దేశంలో ఇప్పటివరకూ అత్యంత వివాదాస్పద చిత్రం?
ఇందిరా గాంధీ కథతో ప్యారలల్ గా పంజాబ్ అస్తిత్వాన్ని ప్రజలకు తెలియజేసే వివాదాస్పద కంటెంట్ తో ఇది రూపొందింది.
By: Tupaki Desk | 29 Jun 2025 8:00 AM ISTఇప్పటివరకూ భారతదేశంలో చాలా బయోపిక్ చిత్రాలు వివాదాస్పద అంశాల కారణంగా చర్చకు వచ్చాయి. రిలీజ్ విషయంలోను వాయిదాలు పడ్డాయి. దశాబ్ధాల క్రితం అత్యంత వివాదాస్పద కంటెంట్ తో తెరకెక్కిన బండిట్ క్వీన్ సినిమా ఇప్పటికీ వెలుగు చూడలేకపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని మరో బయోపిక్ ఎదుర్కోబోతోందా? అన్న చర్చ సాగుతోంది. ఈ రోజు వరకూ దేశంలో అత్యంత వివాదాస్పద చిత్రం ఏదైనా ఉంది అంటే అది ఇదే కాబోతోందన్నది తాజా చర్చ.
ఈ సినిమా మరేదో కాదు.. దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో రూపొందించిన పంజాబ్ 95. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రిలీజ్ విషయంలో సందేహాలు మొదలయ్యాయి. ఇది మొదట ఫిబ్రవరి 2025 లో విడుదల కావాల్సి ఉండగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కారణంగా పదే పదే వాయిదా పడింది. సెన్సార్ ఏకంగా 127 కట్స్ విధించిందని దిల్జీత్ చెప్పాడు. కథానాయకుడి పేరును మార్చడం, భారత జెండా విజువల్స్‌ను తొలగించడం, మతపరమైన శ్లోకాలను మ్యూట్ చేయడం, చివరికి సినిమా టైటిల్‌ను కూడా మార్చమని సెన్సార్ బృందం చెప్పింది. అయితే ఇవేవీ చేయడం కుదరదని, దానివల్ల సినిమా ఆత్మ పూర్తిగా దెబ్బ తింటుందని అతడు వాదించాడు.
పంజాబ్ 95ని టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల నుంచి తొలగించాలని ప్రభుత్వం కోరడం కూడా సంచలనమే అయింది. ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సృజనాత్మకతను అణచి వేసే ప్రయత్నమిదని నిరసనలు వెల్లువెత్తాయి. భారతదేశంలో సెన్సార్ చట్టాలు చాలాసార్లు నిజాలను చూపించనివ్వకుండా చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలా బయోపిక్ సినిమాల్లో నిజాలు లేకపోవడం వల్ల డిజాస్టర్ అయినవి ఉన్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలే పెద్ద ఉదాహరణ.
పంజాబ్ చీకటి చరిత్రను, దురాగతాలను ఎదుర్కొన్న ప్రజల కన్నీటి కథను దిల్జీత్ తెరపైకి తెస్తున్నాడు. నిజ ఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం `ఆపరేషన్ బ్లూస్టార్` ఆధారంగా రూపొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య నుండి పంజాబ్ ముఖ్యమంత్రి హత్య వరకూ ప్రతిదీ తెరపై చూపించనున్నారు.. 1984 అల్లర్లు, నాటి రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన లెక్కలేనంత మంది అమాయకుల కథలకు తెర రూపమిచ్చారు. హనీ ట్రెహాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇందిరా గాంధీ కథతో ప్యారలల్ గా పంజాబ్ అస్తిత్వాన్ని ప్రజలకు తెలియజేసే వివాదాస్పద కంటెంట్ తో ఇది రూపొందింది. పంజాబ్ పోలీసులు 25 వేల చట్టవిరుద్ధ హత్యలు, అమాయకుల అదృశ్యాలు, రహస్య దహన సంస్కారాలపై పరిశోధించిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా (దిల్జిత్ పోషించిన) జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జస్వంత్ సింగ్ తన పరిశోధనలో ఎన్నో కఠోరమైన నిజాల్ని నిగ్గు తేల్చారు. ఆ తర్వాత హత్యకు గురయ్యాడు. అతడి నిజ కథతో తీసిన పంజాబ్ 95 సినిమా 2023లో పూర్తయింది. కానీ సెన్సార్ కఠిన నిబంధనల కారణంగా రిలీజ్ కాకుండా నిలిచిపోయింది.
భారతదేశంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా పోస్టర్ లో దిల్జిత్ దోసాంజ్ సాధారణ కుర్తా, తలపాగా ధరించి గాయాలతో నేలపై కూర్చుని కనిపించాడు. పోస్టర్ కి అద్భుత స్పందన వచ్చింది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలో నటించాడు.
