శానిటైజర్ వాడే బ్యాచ్ ఎక్కువ కాలం బతకదు.. పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు
మైక్రోస్కోప్ కింద చూస్తే, మన శరీరంపై బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఎన్నో రకాల జీవులు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోతామని ఆయన అన్నారు.
By: Tupaki Desk | 29 May 2025 10:59 PM IST"టిష్యూలు, శానిటైజర్‌లు వాడే బ్యాచ్ ఎక్కువ కాలం బతకదు" అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుండబద్దలు కొట్టారు. ప్రతి తరం బలహీనంగా మారుతోందని, మనిషి బలంగా ఉండాలంటే పల్లెటూరి ప్రజల తరహాలో జీవించాలని ఆయన సూచించారు. తన 'పూరి మ్యూజింగ్స్'లో భాగంగా 'టినీ లివింగ్ థింగ్స్' (చిన్న జీవులు) అనే అంశంపై మాట్లాడుతూ.. పూరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరోగ్యం, జీవనశైలిపై పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
పూరి జగన్నాథ్ తన మ్యూజింగ్స్‌లో మన కంటికి కనిపించని సూక్ష్మజీవుల (Microbes) గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "మానవ శరీరం మిలియన్ల కొద్దీ చిన్న జీవరాశులకు నిలయం. ఇవి మనతోనే, మనపైనే జీవిస్తాయి. ముక్కు, నోరు, కళ్ళు, చర్మం, జుట్టు, పొట్టలో.. ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. నిజానికి అవే మన నిజమైన కుటుంబ సభ్యులు" అని పూరి వివరించారు.
మైక్రోస్కోప్ కింద చూస్తే, మన శరీరంపై బ్యాక్టీరియా, ఫంగస్ వంటి ఎన్నో రకాల జీవులు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోతామని ఆయన అన్నారు. మనిషి బతకడానికి అవసరమైన పోషకాలను సమకూర్చడంలో, హానికర బ్యాక్టీరియాను నాశనం చేయడంలో, విటమిన్లు, ప్రోటీన్‌లు ఉత్పత్తి చేయడంలో ఈ సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తాయని పూరి తెలిపారు. మన వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇవి శరీరానికి అందిస్తాయని ఆయన చెప్పారు. సుమారు 100 ట్రిలియన్ల మైక్రోబ్స్ మనలో ఉంటాయని, వాటి బరువు దాదాపు రెండు కిలోలు ఉంటుందని పూరి పేర్కొన్నారు. ఉదాహరణకు మన పొట్టలో వెయ్యి రకాలు నోటిలో 700 రకాల సూక్ష్మజీవులు ఉంటాయని వివరించారు.
పట్టణాల్లో నివసించే వారిలో పెరుగుతున్న అతి శుభ్రత అలవాట్లు ఈ సూక్ష్మజీవులను దూరం చేస్తున్నాయని పూరి ఆందోళన వ్యక్తం చేశారు. "పదే పదే చేతులు సబ్బుతో కడగడం, శానిటైజర్‌లు వాడటం, డిస్టిల్డ్ వాటర్ తాగడం వంటివి ఈ మైక్రోబ్స్‌ను నాశనం చేస్తున్నాయి. దీని వల్లే వారి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది" అని పూరి అన్నారు. పల్లెటూళ్లలో నివసించేవారు ప్రకృతితో, జంతువులతో కలిసిమెలిసి జీవించడం వల్ల ఈ మైక్రోబ్స్ సహజంగా బలోపేతమవుతాయని అందుకే వారు బలంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి తరం మునుపటి తరం కంటే బలహీనంగా తయారవుతోందని పూరి జగన్నాథ్ హెచ్చరించారు. "మీ అమ్మమ్మ ఉన్నంత బలంగా మీ అమ్మ ఉండరు. మీ అమ్మ ఉన్నంత బలంగా మీరు ఉండరు. మీలా మీ పిల్లలు ఉండరు" అని ఆయన అన్నారు. బలంగా జీవించాలంటే ప్రకృతితో మమేకం కావాలని, పల్లెటూరి ప్రజల జీవనశైలిని అలవర్చుకోవాలని పూరి సూచించారు.
"ఎక్కడ నీళ్లు అక్కడ తాగండి. ఎక్కడ గాలి అక్కడే పీల్చండి. అక్కడున్న తిండే తినండి. అతి శుభ్రత పనికిరాదు. మీ పిల్లలను మట్టిలో ఆడనివ్వండి, వర్షంలో తడవనీయండి. వీలైతే ఇంట్లో కుక్క, పిల్లిని పెంచుకోండి. ప్రకృతికి దూరంగా బతకొద్దు.. చస్తారు" అంటూ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఘాటుగా హెచ్చరిస్తూ తన మ్యూజింగ్స్‌ను ముగించారు. పూరి వ్యాఖ్యలు నేటి ఆధునిక జీవనశైలిపై, ఆరోగ్యం, పరిశుభ్రత మధ్య సమతుల్యతపై లోతైన చర్చకు దారితీస్తున్నాయి.
