Begin typing your search above and press return to search.

బడ్జెట్ ల కన్ఫ్యూజన్.. నితిన్ తండ్రి ఏమన్నారంటే

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బడ్జెట్ పరిమితి లేకుండా సినిమాలకి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు

By:  Tupaki Desk   |   3 Dec 2023 4:59 AM GMT
బడ్జెట్ ల కన్ఫ్యూజన్.. నితిన్ తండ్రి ఏమన్నారంటే
X

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బడ్జెట్ పరిమితి లేకుండా సినిమాలకి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. స్టార్ హీరోల సినిమాలు అయితే వంద కోట్లు బడ్జెట్ చాలా సులభంగా దాటేస్తోంది. ఇక టైర్2 హీరోల సినిమలకి కూడా 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. బడ్జెట్ లు ఈ స్థాయికి పెరగడానికి హీరోల రెమ్యునరేషన్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.

స్టార్ హీరోలు అయితే 80 నుంచి 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. సెకండ్ పొజిషన్ లో ఉన్న హీరోలు కూడా 30 నుంచి 40 కోట్ల వరకు అడుగుతున్నారు. తమకున్న మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని హీరోలు రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు వచ్చిన తర్వాత ఓటీటీ హక్కుల రూపంలో భారీగా ఇస్తున్నారు.

స్టార్ హీరోల సినిమాలకి డిజిటల్ రైట్స్ కోసం 100 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నారు. అలాగే టైర్ 2 హీరోలకి కూడా భారీగానే రైట్స్ రూపంలో వస్తున్నాయి. ఈ కారణంగా హీరోలు తమ రెమ్యునరేషన్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే పరిస్థితి గత కొంతకాలంలో మారిపోయింది. ఓటీటీ సంస్థలు ఏడాది 12 సినిమాలు మాత్రమే ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.

మిగిలిన సినిమాలకి మాత్రం ఆశించిన స్థాయిలో ఓటీటీ సంస్థల నుంచి రెస్పాన్స్ రావడం లేదు. ఇదే విషయంలో తాజాగా నితిన్ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడారు. నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ సినిమాపైన ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిజిటల్ కంపెనీలు కేవలం స్టార్ హీరోల చిత్రాలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.

మీడియా రేంజ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మొన్నటి వరకు ఎక్స్ట్రార్డినరీ సినిమాని 30 కోట్లకి అడిగారు. ఇప్పుడు 25 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు. రేపు 20 కోట్లకి దిగిపోవచ్చు. మనమే కావాలని హైప్ చేసుకుంటూ, బడ్జెట్ లు పెంచుకుంటూ పోతామంటే నష్టపోవడం తప్ప ఏమీ ఉండదు. కాంబినేషన్ చూసుకుంటూ బడ్జెట్ పెంచుకుంటూ పోతూ కంటెంట్ ని నిర్మాతలు పట్టించుకోవడం లేదనే మాట సినీ విశ్లేషకుల వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కాస్తా కంట్రోల్ లో ఉండాలని సుధాకర్ రెడ్డి కామెంట్స్ చేశారు.