Begin typing your search above and press return to search.

నిర్మాత‌గా కోట్లు పోస్తోంది.. ఒక్క‌టీ క‌మ‌ర్షియ‌ల్ కాదు!

హాలీవుడ్ కి వెళ్లాక పీసీ నిర్మాత‌గా కొత్త అవ‌తారం ఎత్తింది. ఇటీవ‌ల కంటెంట్ ఉన్న చిత్రాల‌తో నిర్మాత‌గా ఎదిగేస్తోంది

By:  Tupaki Desk   |   4 April 2024 2:45 AM GMT
నిర్మాత‌గా కోట్లు పోస్తోంది.. ఒక్క‌టీ క‌మ‌ర్షియ‌ల్ కాదు!
X

తనదైన‌ అందం నటన‌తో ప్ర‌పంచాన్ని మెప్పించిన మేటి న‌టి ప్రియాంక చోప్రా. ద‌శాబ్ధం పైగానే బాలీవుడ్‌లో ఆధిపత్యం చెలాయించడమే కాకుండా హాలీవుడ్‌లోను తన అద్భుతమైన నటనతో త‌న‌దైన‌ ముద్ర వేసింది. న‌ట‌న‌తో పాటు సామాజిక కార్య‌క్ర‌మాల‌తోను పీసీ ఖ్యాతి విశ్వ‌విఖ్యాతం అయింది. యునిసెఫ్ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్ గాను పీసీ సేవ‌లందిస్తోంది.

హాలీవుడ్ కి వెళ్లాక పీసీ నిర్మాత‌గా కొత్త అవ‌తారం ఎత్తింది. ఇటీవ‌ల కంటెంట్ ఉన్న చిత్రాల‌తో నిర్మాత‌గా ఎదిగేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌యోగాత్మ‌క డాక్యు సిరీస్ లు, సినిమాల‌కు ఆర్థిక మ‌ద్ధ‌తును ప్ర‌క‌టించింది. అకాడమీ అవార్డ్-నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ 'టు కిల్ ఎ టైగర్' నుండి 'విమెన్ ఆఫ్ మై బిలియన్' వరకు ప్రియాంక ఇటీవల నిర్మాత‌గా పెట్టుబ‌డులు పెడుతోంది. కంటెంట్ ని దృష్టిలో పెట్టుకుని వాటికి బ‌డ్జెట్ల‌ను స‌మ‌కూర్చ‌డం త‌న అభిరుచికి నిద‌ర్శ‌నం. ఇప్పుడు బారీ అవ్రిచ్ 'బోర్న్ హంగ్రీ' ఈ లిస్ట్‌లో చేరింది. ప్రియాంక చోప్రా 'బోర్న్ హంగ్రీ' అనే చిత్రానికి నిర్మాతగా సంతకం చేసింది. త‌న‌ నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ బ్యానర్ బారీ అవ్రిచ్ కొత్త ఫీచర్ డాక్యుమెంటరీ 'బోర్న్ హంగ్రీ'కి మ‌ద్ధ‌తుగా నిల‌వ‌నుంది. ఈ అప్‌డేట్‌ని తన అభిమానులు అనుచరులతో ఇన్ స్టా వేదిక‌గా పీసీ షేర్ చేసారు.

ప్రేక్షకులను ఒక ప్రత్యేకమైన దృక్కోణంతో కదిలించే సామర్థ్యం ఉన్న కథలు ఎంచుకునే దర్శ‌క‌నిర్మాతలతో క‌లిసి ప‌నిచేయడం కోసం పేబుల్ పిక్చ‌ర్స్ వేచి చూస్తుంటుంది. బారీ రిచ్ కొత్త ఫీచర్ డాక్యుమెంటరీ- బోర్న్ హంగ్రీ సరిగ్గా అలాంటిదే.. అని తాజా నోట్ లో రాసింది పీసీ. ఇది అద్భుత‌మైన క‌థ‌. క‌దిలించే విష‌యాలు ఉన్నాయ‌ని వెల్ల‌డిచింది.

