నార్మల్ పీపుల్‌కి స్ట్రాంగ్ పీపుల్‌కు తేడా చెప్పిన పూరి
ఒక్కమాట కూడా మాట్లాడకుండా లోపల దాన్ని దాచుకుని మౌనంగా నడుచుకుంటూ ముందుకు వెళ్లండి. నలుగురిలో నలిగిన ప్రతిసారి ఒంటరిగా కూర్చోండి.
By: Tupaki Desk | 14 May 2025 3:00 AM ISTపూరి మ్యూజింగ్స్‌పేరుతో తన అభిప్రాయాలను దర్శకుడు పూరి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా `స్ట్రాంగ్ పీపుల్` అనే పదానికి చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా ఎవరి వళ్లైనా బాధకు గురైతే గట్టిగా ఏడవరని, మౌనం వహిస్తారని ఈ సందర్భంగా పూరి అభివర్ణించారు. వాళ్లు మళ్లీ ప్రేమించడానికి, ఇంకొకరితో స్నేహం చేయడానికి వంద ఆలోచిస్తారని తెలిపారు. నార్మల్ పీపుల్‌కి స్ట్రాంగ్ పీపుల్‌కి చాలా తేడా ఉంటుందన్నారు.
స్ట్రాంగ్ పీపుల్‌ని పరిశీలిస్తే వాళ్ల నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్లు ఏ కారణం చేతనైతే బాధకు గురైతే గట్టిగా ఏడవరు. అన్యాయం జరిగిందని అడగరు. ఎవరితోనూ యుద్ధం చేయరు. జరిగిన దానికి ఎవరికీ సమాధానం చెప్పరు. ఫిర్యాదు చేయరు. వివరణలు ఇచ్చుకోరు. ఎక్కువ డ్రామా చేయరు. ఎవరి అటెన్షన్ కోసం ఎదురు చూడరు. ఎవరి మీద ఎలాంటి ద్వేషం, కోపం పెట్టుకోరు, ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో అసలు ఉండదు. జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని బాధను గుండెల్లో పెట్టుకుని నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్లిపోతారు.
కొన్నాళ్లు అందరికీ దూరంగా బతుకుతారు. అయితే ఇదివరకు ఉన్న నమ్మకం మనుషులపై ఉండదు. పరిచయాలు తగ్గిపోతాయి. వ్యవస్థమీద, సొసైటీమీద అసహ్యం వేయొచ్చు. బంధాలపై విరక్తి కలగొచ్చు. అయినా అందరితో నవ్వుతూ మాట్లాడతారు. అందరి పట్ల దయతో ఉంటారు. వారి కష్టాన్ని ఎవరితోనూ పంచుకోరు. అందరితో ఎప్పటిలాగే సరదాగా ఉంటారు. ఎవడో అన్యాయం చేశాడని ఇంకొకరికి అన్యాయం చేయరు. దుర్మార్గుడిని కలిసిన తరువాత దుర్మార్గులుగా మారిపోరు.
ఎప్పటిలాగే చిరునవ్వుతో సాధారణంగా ఉంటారు. కాకపోతే ఇంతకు ముందు కంటే మరింత జాగ్రత్తగా ఉంటారు. పనికిరాని పనులు కోసం అనవసరమైన వ్యక్తుల కోసం శక్తిని వృథా చేయరు. ఇకపై ఏం చేసినా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్లీ ప్రేమించడానికి, స్నేహం చేయడానికి వందసార్లు ఆలోచిస్తారు. అందుకే జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే అని అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ధైర్యంగా ఉండండి.
ఒక్కమాట కూడా మాట్లాడకుండా లోపల దాన్ని దాచుకుని మౌనంగా నడుచుకుంటూ ముందుకు వెళ్లండి. నలుగురిలో నలిగిన ప్రతిసారి ఒంటరిగా కూర్చోండి. అప్పుడే గాయాలన్నీ మానుతాయి. ప్రతి వెన్నుపోటు తరువాత మీరు మరింత బలంగా తయారవుతారు` అంటూ పూరీ జగన్నాథ్ స్ట్రాంగ్ పీపుల్ ఎలా ఉండాలో ఎలా ఉండ కూడదో చక్కటి నిర్వచనాన్నిచ్చారు.
