Begin typing your search above and press return to search.

అక్కినేని ప్రేమాభిషేకం...అరవై పాటలు !

అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్రలో ప్రేమాభిషేకానికి ప్రత్యేకత ఎంతో ఉంది. అప్పటికి నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ ని పూర్తి చేసుకుని ఎన్నో విజయాలను అందుకున్నారు అక్కినేని.

By:  Satya P   |   1 April 2026 9:09 AM IST
అక్కినేని ప్రేమాభిషేకం...అరవై పాటలు !
X

అక్కినేని నాగేశ్వరరావు సినీ చరిత్రలో ప్రేమాభిషేకానికి ప్రత్యేకత ఎంతో ఉంది. అప్పటికి నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ ని పూర్తి చేసుకుని ఎన్నో విజయాలను అందుకున్నారు అక్కినేని. ఇక క్రిష్ణ శోభన్ బాబులతో పోటీ పడి నటించారు. ఆ తరువాత తరం కూడా వచ్చిన సందర్భం అది. అక్కినేనికి యాభై అరవై దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. డెబ్బై దశకం తొలి నాళ్ళలో ప్రేమ నగర్ దసరా బుల్లోడు వంటి సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే 1974లో ఆయన హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళి ఏడాది తరువాత తిరిగి వచ్చారు. ఈ లోగా సినీ ఇండస్ట్రీలో కూడా పరిస్థితులు మారాయి. శోభన్ బాబు అక్కినేని ప్లేస్ లోకి వచ్చి హిట్లు అందుకుంటున్న నేపథ్యం ఉంది.

ఆ స్థాయి విజయాలు :

అయితే అక్కినేని 1976 నుంచి మళ్ళీ నటించడం మొదలెట్టారు. కానీ గతంలో వచ్చిన సూపర్ హిట్స్ స్థాయిలో అయితే విజయాలు దక్కలేదు. సక్సెస్ అంటూ కొన్ని సినిమాలు వచ్చినా అక్కినేని వారి దాహం తీర్చే ఘన విజయాలు ఖాతాలో పడలేదు. సరిగ్గా ఆ సమయంలో దర్శకరత్న దాసరి నారాయణరావుతో అక్కినేని జోడీ విజయాల పరంపరకు మళ్ళీ దారి తీసేలా చేసింది. ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు సినిమాలతో అక్కినేనికి సూపర్ హిట్లు ఇచ్చిన దాసరి ఆ తరువాత తీసిన సినిమావే ప్రేమాభిషేకం. ఈ మూవీని అక్కినేని తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణా స్టూడియోస్ పతాకం మీద తీశారు. 1981 ఫిబ్రవరి 18న విడుదల అయిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులనే బద్ధలు కొట్టి టాలీవుడ్ టాప్ టెన్ మూవీలో అగ్ర స్థానంలో నిలిచింది.

ఎంతగానో నచ్చుకుని :

ఈ సినిమా కధను ఎంతగానో నచ్చుకున్న అక్కినేని మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. ఇక 1980 ద్వితీయార్ధంలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. దాని కంటే ముందు పాటల కోసం అన్నపూర్ణా స్టూడియోస్ లో అక్కినేని దాసరి సినీ దర్శకుడు కం గీత రచయిత దాసరి, సంగీత దర్శకుడు చక్రవర్తి అంతా సిట్టింగ్ వేశారు. రోజూ రాత్రులు ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగేవి. మద్రాస్ లో అప్పటికే ఫుల్ బిజీగా ఉన్న చక్రవర్తి రాత్రి ఫ్లైట్ కి హైదరాబాద్ చేరుకుని రాత్రి అంతా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొని తెల్లారుతూనే చెన్నైకి వెళ్ళేవారు అని చెబుతారు. అలా రోజుల తరబడి సాగిన ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఏకంగా అరవై ట్యూన్ల దాకా చక్రవర్తి ఇచ్చారు. ఇక పాటలు కూడా ఎన్నో రాయించి ట్యూన్లు కట్టి కూడా అందులో నచ్చవిని పక్కన పెట్టి కొత్త వాటి కోసం మళ్ళీ అన్వేషణ చేస్తూ ఈ సంగీత యాగం సాగింది.

ఇంద్రధస్సులా ఏడు పాటలు :

ఇలా అనేక రోజుల పాటు సాగిన ఈ మ్యూజిక్ సిట్టింగు నుంచి ఇంద్ర ధనస్సులాంటి ఏడు పాటలను అక్కినేని ఎంపిక చేశారు అని చెబుతారు. అవే ఈ రోజుకీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన నా కళ్ళు చెబుతున్నాయి, దేవీ మౌనమా, ఒక దేవుని గుడిలో, కోటప్ప కొండకు, తారలు దిగి వచ్చిన వేళ, వందనం అభివందనం, ఆగదూ ఆగదూ పాటలు. ఇవన్నీ ఎస్పీబీ సుశీల ఎంతో అద్భుతంగా ఆలపించారు. చక్రవర్తి అందమైన బాణీలు కట్టారు.

జీవితాన్ని చూడు అంటూ :

ఇక ఈ మూవీలో రికార్డు అయి సినిమాలో వాడని ఎనిమిదవ పాట ఒకటి ఉంది. అదే జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో మారుతుంది చూడు వింత వింత రంగుల్లో అదే జీవితం ఇదే శాశ్వతం అంటూ సాగే ఈ పాటను ఎస్పీబీ భావయుక్తంగా పాడారు, దాసరి రాసిన ఈ పాటకు మంచి బాణీని చక్రవర్తి కట్టారు. కానీ ఎందుకో సినిమాలో మాత్రం ఈ పాటను వాడుకోలేదు. అయితే రికార్డుల్లో మాత్రం ఈ పాట అప్పటికీ ఇప్పటికీ వినిపిస్తూ అక్కినేని అభిమానులను రంజింపచేస్తూనే ఉంది.