మూవీ రివ్యూ : ప్రేమంటే
క్యారెక్టర్.. కామెడీ రోల్స్ చేస్తూనే ఇంకోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి.
By: Tupaki Desk | 21 Nov 2025 6:48 PM IST'ప్రేమంటే' మూవీ రివ్యూ
నటీనటులు: ప్రియదర్శి - ఆనంది - సుమ కనకాల - వెన్నెల కిషోర్ - కిరీటి - హైపర్ ఆది - రామ్ ప్రసాద్ తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి
నిర్మాతలు: సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్మోహన్ రావు
రచన - దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్
క్యారెక్టర్.. కామెడీ రోల్స్ చేస్తూనే ఇంకోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్న టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి. ఈ ఏడాది ఇప్పటికే కోర్ట్.. మిత్రమండలి సినిమాలతో పలకరించిన అతను ఇప్పుడు ప్రేమంటే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆనంది అతడి సరసన నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ రూపొందించాడు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
మధుసూదన్ రావు అలియాస్ మది (ప్రియదర్శి) స్నేహితులతో కలిసి ఒక సెక్యూరిటీ సర్వీసెస్ నడిపిస్తుంటాడు. అతను ఒక పెళ్ళిచూపులకు వెళ్ళినపుడు ఆ అమ్మాయితో సెట్ కాకపోయినా.. రమ్య (ఆనంది) అనే అమ్మాయితో కనెక్ట్ అవుతాడు. తర్వాత ఈ ఇద్దరి అభిరుచులు కలిసి పెళ్లి చేసుకుంటారు. అయితే కొన్ని రోజులకే మది మీద రమ్యకు అనుమానం మొదలవుతుంది. ఆమె అపార్థం తీర్చే క్రమంలో తన గురించి అసలు నిజం చెప్తాడు మది. ఇంతకీ ఆ నిజం ఏంటి.. దాని వల్ల వీళ్ళిద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగింది.. తర్వాత వీరి ప్రయాణం ఎలా సాగింది అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘ప్రేమంటే’ అనే టైటిల్ పెట్టారంటే.. ఇదేదో ప్రేమ గురించి లోతుగా చర్చించే ఫీల్ ఉన్న సినిమా అనుకుంటాం. కానీ థియేటర్లోకి అడుగు పెట్టిన కాసేపటికే ఇది వేరే రకం సినిమా అని అర్థమవుతుంది. జీవిత భాగస్వామి ఒక క్రిమినల్ అని తెలిసినా సరే.. అపార్థం చేసుకోకుండా పార్టనర్ కూడా ఆ క్రైంలో భాగం కావడమే ‘ప్రేమంటే’ అనే సత్యాన్ని బోధిస్తుందీ సినిమా. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో చెప్పకుండా దీని గురించి విశ్లేషించడం సాధ్యం కాదు కాబట్టి ‘స్పాయిలర్’ అయినా ఒక విషయం చెప్పుకోవాల్సిందే. ఇందులో హీరో ఒక దొంగ. మామూలుగా హీరోలు ఎందుకు దొంగలవుతారు? దాని వెనుక పెద్ద కష్టమే ఉంటుంది కదా? తాకట్టు పెట్టిన ఇల్లును విడిపించడమే ఆ కష్టం అన్నమాట. ఐతే కారణం ఏదైనా సరే.. ఇలా దొంగతనం చేయడమేంటి అంటూ ముందు అతణ్ని అసహ్యించుకున్న భార్య.. తర్వాత ‘స్కిల్’ చూసి అబ్బురపడిపోయి.. తన థ్రిల్ కోసం ఏం చేస్తుందన్నదే ఈ కథ. స్టోరీగా వినడానికి ఇది క్రేజీగా అనిపించి టీం అంతా ఎగ్జైట్ అయిందేమో కానీ.. తెర మీద ఈ విషయాలను ప్రెజెంట్ చేసిన తీరు మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దొంగతనాల్లో చూపించే ఒక ‘ఫాంటసీ’ పాయింటు అయితే మరీ విడ్డూరం. ఏదో జబర్దస్త్ స్కిట్లో చేసినంత తేలిగ్గా దాని మీద నడపించిన కామెడీ చూస్తే బుర్ర బద్దలైపోవడం ఖాయం. ఇలాంటి సన్నివేశాలతో ఫీచర్ ఫిలిం చేసి ప్రేక్షకులను మెప్పించగలమనుకోవడమే ఆశ్చర్యం.
