Begin typing your search above and press return to search.

పృథ్వీరాజ్.. మన హీరోపైనే కన్ను పడింది!

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు

By:  Tupaki Desk   |   27 March 2024 5:15 AM GMT
పృథ్వీరాజ్.. మన హీరోపైనే కన్ను పడింది!
X

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వేరే హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్వరలోనే ది గోట్ లైఫ్.. ఆడు జీవితం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో మరో రోజులో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సందడి చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. అయితే ఈ మూవీ కోసం 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఎంతో కష్టపడ్డారు. అంతకు మించి శ్రమించారు కూడా.

ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. ఈ మూవీ కోసం కఠినమైన ఆహార నియమాలు పాటించానని, 31 కిలోల బరువు కూడా తగ్గినట్లు తెలిపారు. తన ఆరోగ్యం కోసం ఫ్యామిలీ అంతా ఆందోళన చెందిందని కూడా వెల్లడించారు. అదే సమయంలో తన మనసులోని మాటను బయట పెట్టారు. టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణతో సినిమా చేయాలని ఉందని తెలిపారు.

మాస్ మసాలా కమ్ యాక్షన్ జానర్ లో బాలయ్యతో సినిమా చేయాలని ఉన్నట్లు తెలిపారు పృథ్వీరాజ్ సుకుమారన్. సాధారణంగా కాకుండా మంచి కమర్షియల్ మూవీ చేయాలని ఉందని కూడా చెప్పారు. పృథ్వీరాజ్ ఇప్పటికే తన డైరెక్షన్ టాలెంట్ ను సినీ ఆడియన్స్ కు చూపించారు. లూసిఫర్ మూవీ ద్వారా తన ప్రతిభను చాటారు. తెలుగులో ఇదే మూవీని మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

అయితే బాలయ్య కూడా ఆరు పదుల వయసులో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వరుస చిత్రాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. కరెక్ట్ స్క్రిప్ట్ దొరికితే.. డైరెక్షన్ బాగుంటే బాలయ్య అదరగొట్టేస్తారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్నారు. ఇక బాలయ్య- పృథ్వీరాజ్ ప్రాజెక్ట్ ఓకే అయితే తెలుగు ప్రేక్షకులకు సర్ ప్రైజింగ్ ట్రీట్ అని చెప్పవచ్చు. మరి పృథ్వీరాజ్ కోరికపై బాలయ్య స్పందిస్తారో లేదో చూడాలి.