Begin typing your search above and press return to search.

ఒకే ప్రేమ్ లో గ్లోబల్ బ్యూటీ క్వీన్స్!

అగ్ర నటీనటులు ఒకే వేదికపైకి రావడం అభిమానుల్లో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపుతుంది.

By:  Srikanth Kontham   |   26 May 2026 3:14 PM IST
ఒకే ప్రేమ్ లో గ్లోబల్ బ్యూటీ క్వీన్స్!
X

అగ్ర నటీనటులు ఒకే వేదికపైకి రావడం అభిమానుల్లో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు స్థానిక స్టార్ల కుటుంబాలతో ఆత్మీయంగా గడపడం అనేది సోషల్ మీడియా యుగంలో సరికొత్త చర్చలకు దారితీస్తోంది. ఇలాంటి పరిణామాలు వృత్తిపరంగానే పరిమితం కాకుండా పరిశ్రమల మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని.. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. ఇటీవల‌ హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇందుకు చక్కటి ఉదాహరణ.





అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటి ప్రియాంక చోప్రా, సూపర్ స్టార్ మహేష్ కుటుంబంతో కలిసి సమయాన్ని గడిపడం ఇంట్రెస్టింగ్. నగరంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ సందర్శన సందర్భంగా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేనిలతో కలిసి ప్రియాంక సందడి చేశారు. వీరంతా కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ తో అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ భేటీ వెనుక మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. ప్రియాంక చోప్రా - నమ్రతా శిరోద్కర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టక ముందే అంతర్జాతీయ బ్యూటీ పోటీల వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వారే.





దశాబ్దాల క్రితం మోడలింగ్ రంగంలో రాణించారు. అనంత‌రం సినిమా అనే ప్రపంచంలో తమదైన ముద్ర వేసారు.అయితే న‌టిగా పీసీ అంత‌ర్జాతీయ స్థాయికి చేరుకోగా న‌మ్ర‌త మాత్రం ఇల్లాలుగా మారి మ‌హేష్ ఇంటి బాధ్య‌త‌లు చూసుకున్నారు. చాలా కాలం త‌ర్వాత‌ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు వీరికి గ్లోబల్ బ్యూటీ క్వీన్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇద్ద‌రు క‌లిసిన వేళ ముంబై ముచ్చ‌ట్లు పెట్టుకుని ఉంటారు. కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నాం? ఇప్పుడెలా ఉన్నాం? జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయ‌న్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తోన్న వేళ ఆమాట‌ల‌కు హ‌ద్దే ఉండ‌దు. అయితే ప్రియాంక చోప్రా ఇంతలా హైదరాబాద్‌లో సమయం గడపడానికి గల ప్రధాన కారణం `వార‌ణాసి` అన్న సంగ‌తి తెలిసిందే.





టాలీవుడ్ గర్వించదగ్గ దిగ్దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `వారణాసి` చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రంలో ప్రియాంక మందాకిని అనే విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ షెడ్యూల్ కోసం ఆమె నగరంలోనే ఉంటున్నారు. భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ - టైమ్-ట్రావెల్ అంశాలతో రూపొందుతున్న వారణాసి చిత్రంపై యావత్ భారత సినీ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.`ఆర్ఆర్ఆర్` వంటి అంతర్జాతీయ విజయం తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి ఉంది. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాలు విభిన్న భాషలకు చెందిన మేటి నటులను ఒకచోట చేర్చడమే కాకుండా భారతీయ సినిమా స్థాయిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు దోహదపడుతున్నాయి.