బోర్న్ హంగ్రీ అనేది కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే భారతీయ యువకుడు సాష్‌కి సంబంధించిన నిజ జీవిత కథ. అతడు తన కుటుంబాన్ని విడిచిపెట్టి.. రైళ్లలో ప్ర‌యాణిస్తూ.. అదృష్టాన్ని ఆశ్రయిస్తూ.. ఇంటి నుండి చాలా దూరం ప్రయాణిస్తాడు. చెన్నై వీధుల్లో ఒంటరిగా జీవించిన రోజులు.. అటుపై దత్తపుత్రుడిగా.. ఆ తర్వాత కెనడాలో పాపుల‌ర్ చెఫ్‌గా మారిన సాష్ సింప్సన్.. కోల్పోయిన తన కుటుంబంతో తిరిగి కలవాలని నిశ్చయించుకుంటాడు. గతంలోని అసాధార‌ణ అనుభ‌వాలు, జ్ఞాపకాలతో భారతదేశానికి తిరిగి వ‌చ్చాక సాష్ సింప్స‌న్ జీవితంలో ఏం జ‌రిగింద‌నేది తెర‌పైనే చూడాలి. ఈ చిత్రం 2024 పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిత‌మైంది. ఏప్రిల్ 26న టొరంటోలో జరిగే హాట్ డాక్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు.

ఇత‌ర ప్రాజెక్టుల‌పై పీసీ ఆస‌క్తి:

ఉమెన్ ఆఫ్ మై బిలియన్‌కు తాను ఎందుకు మద్దతు ఇచ్చిందో ప్రియాంక చోప్రా ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. పీసీ సొంత‌ నిర్మాణ బ్యానర్ 'పర్పుల్ పెబుల్ పిక్చర్స్' ఇటీవల విమెన్ ఆఫ్ మై బిలియన్స్ అనే డాక్యుమెంటరీని నిర్మించడానికి అవేడాసియస్ ఒరిజినల్స్‌తో కలిసి పనిచేసింది. అజితేష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

నేను ఈ సినిమా చూసినప్పుడు WOMB (Women Of My Billions) ఇది చాలా మందికి చెందినది. మహిళలపై హింస ఎలా జ‌రుగుతోందో తెలుసుకోవడం భారతదేశంలో సాధ్య‌మ‌య్యే విషయం కాదు. ఇది ప్రపంచ దృగ్విషయం. ఈ డాక్యుమెంటరీలో ర‌క‌ర‌కాల హింసల బారిన పడిన మహిళలకు పునరావాసం కల్పించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రగ్యా ప్రసూన్ గురించిన క‌థ‌ను చూపిస్తున్నామ‌ని ప్రియాంక పేర్కొన్నారు. ముఖ్యమైన కథలు చెప్పడంపై మక్కువ చూపే ఫిలింమేక‌ర్స్ కు వేదికను అందించడంలో పర్పుల్ పెబుల్ పిక్చర్స్ నిబద్ధతను క‌లిగి ఉంద‌ని పీసీ తెలిపారు. నిర్మాత‌గా ప్రియాంక చోప్రా ప్ర‌య‌త్నాలు చూస్తే చాలా విస్మ‌యం క‌లుగుతోంది. నిర్మాత‌గా కోట్లు కుమ్మ‌రిస్తోంది.. అంతా స‌మాజం కోసం మాత్ర‌మే. ఇందులో ఒక్క‌టి కూడా క‌మ‌ర్షియ‌ల్ గా సంపాదించుకునే ఆలోచ‌న క‌నిపించ‌లేద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రియాంక 'హెడ్స్ ఆఫ్ స్టేట్'లో జాన్ సెనా- ఇద్రిస్ ఎల్బాలతో కలిసి కనిపించనుంది. కత్రినా కైఫ్ - అలియా భట్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న‌ 'జీ లే జరా'లో కనిపించనుంది. అయితే రెండేళ్ల క్రితం ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.