Begin typing your search above and press return to search.

ఫిజిక్స్ కన్నా నేర్పించాల్సింది అదే.. పూరీ 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' ప్లాన్ ఇలా!

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరోసారి తన ఆలోచనలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

By:  M Prashanth   |   23 May 2026 6:12 PM IST
ఫిజిక్స్ కన్నా నేర్పించాల్సింది అదే.. పూరీ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఇలా!
X

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరోసారి తన ఆలోచనలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఆయన విడుదల చేస్తున్న పాడ్‌ కాస్ట్‌ లకు స్పెషల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పేరుతో విడుదల చేసిన ఆడియోలో ప్రస్తుత విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మోడ్రన్ స్కూల్స్ పిల్లలకు సరైన దిశలో నాలెడ్జ్ అందించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు మార్కులు సాధించడానికి, పరీక్షల వరకు విద్యను పరిమితం చేస్తున్నారని ఆయన అన్నారు.

కానీ జీవితం అనేది కేవలం మార్కులతో ముందుకు సాగదని, వ్యక్తిత్వం, క్రమశిక్షణ, ఎమోషనల్ కంట్రోల్, రెస్పాన్సిబిలిటీ వంటి లక్షణాలు మనిషిని బలంగా నిలబెడతాయని పేర్కొన్నారు. "మన దేశానికి ఇప్పుడు అవసరమైనది కేవలం బుక్ నాలెడ్జ్ కాదు. క్యారెక్టర్ ఉన్న యువత అవసరం. చిన్నప్పటి నుంచే పిల్లల్లో డిసిప్లిన్, హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ పెంచాలి" అని పూరీ తెలిపారు. ఎల్‌కేజీ స్థాయి నుంచే పిల్లలకు ఇంటి పనులు చేసుకోవడం, పరిశుభ్రత పాటించడం, సమయపాలన, నిజాయితీ వంటి విషయాలను నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ అలవాట్లు జీవితాంతం వారికి ఉపయోగపడతాయని చెప్పారు.

పిల్లలకు ప్రాక్టికల్ విజ్డమ్ నేర్పించడం విద్యా వ్యవస్థలో తక్కువగా కనిపిస్తోందని పూరీ అభిప్రాయపడ్డారు. స్కూల్స్‌ లో కేవలం లెసెన్స్ కే పరిమితం కాకుండా, లైఫ్ స్కిల్స్ బోధించాలని సూచించారు. కుకింగ్ క్లాసెస్ ఉండాలని, ఎవరి పనులు వాళ్లే చేసుకోవడం వంటివి చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని చెప్పారు. వ్యాయామం, క్రీడలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల ముందు గడుపుతున్నారని, దీని వల్ల శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పిల్లల్లో పెరుగుతోందని, కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చాలా మందికి తెలియడం లేదన్నారు. స్క్రీన్ అడిక్షన్ తగ్గించడానికి స్కూల్స్ ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటర్నెట్‌ ను ప్రొడక్టివ్‌ గా ఎలా ఉపయోగించాలి, ఏ విషయాలు నేర్చుకోవాలి, సమయాన్ని ఎలా నియంత్రించుకోవాలి అనే అంశాలను విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం స్కూల్స్ మార్కులు, పరీక్షలు, కాంపిటీషన్ పై ఫోకస్ పెడుతున్నాయని పూరీ విమర్శించారు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నేర్పించే ముందు సెల్ఫ్ కంట్రోల్, టైమ్ మేనేజ్‌మెంట్, ఎమోషనల్ బ్యాలెన్స్ వంటి అంశాలపై మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. జీవితంలో నిజంగా ఉపయోగపడేవి ఇవేనని పేర్కొన్నారు. అయితే పూరీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చాలా మంది నెటిజన్లు అభిప్రాయాలను సమర్థిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలకు అవసరమైన విద్య ఇదే, లైఫ్ స్కిల్స్ చాలా ముఖ్యమని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం ప్రస్తుత పోటీ ప్రపంచంలో అకడమిక్ ఎడ్యుకేషన్ కూడా అవసరమని అభిప్రాయపడుతున్నారు. సినిమాల ద్వారా మాత్రమే కాకుండా.. ఇలాంటి సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పడం పూరీ జగన్నాథ్‌ కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన చేసిన పాడ్‌ కాస్ట్‌ లు మంచి రెస్పాన్స్ పొందాయి. ఇప్పుడు విద్యా వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.