Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌ను ఎప్ప‌టికీ అలా అడ‌గ‌ను-పృథ్వీరాజ్

అప్పుడప్పుడూ అనువాద చిత్రాలతోనూ పలకరించేవాడు. కానీ 'సలార్' మూవీలో కీలక పాత్రతో పృథ్వీరాజ్‌కు మన దగ్గర వచ్చిన గుర్తింపే వేరు

By:  Tupaki Desk   |   27 March 2024 9:45 AM GMT
ప్ర‌భాస్‌ను ఎప్ప‌టికీ అలా అడ‌గ‌ను-పృథ్వీరాజ్
X

తెలుగు వారికి ఈ మధ్య బాగా చేరువైన మలయాళ నటుడు పృథ్వీరాజ్. అతను తెలుగులో 'పోలీస్ పోలీస్' అనే డైరెక్ట్ మూవీ చేసిన విషయం జనాలకు పెద్దగా తెలియదు. అప్పుడప్పుడూ అనువాద చిత్రాలతోనూ పలకరించేవాడు. కానీ 'సలార్' మూవీలో కీలక పాత్రతో పృథ్వీరాజ్‌కు మన దగ్గర వచ్చిన గుర్తింపే వేరు. ఇప్పుడతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'ది గోట్ లైఫ్: ఆడుజీవితం'ను ఒకేసారి మలయాళంతో పాటు బహు భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. అందులో తెలుగు వెర్షన్ కూడా ఉంది. దీన్ని ప్రమోట్ చేసే విషయంలో పృథ్వీరాజ్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. హైదరాబాద్‌కు తన టీంతో విచ్చేసి అనేకమంది సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేయడమే కాక.. ప్రెస్ మీట్ పెట్టాడు. అలాగే మీడియాకు వన్ టు వన్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు.

ఐతే 'సలార్'లో తాను స్క్రీన్ చేసుకున్న ప్రభాస్‌నే పిలిచి ప్రమోషన్లకు ఉపయోగించుకుని ఉంటే సినిమాకు బాగా ఉపయోగపడేదనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది. ఇదే విషయం ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. పృథ్వీరాజ్ ఇచ్చిన సమాధానం విని హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేరు. ''నేను ప్రభాస్‌ను పిలిస్తే అతను నో చెప్పలేడు. కచ్చితంగా ప్రమోషనల్ ఈవెంట్‌కు వస్తాడు. కానీ అతను నో అనలేడు కాబట్టే నేను తనను పిలవలేను. స్నేహం ఉంది కదా అని మొహమాటపెట్టి సినిమాల ప్రమోషన్ల కోసం వాడుకోకూడదు. ఇప్పుడే కాదు.. నేనెప్పుడు ప్రభాస్‌ను నా సినిమా ప్రమోషన్ కోసం పిలవను. నేనొక మంచి సినిమా చేశాను. దాన్ని ప్రమోట్ చేయడానికి మీడియా, ప్రేక్షకులు చాలు. సినిమా నచ్చితే ప్రేక్షకులు చూస్తారు'' అని పృథ్వీరాజ్ చక్కటి సమాధానం చెప్పాడు. 'ది గోట్ లైఫ్' ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.