Begin typing your search above and press return to search.

ప్రేమలు, మంజిమల్ బాయ్స్.. పెట్టింది తక్కువే..

మలయాళం ఇండస్ట్రీలో మొదటి నుంచి కంటెంట్ ని నమ్ముకొని దర్శక, నిర్మాతలు సినిమాలు చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   28 March 2024 5:09 AM GMT
ప్రేమలు, మంజిమల్ బాయ్స్.. పెట్టింది తక్కువే..
X

మలయాళం ఇండస్ట్రీలో మొదటి నుంచి కంటెంట్ ని నమ్ముకొని దర్శక, నిర్మాతలు సినిమాలు చేస్తూ ఉంటారు. మంచి కథ, కథనం ఉంటే భారీ బడ్జెట్ లతో పనిలేదని విశ్వసిస్తారు. హీరోలు సైతం స్టార్ ఇమేజ్ కేలిక్యులేషన్స్ లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తమని తాము కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు కథాబలం ఉన్న మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సక్సెస్ లు అందుకుంటారు.

అందుకే మలయాళ చిత్రపరిశ్రమ మీద ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అక్కడ సినిమాల బడ్జెట్ లు కూడా చాలా తక్కువ ఉంటాయి. అనవసరమైన ఆర్భాటాలు లేకుండా రియలిస్టిక్ లొకేషన్స్ లోనే కథలని ఆవిష్కరించే ప్రయత్నం చేయడం వలన పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువగా ఉండదు. అలాగే షూటింగ్స్ కూడా చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేసేస్తూ ఉంటారు.

గత నెలలో మలయాళంలో రిలీజ్ అయిన రెండు సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అవి ప్రేమలు, మంజిమల్ బాయ్స్. ప్రేమలు సినిమాని కేవలం 5 కోట్ల బడ్జెట్ తో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. యూత్ ఈ సినిమాలోని పాత్రలని కనెక్ట్ చేసుకోవడంతో సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

దీంతో కలెక్షన్స్ బీభత్సంగా వచ్చాయి. ఇప్పటి వరకు 125 కోట్ల గ్రాస్ ని ఈ మూవీ వసూళ్లు చేయడం విశేషం. తెలుగులో కూడా ప్రేమలు డబ్బింగ్ వెర్షన్ కి పరవాలేదు అనేలా కలెక్షన్లు వచ్చాయి. కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం మన వారికి కనెక్ట్ కాలేదు. ఇక రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో సర్వైవల్ డ్రామాగా మంజిమల్ బాయ్స్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి చేసే జర్నీ కథాంశంతో ఈ మూవీ వచ్చింది.

మొదటి రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మూవీ ఏకంగా 215 కోట్లు కలెక్ట్ చేసింది. మలయాళీ ఇండస్ట్రీ ఇదే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా కావడం విశేషం. ఈ మూవీ బడ్జెట్ కేవలం 20 కోట్లు మాత్రమే. అంటే ప్రేమలు, మంజిమల్ బాయ్స్ సినిమాలకి పెట్టిన పెట్టుబడిలో 10 రేట్లు అధికంగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాల స్ఫూర్తితో అయిన టాలీవుడ్ దర్శకులు కొత్త కథలని ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.