గుండెలు పిండేసిన ప్రియాంక చోప్రా!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కేవలం వెండితెరపైనే కాదు. నిజ జీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంటారు.
By: Srikanth Kontham | 26 March 2026 11:14 AM ISTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కేవలం వెండితెరపైనే కాదు. నిజ జీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సామాన్య మధ్యతరగతి ప్రజల గుండెలను పిండేశాయి. సమాజంలో `విజయం` అనే పదానికి ఉన్న అర్థాన్ని ఆమె పూర్తిగా మార్చేసారు. ప్రతిరోజూ తమ ఇష్టం లేని పనిని కూడా బాధ్యత కోసం చేసేవారే అసలైన విజేతలని కొనియాడారు. `చాలా మందికి తాము చేసే ఉద్యోగాలంటే ఇష్టం ఉండదు. కానీ తమ కుటుంబాలను పోషించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు కోసం, కడుపు నింపుకోవడం కోసం వారు ప్రతిరోజూ ఆ ఇష్టం లేని పనులకే వెళ్తుంటారు.
అలాంటి వారు పడే కష్టం, వారు చూపే అంకితభావం నా దృష్టిలో అత్యంత గొప్ప విజయం అని పేర్కొన్నారు. కేవలం లక్ష్యాలను సాధించే వారు మాత్రమే విజేతలు కాదు. కడుపు నింపుకోవడానికి బాధ్యతలను మోసేవారు కూడా వీరులే అని పీసీ అభిప్రాయపడ్డారు. సాధారణంగా సెలబ్రిటీలు `మీకు నచ్చిన పనినే చేయండి.. అప్పుడే విజయం వస్తుంది` అని చెబుతుంటారు. కానీ ప్రియాంక మాత్రం చాలా మంది వాస్తవ జీవితాన్ని ప్రస్తావించారు. `ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన పని చేసే అవకాశం దొరకదు. ఇష్టం లేకపోయినా ముఖంపై చిరునవ్వుతో బాధ్యతను నెరవేర్చే వ్యక్తిలో ఉండే ఆత్మస్థైర్యం సామాన్యమైంది కాదు.
ఆ పట్టుదలే వారిని నా దృష్టిలో ఒక సూపర్ హీరోని చేస్తుంది` అని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఒత్తిడిలో ఉన్న యువత, ప్రియాంక మాటలతో ఎంతో ఊరట పొందుతున్నారు. ఒక స్టార్ హోదాలో ఉండి కూడా సామాన్యుల కష్టాలను, వారి జీవన పోరాటాన్ని ఇంత సున్నితంగా అర్థం చేసుకోవడం ప్రియాంకలోని మానవత్వాన్ని చాటి చెబుతోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు సక్సెస్ అనే మాటకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.
కెరీర్ లో ఎత్తుపల్లాలను చూసి కుంగిపోకుండా? కుటుంబాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద లక్ష్యంగా పెట్టుకుని పోరాడే ప్రతి సామాన్యుడికి ఆమె మాటలు ఒక పెద్ద సెల్యూట్ లా నిలిచాయి. వెండితెరపై మెరిసే తారల వెనుక ఉండే గ్లామర్ కంటే, సామాన్యుడి చెమటలో ఉండే నిబద్ధతే మిన్న అని ఆమె నిరూపించారు. అందుకు గ్లోబల్ బ్యూటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రస్తుతం ప్రియాంక చోప్రా తెలుగు సినిమా `వారణాసి`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సూపర్ స్టార్ మహేష్ కు జోడీగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కోసం హైదరాబాద్ టూ అమెరికా తిరుగుతోంది.
