Begin typing your search above and press return to search.

ప్రేమలు.. మనోళ్ళకు ఎక్కలేదా?

అయితే మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. తెలుగు వారికి అంతగా కనెక్ట్ అవ్వలేదని తెలుస్తోంది. బోరింగ్ లవ్ కామెడీ మూవీ అంటున్నారు కొందరు నెటిజన్లు.

By:  Tupaki Desk   |   10 March 2024 6:15 AM GMT
ప్రేమలు.. మనోళ్ళకు ఎక్కలేదా?
X

మలయాళం సినిమాలు.. తక్కువ బడ్జెట్, డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరకెక్కి సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరిస్తుంటాయి. వాటిని కేవలం కేరళలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల మూవీ లవర్స్ కూడా ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే వాలెంటైన్స్ వీక్ లో రిలీజైన ప్రేమలు మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఫస్ట్ వీక్ లోనే రూ.18 కోట్లు వసూలు చేసి లాభాలు పంట పండిస్తోంది.

ఫ్యూచర్ కోసం యూకే వెళ్లాలని కలలు కనే ఓ యువకుడు.. సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన మరో యువతి మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా. భాగ్యనగరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ఇటీవల తెలుగులో విడుదలైంది. శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ మూవీని రాజమౌళి కుమారుడు కార్తికేయ రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.

అయితే మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. తెలుగు వారికి అంతగా కనెక్ట్ అవ్వలేదని తెలుస్తోంది. బోరింగ్ లవ్ కామెడీ మూవీ అంటున్నారు కొందరు నెటిజన్లు. నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయినా.. కొన్ని సీన్లు చాలా సాగదీతగా అనిపిస్తున్నాయని చెబుతున్నారు. లేదంటే అక్కడ భాషకు యూత్ కు తగ్గట్టుగా ఉన్న సీన్స్ తెలుగులో డబ్ చేసేసరికి సోల్ మిస్సయ్యిందేమో అనే టాక్ వస్తోంది.

కానీ ఈ మూవీ నిర్మాతలు ఫాహద్ ఫాజిల్, ఆయన స్నేహితుల విజన్ ను మెచ్చుకుంటున్నారు. తెలుగు సినిమాల్లో కూడా చూపించని హైదరాబాద్ అందాలను ఈ మూవీలో చూపించారని అంటున్నారు. గతంలో వచ్చిన ప్రేమమ్ సినిమాను తెలుగులో డబ్ చేయకుండా రీమేక్ చేశారు. ఎందుకంటే తెలుగులో నాగచైతన్య - శృతి హాసన్ - అనుపమ క్యారెక్టర్లతో తెలుగు ఆడియెన్స్ కు తగ్గట్టుగా కెమిస్ట్రీ సెట్ చేశారు. ఇక ఇప్పుడు ప్రేమలు విషయంలో రిస్క్ చేసి డబ్ చేయగా తేడా కొట్టేసింది.

నార్మల్ గా మాలీవుడ్ సినిమాలు థియేటర్లలో విడుదలైన నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ ఈ మూవీ కేరళలో మంచి వసూళ్లు రాబడుతుండడంతో ఓటీటీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేమలు సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

థియేటర్లలోకి వచ్చిన 50 రోజుల తర్వాత ఓటీటీలో ప్రేమలు మూవీని మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగు వెర్షన్ ఇటీవల రిలీజై మిక్స్ డ్ టాక్ సంపాదించుకోవడంతో మరి ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ మూవీ ఎలాంటి లాభాలు సంపాదిస్తుందో వేచి చూడాలి.