సక్సెస్ కిక్కు తలకెక్కితే ఎలా ఉంటుందో చెప్పిన పూరి
దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన శైలిలో సమాజంలోని మనుషుల మనస్తత్వాల గురించి..లోకం తీరు తెన్నుల గురించి వర్ణిస్తూ పాడ్ కాస్ట్ లతో అలరిస్తున్నారు.
By: Sivaji Kontham | 25 April 2026 3:54 PM ISTదర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన శైలిలో సమాజంలోని మనుషుల మనస్తత్వాల గురించి..లోకం తీరు తెన్నుల గురించి వర్ణిస్తూ పాడ్ కాస్ట్ లతో అలరిస్తున్నారు. ముఖ్యంగా సక్సెస్ వచ్చాక మారే వైఖరి గురించి `పూరి మ్యూజింగ్స్` తాజా పాడ్ కాస్ట్ లో చేసిన వ్యాఖ్యలు హా*ట్ టాపిగ్గా మారాయి.
మనుషుల మధ్య సంబంధాలు వారు ఉన్న స్థితిని బట్టి ఎలా మారిపోతాయో పూరి జగన్నాథ్ తాజా ఆడియోలో ఎంతో నిశితంగా వివరించారు. మనతో కలిసి తిరిగే వ్యక్తులలో ఎవరికైనా ఒక్కసారిగా సక్సెస్ వస్తే.. ఆ మరుసటి రోజు నుండే వారిలో మార్పు మొదలవుతుందని పూరి అభిప్రాయపడ్డారు. నిన్నటి వరకు మనతో ఎంతో ఆప్యాయంగా.. సమానంగా మాట్లాడిన వ్యక్తి.. సక్సెస్ వచ్చాక మిగతా వారిని పలకరించే విధానంలో ఒక రకమైన ఆధిక్యతను చూపిస్తారని... ఇది మానవ స్వభావంలోని ఒక వింతైన కోణమని పూరి విశ్లేషించారు.
అహంకారి అందరితో కలిసి పని చేయలేరు. ఇతరులతో రిలేషన్ చెడుతుంది. అహంకారం ఉన్నవాడు విమర్శల్ని అంగీకరించడు. ఇతరులను కలవలేడు. కానీ మనం ఎదగాలంటే.. ఇవన్నీ అవసరం. ఏ అహంకారికి కూడా తనకు పొగరెక్కిందని తెలీదు. మన దగ్గర డబ్బు - సక్సెస్ ఉన్నంత కాలం మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే మనకు ఉన్న పొగరు తగ్గాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుతారు. అందరూ ఒక్కసారిగా వదిలేసాక మనం ఒంటరి అయిపోతాం. అప్పుడు కూడా అందరూ మనల్నిమోసం చేసారని అనుకుంటాం తప్ప.. వీటన్నిటికీ కారణం మన అహంకారం అని గ్రహించము. అహంకారం మన ఎదుగుదల సంబంధాలను అర్థం చేసుకోవడానికి అడ్డంకి. అయితే దీనిని దాటుకుని వెళితే ధైర్యం, సంతోషం వస్తాయి. బలం అనేది మన వ్యక్తిత్వంతో సంపాదించాలి. ఎదిగే సమయంలో మనలోని అహంకారాన్ని మనమే గుర్తించి తొలగించాలి.. అని పూరి చాలా మంచి మాటలు చెప్పారు.
ముఖ్యంగా సినీ పరిశ్రమ వంటి గ్లామర్ రంగంలో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు. ``ఇండస్ట్రీ ఎంత మందిని చూడలేదు?`` అంటూ ఆయన చేసిన వ్యాఖ్య వెనుక ఒక గాఢమైన అర్థం ఉంది. ఇక్కడ సక్సెస్ అనేది శాశ్వతం కాదని... ఎంతో మంది శిఖరాగ్రానికి వెళ్లి మళ్ళీ కిందకు పడిపోయిన చరిత్రను పరిశ్రమ చూసిందని అతడు గుర్తు చేశారు. ఒక్క విజయం రాగానే గతాన్ని మర్చిపోయి.. తోటి వారిని తక్కువ చేసి చూడటం అనేది కేవలం అజ్ఞానమే అవుతుందని పూరి హెచ్చరించారు.
సక్సెస్ అనేది మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి కానీ అహంకారాన్ని కాదని పూరి మాటల సారాంశం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని... ఈరోజు సక్సెస్‌లో ఉన్న వ్యక్తి రేపు ఇబ్బందుల్లో పడొచ్చని గ్రహించిన వారు ఎప్పుడూ వినయంగానే ఉంటారు. అధికారం లేదా విజయం వచ్చినప్పుడు మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాం అనేదే మన అసలైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. మనుషుల మధ్య అంతరాలు హోదా వల్ల కాకుండా.. వారి ప్రవర్తన వల్ల ఏర్పడతాయని పూరి జగన్నాథ్ తనదైన శైలిలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
పూరి జగన్నాథ్ కెరీర్ మ్యాటర్ కి వస్తే... అతడు విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్` అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ చిత్రం ప్రస్తుతం సినీ ప్రియులలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఆయన రగ్గడ్ లుక్ .. చేతిలో రక్తంతో ఉన్న కత్తి ఈ సినిమా ఇంటెన్సిటీని ఆవిష్కరించాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై, హైదరాబాద్ పరిసరాల్లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది. సెట్స్ నుండి విజయ్ సేతుపతి కొన్ని ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. కోలీవుడ్ మక్కల్ సెల్వన్ సహజ నటనకు, పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ తోడైతే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కీలక దశలో ఉంది. 2026 చివరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
