కేరళ నుంచి వచ్చినా భారతీయుడినే!
అందులో భాగంగానే ఇప్పటికే ఇండియన్ సినిమాలో ఎన్నో దేశభక్తికి సంబంధించిన సినిమాలను భారీ బడ్జెట్ తో తీసి తమ భక్తిని చాటుకున్నారు.
By: Tupaki Desk | 22 July 2025 1:20 PM ISTఅందరిలానే సినీ సెలబ్రిటీలకు కూడా దేశ భక్తి ఉంటుంది. అయితే కొందరు తమ దేశ భక్తిని బయటపడి చూపిస్తే మరికొందరు మాత్రం దేశం పట్ల తమ భక్తిని మనసులోనే ఉంచుకుంటూ సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటపడతారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇండియన్ సినిమాలో ఎన్నో దేశభక్తికి సంబంధించిన సినిమాలను భారీ బడ్జెట్ తో తీసి తమ భక్తిని చాటుకున్నారు.
అయితే దేశభక్తి అనే పదానికి ఒక్కొక్కరు ఒక్కో అర్థాన్ని చెప్తారు. దేశం పట్ల ప్రేమను కూడా ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. కొందరు దేశం కోసం కష్టపడితే, ఇంకొందరు దేశానికి మంచి పేరు తీసుకుని రావడానికి కష్టపడతారు. మరికొందరైతే దేశం యొక్క గొప్పదనాన్ని తెలియచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరి డిక్షనరీలో దేశభక్తికి ఒక్కో మీనింగ్ ఉంటుంది.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇప్పుడు దేశభక్తికి అర్థం తెలిపారు. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సర్జమీన్ జులై 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో లో కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సర్జమీన్ లో పృథ్వీరాజ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆయన దేశభక్తి గురించి మాట్లాడారు.
దేశభక్తికి తన వద్ద ఒకటే అర్థముందని, ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మీరు ఎక్కడినుంచి వచ్చారని అడిగినప్పుడు ఊరి పేరు చెప్పకుండా ఇండియా నుంచి వచ్చానని చెప్తానని, అలా చెప్పడంలో ఓ గర్వముందని, అదే మన దేశంపై మనకున్న ప్రేమకు గుర్తు అని చెప్పిన ఆయన మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మన దేశాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
కేరళ నుంచి వచ్చి మలయాళం మాట్లాడినా, మహారాష్ట్ర నుంచి వచ్చి హిందీ మాట్లాడినా అన్నింటికంటే ముందు మనం భారతీయులమని, అందుకే తాను ఇతర దేశాలకు వెళ్లినప్పుడు భారత్ నుంచి వచ్చానని చెప్తానని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ఎస్ఎస్ఎంబీ29లో పృథ్వీరాజ్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
