నాగుపాముగా మారే యువకుడి కథతో
ఫిలిం ఇనిస్టిట్యూట్ లో నటశిక్షణ పొందిన తర్వాత చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్ మద్రాసులో చాలా ప్రయత్నాలు చేసారు. ఆ సమయంలోనే ఆయనకు కెరీర్ తొలి దశలో మంచి విజయం సాధించిన చిత్రం - పున్నమి నాగు.
By: Tupaki Desk | 14 Jun 2025 9:34 AM ISTఫిలిం ఇనిస్టిట్యూట్ లో నటశిక్షణ పొందిన తర్వాత చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్ మద్రాసులో చాలా ప్రయత్నాలు చేసారు. ఆ సమయంలోనే ఆయనకు కెరీర్ తొలి దశలో మంచి విజయం సాధించిన చిత్రం - పున్నమి నాగు. నటుడిగా చిరుకి గొప్ప గుర్తింపు తెచ్చిన చిత్రమిది. ఎం. రాజశేఖర్ దర్శకత్వంలో 1980లో విడుదలైంది. ఇందులో చిరంజీవి, నరసింహ రాజు, రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం. కుమరన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియం కలిసి ఎవియం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఈ సినిమా కథాంశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నాగులు అనే పాములను ఆడించుకునే వ్యక్తి కథ. అతడు పూర్ణిమ అనే యువతిని ప్రేమిస్తాడు. మేనక పెంపుడు అన్న రాజు నాగులు చెల్లెలు వరసైన లక్ష్మిని ప్రేమిస్తాడు. నాగులు తండ్రి చిన్నప్పటి నుంచి అతనికి కొంచెం కొంచెం పాము విషం తినే తిండిలో కలిపి ఇస్తుంటాడు. దీనివల్ల అతనికి పాము కరిచినా ఏమీ కాకుండా ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ అతడు ఒక కన్యను వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. అతడిని కలిసిన అమ్మాయిలంతా అతడిలో ఉన్న విషానికి బలవుతూ ఉంటారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒకసారి పూర్ణిమ కూడా అలాగే మరణిస్తుంది. చనిపోయిన పూర్ణిమ ఒంటి మీద ఎక్కడా పాము కాటు గుర్తులు లేకపోవడంతో రాజుకు నాగులు మీద అనుమానం మొదలవుతుంది. ఒక యువతి ఆ ఊరికి టీచర్ గా వచ్చి నాగులు చేతిలో మరణిస్తుంది. రాజు ఆమె చేతిలో ఉన్న కెమెరాను చూసి నాగులు పాములా మారిపోయినట్లు గమనిస్తాడు. నాగులు తండ్రి చనిపోబోయే ముందు ఆ రహస్యాన్ని నాగులుకి వెల్లడిస్తాడు. నాగులు దానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయి ఉంటుంది. అతని చర్మం పాము కుబుసం లాగా కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంటుంది. ఊరి వాళ్ళు రాకముందే అక్కడి నుంచి పారిపొమ్మని అతనికి రాజు సలహా ఇస్తాడు. కానీ నాగులు తనకు పాములాగా బతకడం కన్నా మరణమే శరణ్యమని కొండమీద నుంచి దూకి మరణిస్తాడు.
అద్భుతమైన కథాంశంతో పాటు చక్రవర్తి ట్యూన్స్ , వేటూరి సాహిత్యం, నటీనటుల అద్భుత ప్రదర్శనతో పున్నమినాగు రక్తి కట్టిస్తుంది. నాగులు పాత్రలో చిరంజీవి అభినయం, ఆహార్యం ఎంతగానో ఆకట్టుకున్నాయి. పతాక సన్నివేశాల్లో చిరంజీవి డైలాగులు కంటతడి పెట్టిస్తాయి. 13 జూన్ 1980లో ఈ చిత్రం విడుదలైంది. అప్పటికే విడుదలై విజయం సాధించిన కన్నడ చిత్రం 'హున్నుమియే రాత్రియాలి' అనే చిత్రానికి అధికారిక రీమేక్ పున్నమినాగు. నాగుపాముగా మారే యువకుడి కథతో నాలుగు దశాబ్ధాల క్రితమే ఫిక్షన్ సినిమా తీసిన దర్శకుడు రాజశేఖర్ ప్రతిభను మెచ్చుకుని తీరాలి. నేటి ట్రెండ్ లో చూస్తే ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే.
