Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కి వెళ్లడంపై ప్రియాంక కామెంట్స్.. పరిస్థితులు అనుకూలించలేదా?

బాలీవుడ్ డెస్సీ గర్ల్ ప్రియాంకా చోప్రా ఇప్పుడు గ్లోబల్ ఐకాన్. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె సడన్‌గా హాలీవుడ్ బాట పట్టడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.

By:  Madhu Reddy   |   21 Feb 2026 3:00 PM IST
హాలీవుడ్ కి వెళ్లడంపై ప్రియాంక కామెంట్స్.. పరిస్థితులు అనుకూలించలేదా?
X

బాలీవుడ్ డెస్సీ గర్ల్ ప్రియాంకా చోప్రా ఇప్పుడు గ్లోబల్ ఐకాన్. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె సడన్‌గా హాలీవుడ్ బాట పట్టడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ నిర్ణయం వెనుక ఉన్న చేదు నిజాలను ఆమె బయటపెట్టారు. బాలీవుడ్లో ఎదురైన పరిస్థితులు తనను ఎలా అమెరికా వైపు నెట్టాయో ప్రియాంక వివరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

బాలీవుడ్ వదిలేయాలని అనుకోలేదు కానీ:

ప్రియాంక చోప్రా అంటే ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ క్వీన్. కానీ, హాలీవుడ్ ప్రయాణం గురించి ఆమె మాట్లాడుతూ.. తాను కావాలని హిందీ సినిమాలను వదిలి వెళ్లలేదని స్పష్టం చేశారు. "నేను ఎప్పుడూ బాలీవుడ్‌ను వీడాలని అనుకోలేదు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ నాకు అవకాశాలు పరిమితం అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఒక మూలకు నెట్టేశారు. ఒక కళాకారిణిగా నా ప్రతిభను నిరూపించుకోవడానికి కొత్త దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే నా పరిధిని విస్తరించుకోవాలని అమెరికాలో అడుగుపెట్టాను" అని ప్రియాంక ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

హాలీవుడ్‌లో పన్నెండేళ్ల పోరాటం:

ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పటికీ, హాలీవుడ్‌లో ప్రియాంక ప్రయాణం సున్నా నుంచి మొదలైంది. అక్కడ అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు అవుతోందని, ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. "మొదట్లో చిన్న చిన్న పాత్రల నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు అద్భుతమైన ప్రాజెక్ట్‌లను ఎంచుకునే స్థాయికి చేరుకున్నాను. ఇదంతా అంత ఈజీగా జరగలేదు" అని ఆమె వివరించారు. ప్రస్తుతం తాను హాలీవుడ్, బాలీవుడ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నానని, రెండు ఇండస్ట్రీలలోనూ పని చేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ప్రియాంక పేర్కొన్నారు.

మహేష్ బాబు 'వారణాసి'తో గ్రాండ్ కమ్‌బ్యాక్:

ఇక ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక మళ్లీ భారతీయ వెండితెరపై కనిపించబోతుండటం విశేషం. అది కూడా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'వారణాసి' చిత్రంతో ఆమె కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆమె చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. భారత్‌లో మళ్లీ సినిమాల్లో నటించడం తనకు సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని, ఈ కొత్త ఇన్నింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపారు. బాలీవుడ్ నుంచి ఎదురైన చేదు అనుభవాలను పక్కన పెట్టి, ఒక గ్లోబల్ స్టార్‌గా మళ్లీ ఇండియన్ స్క్రీన్‌పై ఆమె మెరవబోతుండటం అభిమానులకు పండగే అని చెప్పాలి.