హాలీవుడ్ వద్దు టాలీవుడ్ బెస్ట్.. పీసీ మైండ్ గేమ్
బాలీవుడ్ నుంచి అకస్మాత్తుగా నిష్కృమించింది ప్రియాంక చోప్రా. ఒక అమెరికన్ గాయకుడిని పెళ్లాడి, అటుపై హాలీవుడ్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది.
By: Tupaki Desk | 21 Jun 2025 6:00 AM ISTబాలీవుడ్ నుంచి అకస్మాత్తుగా నిష్కృమించింది ప్రియాంక చోప్రా. ఒక అమెరికన్ గాయకుడిని పెళ్లాడి, అటుపై హాలీవుడ్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. కానీ ఉన్నట్టుండి నేరుగా భారతదేశవ్యాప్తంగా మార్మోగుతున్న ఆస్కార్ విన్నింగ్ టాలీవుడ్ వైపు దృష్టి సారించింది. ఇక్కడ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాకి సంతకం చేసింది. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని అస్సలు కాదనుకోలేదు. దీనికి కారణం... ఏమై ఉంటుంది?
ఇది ఒక్కరోజులో ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయమా? అంటే అవునని చెప్పలేం. ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లినా అక్కడ సంతృప్తికరమైన కెరీర్ ని సాగించలేదని కూడా అర్థం చేసుకోవాలి. పెద్ద స్టార్ల సరసన అవకాశాలు దక్కినా, అవన్నీ రొటీన్ గా సాగాయి. ఇటీవలి సినిమాల్లోను క్వాంటికో, సిటాడెల్ సిరీస్ లలో చూసేసిన పాత్రలనే పీసీ రిపీట్ చేస్తోంది. ఈ సిరీస్ లలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలను పోషించిన ప్రియాంక చోప్రా యాక్షన్ మోడ్ లో కనిపించింది. ఇప్పుడు మరోసారి `హెడ్స్ ఆఫ్ స్టేట్` సినిమాలోను పీసీ ఇదే తరహా పాత్రలో కనిపిస్తోంది.
ఇదంతా చూస్తుంటే పీసీ ఉన్నట్టుండి మార్పు కోరుకుందనే అర్థమవుతోంది. ఇప్పుడు మహేష్ - రాజమౌళి సినిమాతో ఈ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేసుకోవాలని భావిస్తోంది. కొన్నేళ్లుగా భారతదేశంలో సినీపరిశ్రమలన్నీ ఒకే పరిశ్రమగా రూపాంతరం చెందుతున్నాయి. బాలీవుడ్ లో సినిమా తీసినా టాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. టాలీవుడ్ లో సినిమా చేసినా టాలీవుడ్ స్టార్లు కనిపిస్తున్నారు. దీనివల్ల భిన్నత్వంలో ఏకత్వం సాధ్యమవుతోంది. ఇక హిందీ చిత్రసీమకు ధీటైన బడ్జెట్లతో తెలుగు, కన్నడం, తమిళంలో సినిమాలు తీస్తున్నారు గనుక ఇప్పుడు హీరోయిన్లకు ఏదో ఒక పెద్ద పరిశ్రమపై ఆధారపడాల్సిన అవసరం అసలే లేదు. అందువల్ల ప్రియాంక చోప్రా నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. బాలీవుడ్ అగ్ర కథానాయకులతో అవకాశాల కోసం కూడా అసలు వేచి చూస్తున్నట్టే కనిపించడం లేదు. బాలీవుడ్ లో తనకు అవకాశాలు రాకుండా కుట్ర జరిగింది! అని బహిరంగంగా ప్రకటించిన ప్రియాంక చోప్రా, ఇప్పుడు ఈ కొత్త అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలివిగా సౌతిండియన్ సినిమాలలో కీలక భూమిక పోషిస్తుందేమో చూడాలి.
