Begin typing your search above and press return to search.

సినిమా నిర్మాణమంటే ఇన్ని తంటాలుంటాయ్!

తెలుగు సినిమా కొత్త శిఖరాలకు చేరుకుంది. భారతీయ సినిమాలో అనేక అడ్డంకులను అధిగమించింది.

By:  Tupaki Desk   |   15 May 2024 12:30 PM GMT
సినిమా నిర్మాణమంటే ఇన్ని తంటాలుంటాయ్!
X

తెలుగు సినిమా కొత్త శిఖరాలకు చేరుకుంది. భారతీయ సినిమాలో అనేక అడ్డంకులను అధిగమించింది. మునుప‌టి కంటే నాన్-థియేట్రికల్ రైట్స్ భారీగా పెరిగాయి. థియేట్రికల్ డీల్స్ కూడా అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పారితోషికంగా భారీగా పెంచారు. సినిమా విజ‌యంతో సంబంధం లేకుండా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. లేదంటే పాన్ ఇండియా రిలీజ్ కాబ‌ట్టి స‌క్సెస్ అయితే వాటా అడుగుతున్నారు. వాటా కంటేముందే పారితోషికం చెల్లించిన వారు కొంద‌రైతే! సినిమా లోభాగం చేస్తోన్న నిర్మాణ సంస్థ‌లు మ‌రికొన్ని.

ఇదంతా ఒక‌వైపు మ‌రోవైపు చూస్తే.. తెలుగు సినిమాల హిందీ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తగ్గాయి అన్న‌ది అంతే వాస్త‌వం. ఇంత‌కు ముందులా డిజిట‌ల్ బిజినెస్ జ‌ర‌గ‌డం లేదు. కంటెంట్ ని బ‌ట్టి యాజ‌మాన్యాలు క్ర‌య‌, విక్ర‌యాలు జ‌రుపుతున్నాయి. పేమెంట్ మెథ‌డ్ లోనూ ఎన్నో ర‌కాల మార్పులొచ్చాయి. మొత్తం ఒకేసారి చెల్లించ కుండా ధ‌ప‌ధ‌పాలుగా చెల్లిస్తున్నారు. త‌మ ఓటీటీల్లో...శాటిలైట్ లో రిలీజ్ అయిన త‌ర్వాత అక్క‌డ‌వ‌చ్చిన రెస్పాన్స్ బ‌ట్టి చెల్లిస్తున్న‌ట్లు వినిపిస్తుంది. నిర్మాతలకు ఈ విధానం ప్ర‌మాదంగా మారింది.

దీంతో పెట్టుబడులను రికవరీ చేయడానికి థియేట్రికల్ వసూళ్లపై ఆధారపడవలసి ఉంటుంది. ఇంత‌కు ముందు ప్రీరిలీజ్ బిజినెస్ తో గుండెల మీద చేతులేసుకుని ప‌డుకునేవారు. ఇప్పుడా సీన్ లేదు. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత భారీ నష్టాన్ని చూడాల్సి వ‌స్తోంది. ఈ బిజినెస్ గేమ్ లో ఇంత‌కుముందులా డిస్ట్రిబ్యూట‌ర్లు సినిమా కొన‌డం లేదు. బ‌య్య‌ర్ల నుంచి వ‌స్తోన్న డిమాండ్ల‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత‌ల‌కు కొన్ని కండీష‌న్లు పెట్టి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇదంతా ఎప్ప‌టి నుంచో అమ‌లులో ఉన్న ఇప్పుడు మ‌రింత క‌ఠిన‌గా అమ‌లు చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో నిర్మాత‌లిప్పుడు స్టార్ హీరోల పారితోషికం విష‌యంలో త‌గ్గించ‌మ‌ని అడిగేలా చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్రారంభ మ‌య్యాయి. త‌గ్గించాలి అనుకున్న వారు త‌గ్గిస్తున్నారు. కొంద‌రు హీరోలు పారితోషికం బ‌ధులుగా బడ్జెట్‌లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ద‌ర్శ‌కుడు ప‌ని రోజులు సేవ్ చేయ‌గ‌లిగితే చాలా వ‌ర‌కూ నిర్మాత‌కు క‌లిసొస్తుంది. నిర్మాణ రంగంలో బాగా అనుభ‌వం ఉన్న వారు ఇవ‌న్నీ ముందే ఆలోచించుకుని రంగంలోకి దిగుతున్నారు. న‌ష్ట లాభాల్ని బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని సినిమాలు ప్రారంభం అయ్యాక కూడా ఆగిపోతున్నాయి. మొద‌లు పెట్టిన త‌ర్వాత ముందుకు వెళ్ల‌డం కంటే ముందే అగిపోవ‌డం ఉత్త‌మం అని కొంద‌ర‌నుకుంటే...మొద‌లైన త‌ర్వాత మ‌ధ్య‌లో డ్రాప్అయ్యే వారు మ‌రికొంత మంది. మొత్తంగా ఈ రెండు..మూడేళ్ల కాలంలో నిర్మాణ ప‌రంగా చాలా మార్పులు చోటు చోసుకున్నాయని చెప్పొచ్చు.