిన్ లాడెన్ ఇంటిపేరు వ‌జీరిస్తాన్ హ‌వేలి. చుట్టూ 12-18 అడుగు ఎత్తున్న గోడ‌ల‌తో మూడు అంత‌స్థుల‌తో ఎంతో ప‌క‌డ్బందీగా దాన్ని క‌ట్టించాడు. అత‌ని ముగ్గురు భార్య‌లు, 8 మంది పిల్ల‌లు, ఐదుగురు మ‌న‌వ‌ళ్లు అక్క‌డే ఉండేవారు. లాడెన్ కూడా త‌న చిన్న భార్య‌తో అక్క‌డే ఉండేవాడ‌ని, ఆ ఇంటికి టెలిఫోన్, ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ కూడా ఉండేది కాద‌ని, ఆఖ‌రికి ఆ ఇంట్లోని చెత్త‌ను కూడా అక్క‌డే త‌గ‌ల‌బెట్టేవార‌ని పూరీ చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో అస‌లు ఎవ‌రుంటున్నార‌నేది చుట్టు ప‌క్క‌ల వారికి కూడా తెలిసేది కాద‌ని, కేవ‌లం నాలుగు జ‌త‌ల బ‌ట్ట‌లు, ఒక జాకెట్, రెండు స్వెట‌ర్స్ తో లాడెన్ 9 ఏళ్ల పాటూ అజ్ఞాతంలో బ‌తికాడ‌ని, కౌబాయ్ టోపీ పెట్టుకుని కాంపౌండ్ లో తిరిగేవాడ‌ని, అత‌ని ఫ్రెండ్స్ అహ్మ‌ద్ అల్ కువైటీ, అబ్రార్ మాత్ర‌మే అత‌నితో కాంటాక్ట్ లో ఉండేవారనీ, వారే అత‌ని అవ‌స‌రాల‌ను కూడా చూసుకునేవాళ్ల‌ని చెప్పాడు.

ఆ ఇంటి చుట్టూనే కూర‌గాయలు పండించుకుంటూ, కోళ్లు, కుందేళ్ల‌ను పెంచుకుంటూ బ‌తికిన లాడెన్, త‌న మ‌న‌వ‌ళ్ల‌తో కూడా మొక్క‌లు నాటించి, ఎవ‌రి మొక్క పెద్ద‌గా అయితే వారికి గిఫ్టులు ఇస్తాన‌ని పోటీలు పెట్టేవాడ‌ని, సీక్రెట్ శాటిలైట్ డిష్ పెట్టుకుని ఎప్ప‌టికప్పుడు త‌న గురించి బ‌య‌ట ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేవాడ‌ని పూరీ చెప్పాడు. లాడెన్ కు స్వీట్లు, చాక్లెట్లు అంటే బాగా ఇష్టమ‌ట‌. ఓ సారి త‌న భార్య డెలివ‌రీ టైమ్ లో త‌ప్ప‌క మారువేషంలో హాస్పిట‌ల్ కు వెళ్లి డాక్ట‌ర్ తో త‌న భార్య చెవిటిది, మూగ‌ది అని అబ‌ద్దం చెప్పి ఎవ‌రూ ఆమెను ఏమీ అడ‌క్కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడ‌ట బిన్ లాడెన్.

అల్‌ఖైదా ఆప‌రేష‌న్స్ గురించి అత‌ను చెప్తుంటే కూతుళ్లు పేప‌ర్ల మీద రాసేవార‌ని, ఆ టైమ్ లో అల్‌ఖైదా వీక్ అవ‌డం చూసి ఎంతో బాధ‌ప‌డి దాని పేరు మార్చాల‌ని కూడా బిన్ లాడెన్ ఆలోచించాడ‌ట‌. త‌న పిల్ల‌లు, మ‌న‌వ‌ళ్లు స్కూల్స్ కు వెళ్లే ఛాన్స్ లేక‌పోవ‌డంతో అత‌నే అన్నీ నేర్పించాడ‌నీ, ఏదైనా ఇన్ఫ‌ర్మేష‌న్ ఎవ‌రికైనా పంపాలంటే యూఎస్‌బీ డ్రైవ్స్ వాడేవాడ‌నీ, ఎన్నో ఏళ్ల పాటూ అదే ఇంట్లో బిన్ లాడెన్ ప్ర‌తీ క్ష‌ణం భ‌యంతో బ‌తికాడ‌ని పూరీ చెప్పాడు. ఆఖ‌రిలో సీల్ టీమ్ లాడెన్ ఇంట్లో చొర‌బ‌డి అత‌న్ని చంపాక అత‌ని ఇంట్లో ఉన్న కంప్యూట‌ర్ నుంచి 4.70 ల‌క్షల ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నార‌ని, అందులో పోర్న్ వీడియోలతో పాటూ అమెరిక‌న్ ప్రెసిడెంట్ ఒబామాను ఎలా చంపాల‌నే ప్లాన్స్ కూడా ఉన్నాయ‌ని పూరీ జ‌గ‌న్నాథ్ బిన్ లాడెన్ గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను వెల్ల‌డించాడు.