Begin typing your search above and press return to search.

ఈ అలవాటు ఉంటే చివరికి ఒంటరిగా మిగులుతాం: పూరీ జగన్నాథ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే కేవలం సినిమాలే కాదు, ఆయన చెప్పే జీవిత పాఠాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.

By:  Madhu Reddy   |   24 April 2026 11:18 PM IST
ఈ అలవాటు ఉంటే చివరికి ఒంటరిగా మిగులుతాం: పూరీ జగన్నాథ్
X

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే కేవలం సినిమాలే కాదు, ఆయన చెప్పే జీవిత పాఠాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. 'పూరీ మ్యూజింగ్స్' ద్వారా ఆయన పంచుకునే విషయాలు ఆలోచింపజేసేలా ఉంటాయి. తాజాగా ఆయన 'అహంకారం' గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయం వచ్చినప్పుడు మనిషి ప్రవర్తన ఎలా మారుతుంది? ఆ పొగరు మనిషిని ఎలా ఒంటరిని చేస్తుంది? అనే విషయాలను తనదైన శైలిలో వివరించారు. అహంకారం అనేది మనకు తెలియకుండానే మనల్ని ఎలా నాశనం చేస్తుందో పూరీ మాటల్లోనే చూద్దాం.

సక్సెస్ వస్తే నడక మారుతుంది:

మనిషికి ఏదైనా ఒక విజయం అందగానే వాడు తెలియకుండానే మారిపోతాడని పూరీ జగన్నాథ్ అంటున్నారు. ఆ సక్సెస్ రాగానే గడ్డం పైకెత్తి జనాన్ని చూడటం, పలకరించే తీరు మార్చుకోవడం వంటివి మొదలవుతాయి. చుట్టూ ఉన్న వాళ్లందరికీ వాడు అహంకారంతో ఊగిపోతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది, కానీ ఆ వ్యక్తి మాత్రం దాన్ని తన 'ఆత్మవిశ్వాసం' అనుకుని పొరబడతాడు. కేవలం పెద్ద సక్సెస్‌లే అక్కర్లేదు, చిన్న ఉద్యోగం వచ్చినా సరే కొందరిలో ప్రవర్తన మారిపోతుందని, అప్పుడు వారు చెప్పిందే వేదం అని భావిస్తారని ఆయన హెచ్చరించారు.

భయం నుంచే అహంకారం పుడుతుంది:

చాలాసార్లు అహంకారం అనేది లోపల ఉన్న అభద్రతా భావం నుంచి వస్తుందని పూరీ విశ్లేషించారు. తమలో ఉన్న లోపాలను దాచుకోవడానికి, తమను తాము గొప్పగా చూపించుకోవడానికి కొందరు ఈ అహంకారాన్ని ముసుగులా వాడుకుంటారు. దీనివల్ల బంధాలు దెబ్బతినడమే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉండదు. ఇక తనకే అన్నీ తెలుసు అనుకునే వాడి దగ్గరకు ఏ కొత్త ఆలోచన రాదు. ఈ పొగరు వల్ల చుట్టూ ఉన్న వాళ్లు మనల్ని అసహ్యించుకోవడం మొదలుపెడతారని ఆయన గుర్తు చేశారు.

నాశనం కావాలని మొక్కుకుంటారు:

మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు లేదా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరూ మన మొహం మీద 'నీకు పొగరు' అని చెప్పరు. అందరూ మన అహంకారాన్ని భరిస్తూనే, మన పక్కనే ఉండి మనకు వినయంగా నవ్వుతారు. కానీ లోలోపల మాత్రం 'వీడి పొగరు తగ్గాలి, వీడు నాశనం అయిపోవాలి' అని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటారు. ఇక మన విమర్శలను అంగీకరించకపోవడం, ఇతరులను తక్కువగా చూడటం వల్ల మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న ప్రేమని కోల్పోతామని పూరీ చాలా నిక్కచ్చిగా చెప్పారు.

ఓటమి వస్తే ఒంటరే:

ఒకసారి ఫెయిల్యూర్ రాగానే మన అహంకారం భరించలేక ఎదురుచూస్తున్న వారంతా 'హమ్మయ్య' అనుకుని మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఒంటరైపోయి అందరూ మనల్ని మోసం చేశారని బాధపడతాం కానీ ఆ పరిస్థితికి కారణం మన అహంకారమేనని గుర్తించం. అందుకే ఇక గౌరవాన్ని బలవంతంగా కాకుండా వ్యక్తిత్వంతో సంపాదించుకోవాలి. మనలో వచ్చే అహంకారాన్ని మనమే గుర్తించి, ధైర్యంగా దాన్ని వదులుకోవాలి. ఇక అప్పుడే నిజమైన విజేతలుగా నిలుస్తామని పూరీ జగన్నాథ్ తన ముగింపులో సందేశం ఇచ్చారు.