ఇది తేడా కొడితే చోప్రా నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
సిటాడెల్ సిరీస్ డిజాస్టర్ అయిన తర్వాత ప్రియాంక చోప్రా చూపులు పూర్తిగా భారతీయ సినిమా వైపు ప్రసరించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Jun 2025 2:00 PM ISTసిటాడెల్ సిరీస్ డిజాస్టర్ అయిన తర్వాత ప్రియాంక చోప్రా చూపులు పూర్తిగా భారతీయ సినిమా వైపు ప్రసరించిన సంగతి తెలిసిందే. క్వాంటికోతో హాలీవుడ్ లో అడుగు పెట్టి ఘనంగా భారీ ప్రాజెక్టులతో బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా ఉన్నట్టుండి భారతీయ సినిమా వైపు చూడటం, నేరుగా పాన్ ఇండియాలో దూసుకెళుతున్న టాలీవుడ్ లో అడుగుపెడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
పీసీ ప్రస్తుతం రాజమౌళి- మహేష్ కాంబినేషన్ లోని భారీ పాన్ ఇండియన్ సినిమా ఎస్.ఎస్.ఎం.బి 29లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సమయంలోనే హాలీవుడ్ లో నటించిన పెండింగ్ సినిమా `హెడ్స్ ఆఫ్ స్టేట్` విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో ఇడ్రిస్ ఎల్బా ,జాన్ సెనా వంటి అద్భుతమైన తారాగణం నటించినా అందరి దృష్టి ప్రియాంక చోప్రా వైపే ఉంది. ఈ భామ సినిమా ప్రచార కార్యక్రమాలలోను ప్రధాన ఆకర్షణగా మారింది.
అయితే భారతదేశంలో ఈ సినిమాకి ఆశించిన ప్రచారం లేకపోవడంతో, అంతగా హైప్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. అలాగే ప్రమోషనల్ మెటీరియల్ కి కూడా ఇక్కడ ఆశించిన గుర్తింపు దక్కలేదు. దీంతో జూలైలో రిలీజ్ ముంగిట ఈ సినిమా ఎలాంటి అంచనాలు హైప్ లేకుండానే వస్తోంది. నిజానికి సిటాడెల్ డిజాస్టరయ్యాక, అన్ని హోప్స్ ఈ సినిమాపైనే పెట్టుకుంది పీసీ. కానీ ఇది ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా లేదా? అన్న సందేహాలు ఇప్పుడు అలుముకున్నాయి.
ఒకవేళ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఫలితం తారుమారు అయితే ప్రియాంక చోప్రా తదుపరి ప్రణాళికలు ఎలా ఉంటాయి? అంటే కచ్ఛితంగా పీసీ మరో తెలుగు సినిమా లేదా తమిళ సినిమాలో నటించేందుకు ఆస్కారం ఉంది. సౌత్ లోని పాన్ ఇండియన్ డైరెక్టర్లకు ప్రియాంక చోప్రా టచ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. దీనికి కారణం ఇటీవల బాలీవుడ్ సినిమాలో నటించేందుకు ఆసక్తిని కనబరచకపోవడమే. హిందీ చిత్రసీమలో కొందరు తనపై కుట్ర చేసారని ఆరోపించిన ప్రియాంక చోప్రా, తన ఎగ్జిస్టెన్సీ కోసం సౌత్ సినిమాని ఆశ్రయించడమే ఉత్తమ మార్గమని భావిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. హాలీవుడ్ వర్కవుట్ కాకపోయినా, టాలీవుడ్ లో పనవుతుంది. ఇక్కడ పారితోషికం పరంగా కొంత పట్టు విడుపు ఉంటే తనను మరిన్ని అవకాశాలు వరించేందుకు అవకాశం ఉంది. సౌత్ లో ఒక ఊపు ఊపితే, బాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు పుంజుకునే ఛాన్సుంటుంది.