ప్రియదర్శి గత నెలలో ‘మిత్రమండలి’ అనే కామెడీ సినిమా చేశాడు. అది మిస్ ఫైర్ అయింది. ఐతే కామెడీ కోసం ఎంత అతి చేసినా.. లాజిక్ లెస్ సీన్లు పెట్టినా ఓకే. అక్కడ కామెడీ పండకపోవడం సమస్య కానీ.. లాజిక్కుల గురించి.. అతి గురించి ఎవరూ కంప్లైంట్ చేయరు. కానీ ‘ప్రేమంటే’లో లవ్.. ఎమోషన్.. సెంటిమెంట్ అంటూ వేరే రసాలు కూడా కలిపి.. కథను మాత్రం ఏమాత్రం లాజిక్ లేకుండా చాలా సిల్లీగా నడిపించారు. సినిమాలో ఇటు నవ్వులూ పండలేదు.. అటు ఎమోషనూ వర్కవుట్ కాలేదు. అసహజంగా.. లాజిక్ లేకుండా సాగే కథాకథనాలు అందుకు ప్రధాన కారణం. ఆరంభంలో ఓ మోస్తరుగా అనిపించే ‘ప్రేమంటే’.. ప్లాట్ పాయింట్ రివీలయ్యాక మాత్రం ప్రతి సన్నివేశంలోనూ ఇదేం విడ్డూరం అనిపిస్తూ.. ముందుకు సాగుతుంది. ఒక పక్క దొంగతనాల వ్యవహారమే జుట్టు పీక్కునేలా చేస్తే.. ఇంకోపక్క కానిస్టేబుల్ సుమ చేసే ఇన్వెస్టిగేషన్ తంతు మరింతగా సహనానికి పరీక్ష పెడుతుంది. దొంగలు చేసే ‘బిరియాని’ చుట్టూ ఇందులో నడిపించిన కామెడీ అయితే మరీ వెటకారంగా అనిపిస్తుంది.
ఎస్ఐగా వెన్నెల కిషోర్.. కానిస్టేబుల్ గా సుమ.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ చేతిలో పెట్టుకుని వాళ్లకు రాసిన సీన్లు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. చిన్న హింట్ ఇస్తే అల్లుకుపోయే వాళ్లిద్దరితోనూ నవ్వించలేకపోవడం అంటే రైటింగ్ లోపమే. సుమ లెంగ్తీ క్యారెక్టర్ చేసినా.. దాని ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. ప్రియదర్శి-ఆనంది మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ కొంత వరకు పండినా.. ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మాత్రం విఫలమయ్యాయి. ఒక్క రాబరీ ఎపిసోడ్ మాత్రం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. ఆ తర్వాతి సీన్లన్నీ తీవ్ర నిరాశకు గురి చేస్తాయి. ప్రేక్షకులను కన్విన్స్ చేయలేనపుడు ఎంత క్రేజీ ఐడియా అయినా సిల్లీగా మారిపోతుందనడానికి ‘ప్రేమంటే’ రుజువుగా నిలుస్తుంది.
నటీనటులు:
ప్రియదర్శి హీరోగా ఎలాంటి సినిమాలు చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ‘కోర్ట్’తో ఆకట్టుకున్నప్పటికీ.. దానికి ముందు- తర్వాత ఎంచుకున్న కథలు తన అభిరుచిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పెర్ఫామెన్స్ పరంగా ప్రియదర్శి ఆకట్టుకున్నప్పటికీ.. తన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ వేయలేదు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన ఆనంది తన క్యారెక్టర్ని పండిచడానికి శక్తి వంచన లేకుండా కష్టపడింది. తన నటన సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్. ముందే అన్నట్లు సుమ కీలక పాత్రే చేసినా.. దాని ప్రభావం అంతంతమాత్రమే. కొన్ని చోట్ల తన మార్కు చమత్కారంతో నవ్వించినా.. చాలా వరకు తన పాత్ర విసిగిస్తుంది. వెన్నెల కిషోర్ కూడా అంతే. మిగతా ఆర్టిస్టులంతా ఎవరి పరిధిలో వాళ్లు నటించారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘ప్రేమంటే’ ఒక మోస్తరుగా అనిపిస్తుంది. లియోన్ జేమ్స్ పాటలు సోసోగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ‘8 వసంతాలు’లో ఆశ్చర్యపరిచిన కెమెరామన్ విశ్వనాథరెడ్డికి ఇక్కడ పెద్దగా స్కోప్ లేకపోయింది. తన పనితనం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్.. క్రేజీగా ఉండే కథను ఎంచుకున్నప్పటికీ ఎగ్జిక్యూషన్లో తడబడ్డాడు. మరీ తేలిగ్గా అనిపించేలా సీన్లు రాసుకోవడంతో సినిమాను ఏ దశలోనూ సీరియస్ గా తీసుకునే అవకాశం లేకపోయింది. పెద్దగా కామెడీని కూడా వర్కవుట్ చేయలేకపోయాడు.
చివరగా: ప్రేమంటే.. దారి తప్పిన ‘దోపిడీ’
రేటింగ్ - 2/5
