పూరి మ్యూజింగ్స్: మన పుట్టక గుట్టు విప్పిన పూరి
తాజా పాడ్ కాస్ట్ లో మానవజాతి పరిణామ క్రమం, వలసల నుంచి ఎలా మార్పులు చెందాయో వెల్లడించిన తీరు ఆసక్తిని రేకెత్తించింది.
By: Tupaki Desk | 22 May 2025 8:45 PM ISTఉత్తరాది వారిని ఆర్యులు అని, దక్షిణాది వారిని ద్రవిడులు అని అంటారు. సోషల్ పుస్తకాల్లో మనమంతా చదువుకున్నదే అయినా అసలు ఈ ఆర్యులు, ద్రవిడులకు మూలాలు ఎక్కడ ఉన్నాయి? అంటే.. `పూరి మ్యూజింగ్స్` లో గుట్టు విప్పారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. తాజా పాడ్ కాస్ట్ లో మానవజాతి పరిణామ క్రమం, వలసల నుంచి ఎలా మార్పులు చెందాయో వెల్లడించిన తీరు ఆసక్తిని రేకెత్తించింది.
మనుషుల మనుగడ పోరాటంలో వలసల పాత్రను పూరి వివరించారు. అతడి వివరణ ప్రకారం.. ఎక్కడెక్కడి నుంచో భారతదేశానికి వలస వచ్చిన వారే, ఇక్కడ సంతతిని అభివృద్ధి చేసారు. ఇక్కడ పిల్లల్ని కని పెంచగా, చివరకు మనమంతా మిగిలాము అనేది అతడి పాడ్ కాస్ట్ సారాంశం.
జెనిటిక్ స్టడీస్, ఆర్కియాలజీ రిపోర్ట్స్, ఫాజిల్ ఎవిడెన్స్ ప్రకారం 65వేల సంవత్సరాల కిందట ఒక ఆఫ్రికన్ గ్రూప్ బయలుదేరి ఎర్ర సముద్రం, పర్షియా, అఫ్గానిస్థాన్ దాటి మెల్లగా భారత్ చేరుకుంది. వారిని ఏన్షియంట్ హంటర్ గ్యాదరర్స్ అంటారు. వీరంతా ఉత్తర భారతదేశానికి చేరుకుని, అటుపై దక్షిణాదికి కూడా వచ్చారు. 10000BC లో పశ్చిమాసియా దేశాలు ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్, సిరియా నుంచి మరో గ్రూప్ భారత్ కు చేరుకుంది. వీళ్లంతా మిడిల్ ఈస్ట్ ప్రీ ఫార్మర్స్ వ్యవసాయం తెలిసిన వీరు మనుగడను అధునాతనంగా మొదలు పెట్టారు. 3000బీసీలో యురేషియా నుంచి స్టెప్ హెర్డర్స్ వచ్చారు. ప్రస్తుత ఉక్రెయిన్, కజికస్థాన్, ఇరాన్‌కు చెందినవారు. వీళ్లు కేవలం మగాళ్లు మాత్రమే వచ్చారు.
నార్త్ ఇండియాలో ఉన్న హంటర్ గ్యాదరర్స్‌కీ ప్రీ ఫార్మర్స్‌కి పుట్టిన వాళ్లు అప్పటికే సింధులోయలో స్థిరపడ్డారు. ఈ స్టెప్ హెర్డర్స్ వచ్చి ఇండస్ వ్యాలీలో ఉన్న వాళ్లతో కలిశారు. ఆ రకంగా పుట్టిన వాళ్లే ఆర్యులని జన్యుసంబంధ సాక్ష్యాలు చెబుతున్నాయి. ఉత్తర భారతం వాళ్లు కొంచెం తెల్లగా, దక్షిణాది వాళ్లు నల్లగా ఉండటానికి కారణం.. సౌతిండియా డీఎన్‌ఏలో హంటర్ గ్యాదరర్స్ శాతం ఎక్కువ. వీరినే ద్రవిడియన్స్ అని పిలుస్తారు. దక్షిణాది ప్రజలు అలా పుట్టారు. సంస్కృతం కన్నా తమిళ భాష పురాతనమైనది. ఇక ఇండో ఆర్యన్ గ్రూప్ నుంచే హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, భోజ్‌పురి, ఒడియా, సింధీ భాషలు పుట్టాయి. హంటర్ గ్యాదరర్స్ నుంచి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం పుట్టాయి... అంటూ చరిత్ర పాఠాలను అద్బుతంగా చెప్పారు పూరి. అతడు చెప్పిన పాఠం నుంచి మన పుట్టుకకు మూలాలు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
