Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌-ప‌ఠాన్ స్ఫూర్తితో బిగ్ ప్లాన్

క‌ర‌ణ్ జోహార్ బ్రాండ్ సినిమా ఎలా ఉంటుందో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రొమాంటిక్ డ్రామాలు, కుటుంబ క‌థ‌ల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా అత‌డు ప్ర‌సిద్ధి

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:30 PM GMT
కేజీఎఫ్‌-ప‌ఠాన్ స్ఫూర్తితో బిగ్ ప్లాన్
X

క‌ర‌ణ్ జోహార్ బ్రాండ్ సినిమా ఎలా ఉంటుందో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రొమాంటిక్ డ్రామాలు, కుటుంబ క‌థ‌ల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా అత‌డు ప్ర‌సిద్ధి. ఫ్యామిలీ ఎమోష‌న్స్ కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చే ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. నిర్మాత‌గా అన్ని జాన‌ర్ల‌ను ట‌చ్ చేసినా కానీ, ద‌ర్శ‌కుడిగా మాత్రం ప్ర‌యోగాల జోలికి పోలేదు. కానీ ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్ కూడా మారిపోయాడు. అత‌డు ఈసారి త‌న శైలికి భిన్నంగా వెళ్ల‌బోతున్నాడు. భారీ యాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్టు కొట్టాల‌ని క‌ల‌లుగంటున్నాడు. కాలానికి మారిన ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు అత‌డు కూడా మారుతున్నాడు. ఇటీవల‌ బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టిన కేజీఎఫ్‌- ప‌ఠాన్- జ‌వాన్ అత‌డిలో స్ఫూర్తి నింపాయ‌ని కూడా భావిస్తున్నారు.

కరణ్ జోహార్ ఇప్పుడు తన తదుపరి దర్శకత్వ ప్రాజెక్ట్‌తో యాక్షన్ జానర్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. తాజా చాటింగ్ సెష‌న్‌లో యాక్షన్ చిత్రం చేస్తున్నారా? అని ప్రశ్నించబడినప్పుడు, అతడు ఉత్సాహంగా స్పందిస్తూ... లోతైన భావోద్వేగాల నుంచి యాక్ష‌న్ అనేది ఉద్భవించవలసి ఉంటుందని నొక్కి చెప్పాడు. అతనికి యాక్షన్ అనేది కథకు సంబంధించిన స‌బ్ టాస్క్‌. భావోద్వేగంలో డెప్త్ లేకుండా కేవలం పోరాట సన్నివేశాలను ప్రదర్శించడం వల్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు. భావోద్వేగాలకు దారితీసే కథనాన్ని రాయ‌గ‌లిగిన‌ప్పుడు సహజంగానే చర్య ప్ర‌తిచ‌ర్య పుట్టుకు వ‌స్తాయి. అదంతా అత్యున్నత స్థాయి ప్రతిభను వెలికి తీయ‌డ‌మేన‌ని కరణ్ అభిప్రాయపడ్డాడు.

ఈ సంభాషణ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఫ్రాంచైజీల ప్రబలమైన సంస్కృతిపైనా చ‌ర్చ‌కు దారి తీసింది. కరణ్ అదనపు ఫ్రాంచైజీల సృష్టి గురించి కూడా సూచించాడు. ఈ సమయంలో దానిని వెల్లడించకూడదని అతడు భావించాడు. అత‌డి ఆలోచ‌న‌లు అర్ధవంతమైన కథనానికి ప్రాధాన్యత ఇవ్వడం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతి చిత్రానికి సీక్వెల్ అవసరం లేదని కూడా ఆయ‌న అంగీక‌రించారు. క‌థ‌ని ఆర్టిఫిషియ‌ల్ గా క‌మ‌ర్షియ‌ల్ లాభానికి పొడిగించ‌కుండా, దాని స‌హ‌జ ముగింపు స్థానానికి చేరుకున్న‌ప్పుడు దాన్ని ముగించాల‌ని అతను దృఢంగా విశ్వసిస్తున్నాడు.

అయితే కరణ్ జోహార్ యాక్షన్ జానర్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాడు. అతడి పాపుల‌ర్ 'దుల్హనియా' సిరీస్‌ను మెరుగుపరిచి కొనసాగించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు హింట్ ఇచ్చాడు. వరుణ్ ధావన్ - అలియా భట్ నటించిన 'దుల్హనియా' ఫ్రాంచైజీ మూడవ భాగం తెర‌కెక్కిస్తారా? అని ప్ర‌శ్నించ‌గా.. కరణ్ పూర్తిగా అయిష్ట‌త‌ను క‌న‌బ‌ర‌చ‌లేదు. ఫ్రాంచైజీలు బిజినెస్ కోసం కాదు.. ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకునే కథనాల ఆధారంగా ఉండాలని నొక్కి చెబుతూనే దుల్హ‌నియా సీక్వెల్ కి ఛాన్సుంద‌ని హింట్ ఇచ్చాడు. కరణ్ కేవలం ఫ్రాంచైజీ విస్తరణలపై దృష్టి సారించడం కంటే ఆకర్షణీయమైన కథనాలను అందించడానికి కట్టుబడి ఉన్నాడు. దుల్హ‌నియా మూడో భాగానికి స‌రిప‌డే కథాంశం కుదిరితే ఆయ‌న సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. నేటిత‌రం ర‌చ‌యిత‌లు దీనిని వ‌ర్క‌వుట్ చేస్తారేమో చూడాలి.