సైనికుల సంక్షేమం కోసం అల్లు అరవింద్ స్ఫూర్తి!
అల్లు అరవింద్ ప్రకటన అందరిలో స్ఫూర్తి నింపుతోంది. మరింత మంది టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వచ్చి భారత సైన్యం సాయానికి ప్రేరణనిచ్చే ప్రకటన ఇది.
By: Tupaki Desk | 9 May 2025 6:23 PM ISTఇండియా - పాక్ వార్ దృశ్యాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. పాక్ ఉగ్ర మూకలపై భారతదేశం ఆధిపత్యం సాధించింది. దీనికి ప్రజలు, సెలబ్రిటీల నుంచి మద్ధతు లభిస్తోంది. క్రూరమైన ఉగ్రవాదులను మట్టుపెడుతున్న భారతీయ సైన్యం పనితనానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆపత్కాలంలో మేమున్నాం అంటూ స్పందించే టాలీవుడ్ లో తొలిగా భారత సైన్యానికి విరాళాల రూపంలో తమవంతు సాయం చేసేందుకు అగ్రనిర్మాత అల్లు అరవింద్ ముందుకు వచ్చారు. ఈరోజు విడుదలైన సింగిల్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ నుంచి కొంత భాగాన్ని సైనికులకు విరాళంగా ఇస్తున్నామని ప్రకటించారు. దేశం కోసం ప్రజల్ని కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయక సైనికులు పోరాడుతున్నారు. వారి సంక్షేమం కోసం సహాయం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత. మా వంతు విరాళంగా సింగిల్ మూవీ మొదటి రోజు వసూళ్ల నుంచి కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమం కోసం అందిస్తున్నాం.. అని అరవింద్ ప్రకటించారు.
అల్లు అరవింద్ ప్రకటన అందరిలో స్ఫూర్తి నింపుతోంది. మరింత మంది టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వచ్చి భారత సైన్యం సాయానికి ప్రేరణనిచ్చే ప్రకటన ఇది. ప్రకృతి వైపరీత్యాలు, వరదల సమయంలో ప్రతిసారీ టాలీవుడ్ సాయానికి ముందుకు వస్తోంది. వరదల్లో మునిగిన నగరాల పునర్నిర్మాణం కోసం తెలుగు స్టార్లు ఆర్థిక విరాళాల్ని ప్రకటించారు. ఇప్పుడు ఆర్మీ బలోపేతానికి విరాళాలు అవసరం. తెలుగు ప్రజలు కూడా పాక్ పై పోరాడుతున్న భారతీయ సైనికుల కోసం సాయానికి తమవంతుగా ముందుకు వస్తున్నారు. ప్రజలు, సెలబ్రిటీల నుంచి మద్ధతు సైనికులకు మరింత బలాన్నిస్తుందనడంలో సందేహం లేదు.
